New Planets: వావ్.. 200 లకుపైగా కొత్త గ్రహాలను కొనుగొన్న శాస్త్రవేత్తలు

ABN , First Publish Date - 2023-01-01T16:35:08+05:30 IST

ఖగోళ రహస్యాల చేధనలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న అంతరిక్ష పరిశోధకులు (Astronomers) 2022లో సౌరవ్యవస్థకు (Solar system) ఆవల ఏకంగా 200లకుపైగా కొత్త గ్రహాలను (new planets) గుర్తించారు.

New Planets: వావ్.. 200 లకుపైగా కొత్త గ్రహాలను కొనుగొన్న శాస్త్రవేత్తలు

వాషింగ్టన్: ఖగోళ రహస్యాల చేధనలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న అంతరిక్ష పరిశోధకులు (Astronomers) 2022లో సౌరవ్యవస్థకు (Solar system) ఆవల ఏకంగా 200లకుపైగా కొత్త గ్రహాలను (new planets) గుర్తించారు. దీంతో గతేడాది చివరినాటికి సౌరమండలం వెలుపల గుర్తించిన గ్రహాల సంఖ్య 5,235 దాటింది. ఎక్సోప్లానెట్స్‌ను (exoplanets) (సౌర వ్యవస్థకు అవతలి గ్రహాలు) కొనుగొనాలనే శాస్త్రవేత్తల ఉత్సుకతకు జెమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఆవిష్కరణ (James Webb Space Telescope) ఎంతగానో దోహదపడింది. నక్షత్రాల జీవక్రమంపై అధ్యయనం, సోలార్ సిస్టమ్‌లో భూమికి వెలుపలి గ్రహాలు, ఎగ్జోప్లానెట్స్‌పై అధ్యయనమే ఈ టెలిస్కోప్ ముఖ్యోద్దేశ్యంగా ఉంది. అందుకోసమే ఏకంగా 10 బిలియన్ డాలర్లతో ఈ టెలిస్కోప్‌ను రూపొందించారు. జులై 2022 నుంచి కాస్మిక్ చిత్రాలను పంపించడం మొదలుపెట్టింది.

ఈ మేరకు ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) ట్వీట్ చేసింది. ‘‘ 500 కంటే తక్కువ గ్రహాలతో 2022 సంవత్సరాన్ని ప్రారంభించాం. 5,235 గ్రహాలతో ముగించాం. ఈ గ్రహాల్లో 4 శాతానికిపైగా భూమి లేదా అంగారకుడు వంటి రాతి గ్రహాలే. మరి నూతన ఏడాది ఏం తీసుకొస్తుందో?.. మరిన్ని గ్రహాలు!’’ అంటూ నాసా పేర్కొంది. ఎగ్జోప్లానెట్స్ మిశ్రమం, లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. కొన్ని చిన్నగా, రాతిగా ఉండగా.. మరికొన్ని భూమిలా కనిపిస్తున్నాయని నాసా తెలిపింది. 2022లో చివరిగా కనుగొన్న గ్రహం పేరు ‘హెచ్‌డీ 1098333 బీ’గా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది నెప్ట్యూన్ మాదిరిగా ఉందని, జీ-టైప్ స్టార్ (G-type star) చుట్టు ఒక కక్ష్యలో ఇది తిరుగుతోందని వివరించారు. పరిశోధకులు ‘ట్రాన్సిట్ మెథడ్’ను ఉపయోగించి దీనిని గుర్తించారు. ఇక ఇటివల గుర్తించిన ఎగ్జోప్లానెట్స్‌లో రెండింట్లో నీరు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.

Updated Date - 2023-01-01T16:36:44+05:30 IST