Jagan Team 3.0 : ఏపీ కేబినెట్‌లో మళ్లీ మార్పులు.. ఆ ఇద్దరు మాజీ మంత్రులను తీసుకునే యోచనలో వైఎస్ జగన్..!
ABN , First Publish Date - 2023-03-31T23:15:55+05:30 IST
ఏపీలో మరోసారి మంత్రివర్గ విస్తరణ (AP Cabinet Expansion) ఉంటుందా..? ఇప్పటికే రెండుసార్లు మంత్రివర్గ విస్తరణ జరగ్గా మరోసారి కేబినెట్‌ను విస్తరించే పనిలో సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) నిమగ్నమయ్యారా..?
ఏపీలో మరోసారి మంత్రివర్గ విస్తరణ (AP Cabinet Expansion) ఉంటుందా..? ఇప్పటికే రెండుసార్లు మంత్రివర్గ విస్తరణ జరగ్గా మరోసారి కేబినెట్‌ను విస్తరించే పనిలో సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) నిమగ్నమయ్యారా..? పనితీరు ఆధారంగానే అని చెబుతున్నా రాజకీయ సమీకరణలతోనే మార్పులు, చేర్పులకు జగన్ ప్లాన్ చేస్తున్నారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే ముహూర్తం ఫిక్స్ కానుందా..? అది కూడా కేబినెట్‌లో ఇదివరకు పనిచేసిన ఇద్దరు పాత మంత్రులను కేబినెట్‌లోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నారా..? ఈ ఇద్దరితో పాటు శాసనమండలి నుంచి ఒకర్ని తీసుకోవడానికి కూడా సీఎం ప్లాన్ చేస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ టైమ్‌లోనే జగన్ మార్పులు, చేయాలని ఎందుకు అనుకుంటున్నారు.. ఎవరెవర్ని కేబినెట్‌లోకి తీసుకుంటారనే విషయాలపై ప్రత్యేక కథనం.
అసలు కథ ఇదేనా..!?
ఎన్నికలకు సరిగ్గా ఏడాది మాత్రమే సమయం ఉంది. అయితే ఈ టైమ్‌లో జగన్ ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన జగన్ మరోసారి మార్పులు, చేర్పులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టడానికి ఇప్పుడు ఉండే మంత్రులు అంతగా యాక్టివ్‌గా లేరని.. అందుకే ఇద్దరు పాత వ్యక్తులను కేబినెట్‌లోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నారట. అందులో ఒకరు కొడాలి నాని (Kodali Nani), మరొకరు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (Balineni Srinivas Reddy) అని తెలుస్తోంది. ఈ ఇద్దరితో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేత, ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని (Nallapareddy Prasanna Kumar Reddy) కేబినెట్‌లోకి తీసుకుంటారని జోరుగా చర్చ జరుగుతోంది. ఈయన్ను కేబినెట్‌లోకి తీసుకోవడంతో ఈ మధ్య జిల్లాలో జరిగిన పరిణామాలకు చెక్ పెట్టొచ్చన్నది జగన్ వ్యూహమట. రాజకీయ విమర్శలను తిప్పికొట్టడంలో కొడాలి నాని దిట్ట అని జగన్ అనుకుంటున్నారట. అయితే ఆయన్ను బూతుల మంత్రిగా ప్రతిపక్షాలు పిలుచుకుంటాయి. వీరితో పాటు మరొకర్ని శాసన మండలి నుంచి కేబినెట్‌లోకి తీసుకునే ఛాన్స్ ఉందట. ఎమ్మెల్సీల్లో మాత్రం ఒకరు గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన మర్రి రాజశేఖర్‌ను (Marri Rajasekhar) తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయట. అయితే.. ఈ కూర్పులో గోదావరి జిల్లాలకు ప్రాధాన్యత ఉంటుందని కూడా వైసీపీలో చర్చ నడుస్తోంది. కాపుల్లో పట్టుకోసం జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం తెలిసిందే. కాపుల్లో బాగా పలుకుబడి ఉన్నవారిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని జగన్ అనుకుంటున్నారట.
ఈ వరుస భేటీలు ఇందుకేనా..?
వాస్తవానికి మండలి నుంచి ఒక్కరు కూడా మంత్రిగా లేరు. అప్పట్లో ఒకరిద్దరు ఉన్నా వారిని రాజ్యసభకు పంపిన తర్వాత మండలి నుంచి ఎవర్నీ తీసుకోలేదు. ఇప్పుడు మండలిలో వైసీపీకి 43 మంది సభ్యుల బలం ఉంది. కేబినెట్‌లోకి తీసుకునే వారిని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకున్నారని అప్పట్లో టాక్ నడిచింది. దీంతో కొత్తగా మంత్రి వర్గంలోకి ఎవర్ని తీసుకుంటారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. మొత్తమ్మీద ఇద్దరు పాత మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్సీలను తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మధ్య గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో (AP Governer Abdul Nazeer) జగన్ వరుస భేటీలు కావడంతో పక్కాగా కేబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ.. ఆ తర్వాత ఒకరిద్దరు మంత్రులు దీన్ని ఖండించారు. అయితే.. ఏప్రిల్-3న ఎమ్మెల్యేలతో జరిగే కీలక సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగనుందట. ఆ తర్వాత వారం వ్యవధిలోనే ప్రమాణ స్వీకారం ఉంటుందని వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
ఎవరు ఔట్ అవుతారో..!
ఇప్పటికే రెండుసార్లు మంత్రివర్గ సమావేశంలో ముగ్గురు, నలుగురు మంత్రుల్ని మారుస్తామని జగన్ హెచ్చరించిన విషయం విదితమే. అందులో ఒకరు రాయలసీమకు చెందిన మహిళా మంత్రి, మిగిలిన ముగ్గురిలో ఒకరు ఉత్తరాంధ్ర, మిగిలిన ఇద్దరు గోదావరి జిల్లాలకు చెందిన వారు ఉన్నారని బయటికి వార్తలొచ్చాయి. ఈ ముగ్గుర్నీ పలుమార్లు హెచ్చరించిన పద్ధతులు మారకపోవడం, ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఎన్నికలకు ముందు కేబినెట్ విస్తరణ చేపట్టాలని జగన్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఎవరినైతే మంత్రివర్గం నుంచి తీసేస్తారో వారికి జిల్లాల బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయట. కాగా శుక్రవారం నాడు ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రిని జగన్ క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకున్న విషయం తెలిసిందే.
మొత్తానికి చూస్తే.. ముగ్గురు లేదా నలుగురు మంత్రులు మాత్రం కేబినెట్ నుంచి తప్పిస్తారనే వార్తలు మాత్రం పక్కగా అర్థమవుతోంది. ఆ నలుగురు ఎవరో..? వారి స్థానంలో ఎవర్ని తీసుకుంటారో..? ఇంతకీ మంత్రి పదవులు దక్కించుకునే ఆ అదృష్టవంతులు ఎవరు..? మండలి నుంచి కేబినెట్‌లో చోటు దక్కించుకునేదెవరో తెలియాలంటే మరో మూడ్రోజులు వేచి చూడాల్సిందే మరి.