Singer Kailash Kher: మొన్న మంగ్లీపై.. ఇవాళ కైలాష్ ఖేర్‌పై.. కన్నడ నాట హద్దులు మీరుతున్న భాషాభిమానం

ABN , First Publish Date - 2023-01-30T13:05:35+05:30 IST

దక్షిణాది రాష్ట్రాల్లో భాషాభిమానం అనగానే ఠక్కున గుర్తొచ్చే రాష్ట్రం తమిళనాడు. తమిళ భాషపై వాళ్లు పెంచుకున్న మమకారం హిందీని నేర్చుకోకూడదని భీష్మించుకుని కూర్చునేంత వరకూ..

Singer Kailash Kher: మొన్న మంగ్లీపై.. ఇవాళ కైలాష్ ఖేర్‌పై.. కన్నడ నాట హద్దులు మీరుతున్న భాషాభిమానం

దక్షిణాది రాష్ట్రాల్లో భాషాభిమానం అనగానే ఠక్కున గుర్తొచ్చే రాష్ట్రం తమిళనాడు (Tamilnadu). తమిళ భాషపై వాళ్లు పెంచుకున్న మమకారం హిందీని నేర్చుకోకూడదని భీష్మించుకుని కూర్చునేంత వరకూ వెళ్లింది. ‘తమిళనాడు’ పేరును ‘తమిళగం’గా మార్చడం సబబంటూ గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి చేసిన వ్యాఖ్యలపై ఇటీవల ఎంత దుమారం రేగిందో తెలియంది కాదు. ట్విట్టర్‌లో కూడా తమిళులు గవర్నర్‌పై విరుచుకుపడ్డారు. తమిళనాడుతో పోల్చుకుంటే ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో భాషాభిమానం కొంత తక్కువనే చెప్పక తప్పదు. కానీ.. ఇటీవల పొరుగు రాష్ట్రం కర్ణాటకలో (Karnataka) కూడా భాషాభిమానం బాగానే కనిపిస్తోంది. అయితే.. ఆ భాషాభిమానం హద్దులు దాటి భౌతిక దాడులకు పాల్పడటమే ఆందోళన కలిగించే విషయం.

కర్ణాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ మంగ్లీ (Singer Mangli) కన్నడలో మాట్లాడకపోవడంపై కన్నడ భాషాభిమానులు మండిపడ్డారు. కన్నడ సినీ పరిశ్రమలో కూడా అవకాశాలు రావడం అవసరం కాబట్టి తనపై ఎలాంటి దాడి జరగలేదని మంగ్లీ వివరణ ఇచ్చుకుని ఉండొచ్చు. కానీ.. అక్కడ జరిగింది వేరు. ఆమె కారుపై దాడి జరిగినట్లు ఫొటోలతో సహా వార్తలు కూడా వచ్చాయి. తాజాగా.. ఇలాంటి ఘటనే కర్ణాటకలో మరొకటి జరిగింది.

ప్రముఖ నేపథ్య గాయకుడు కైలాష్ ఖేర్‌పై (Singer Kailash Kher) బాటిల్ విసరడం కలకలం రేపింది. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరలోని హంపిలో జరుగుతున్న ‘హంపి ఉత్సవ్’ (Hampi Utsav) ముగింపు కార్యక్రమంలో సింగర్ కైలాష్ ఖేర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయిన వారిలో జోష్ నింపేందుకు కొన్ని పాటలను పాడారు. అయితే.. కన్నడ పాటలు పాడలేదనే కారణంగా ఒకతను కైలాష్ ఖేర్‌పై బాటిల్ విసిరాడు. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అయితే.. మెజార్టీ నెటిజన్లు మాత్రం ఈ ఘటనను ఖండించారు.

కన్నడ పాటలు పాడించుకోవాలనుకుంటే కన్నడ గాయకులనే ఆహ్వానించాలని, కైలాష్ ఖేర్ కన్నడ సినిమాల్లో చాలా పాటలు పాడిన విషయాన్ని గుర్తుచేసుకోవాలని ట్విట్టర్‌లో కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మరికొందరేమో.. భాషను అభిమానించడంలో ఎవరికీ అభ్యంతరం లేదని, కానీ.. ఆ భాష మాట్లాడని వారిపై భౌతిక దాడులకు దిగడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హర్షించదగ్గ పరిణామం కాదని ట్వీట్స్ చేశారు.

కైలాష్ ఖేర్ ప్రస్తుతానికైతే ఈ ఘటనపై స్పందించలేదు. కైలాష్ ఖేర్ తెలుగులో కూడా చాలా హిట్ సాంగ్స్ పాడిన సంగతి తెలిసిందే. ‘అరుంధతి’ సినిమాలోని ‘కమ్ముకున్న చీకట్లోన’ అనే పాట, మిర్చిలోని ‘పండగలా దిగివచ్చావు’, ‘భరత్ అనే నేను’ సినిమాలోని ‘వచ్చాడయ్యో సామి’ పాటలు టాలీవుడ్‌లో కైలాష్ ఖేర్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. కైలాష్ ఖేర్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సింగర్. ఆయన కశ్మీరీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కావడంతో సహజంగానే హిందీపై మంచి పట్టు ఉంది. బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్స్ సాంగ్స్ పాడాడు.

Updated Date - 2023-01-30T13:08:48+05:30 IST