Megastar Chiranjeevi: ‘వీరయ్య’కు ఒక రోజు గ్యాప్ నిర్ణయం నాదే.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2023-01-11T19:29:26+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ మాహారాజా రవితేజ (Ravi Teja), దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) (Bobby Kolli) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం

Megastar Chiranjeevi: ‘వీరయ్య’కు ఒక రోజు గ్యాప్ నిర్ణయం నాదే.. ఎందుకంటే?
Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ మాహారాజా రవితేజ (Ravi Teja), దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) (Bobby Kolli) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి ఈ సంక్రాంతికి సిద్ధమైంది. చిరంజీవి సరసన శృతి హాసన్ (Shruti Haasan) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించింది. అల్బమ్‌ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకాలు లోడింగ్ పాటలు బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌‌గా విడుదలవుతోన్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

‘వాల్తేరు వీరయ్య’లో వింటేజ్ వైబ్ కనిపిస్తోంది. షూటింగ్ చేస్తున్నపుడు ఆ పాత్రతో మళ్ళీ యంగేజ్ వైబ్ వచ్చిందా?

ప్రేక్షకులు, అభిమానులు నన్ను కమర్షియల్ సినిమాల్లో చూడటాడానికే ఎక్కువగా ఇష్టపడతారు. నాకు మాత్రం అన్ని రకాల వైవిధ్యమైన పాత్రలు చేయాలని వుంది. శుభలేఖ, స్వయంకృషి, మంత్రి గారి వియ్యంకుడు లాంటి చిత్రాలు.. వైవిధ్యమైన పాత్రలు చేయాలనే తాపత్రయం నుండి వచ్చినవే. అయితే రానురాను.. ఆర్ధికంగా కమర్షియల్‌గా ముడిపడిన ఈ పరిశ్రమలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ మేలుని దృష్టిలో పెట్టుకొని.. మనకి ఏం కావాలనేదాని కంటే ప్రేక్షకులు మన నుండి ఏం కోరుకుంటున్నారో.. అది ఇవ్వడానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చాను. కమ్ బ్యాక్‌లో కూడా ఫ్రీడమ్ ఫైటర్ ‘సైరా’.. పాటలు, హీరోయిన్ లేకుండా పవర్ ఫుల్ పాత్రగా ‘గాడ్ ఫాదర్’ చేశాను. ఇవన్నీ కూడా గౌరవప్రదమైన హిట్లు అందుకున్నాయి. అయితే ప్రేక్షకులు నా నుండి ఏం కోరుకుంటున్నారో అది వందకి వందశాతం ఇవ్వాలనే ప్రయత్నంతో ‘వాల్తేరు వీరయ్య’ చేశాను. ఇది కచ్చితంగా ప్రేక్షకులని అలరిస్తుంది. మరోసారి వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసుకునే అవకాశం వుంటుంది. ముఠామేస్త్రీ, ఘరానామొగుడు, రౌడీ అల్లుడు లాంటి చిత్రాలని రీ కలక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చింది ‘వాల్తేరు వీరయ్య’. షూటింగ్‌ని చాలా ఎంజాయ్ చేశాను. దీనికి ప్రధాన కారణం దర్శకుడు బాబీ కూడా. తను ఏం చూడాలని అనుకుంటున్నాడో అవన్నీ నా నుండి రాబట్టుకోవడం కోసం చాలా తపనతో పని చేశాడు. షూటింగ్ చాలా ఉత్సాహంగా జరిగింది. (Megastar Chiranjeevi Interview)

మీరు చాలా అనుభవం గల హీరో.. కొత్త దర్శకులతో పని చేస్తున్నపుడు వారికి కావాల్సిన ఫ్రీడమ్‌ని ఎలా క్రియేట్ చేస్తారు?

నేను ఎప్పుడూ మానిటర్ చూడను. నేను షాట్ చేస్తున్నప్పుడు దర్శకుడు ‘ఓకే’ అనేంతవరకూ అక్కడి నుండి కదలను. నేను ఎప్పుడూ దర్శకుడి ‘ఓకే’ కోసం ఎదురుచూస్తాను. కొత్త యాక్టర్‌ని డీల్ చేస్తున్న కంఫర్ట్ దర్శకులకు ఇస్తాను.

మొన్న రిటైర్‌మెంట్ గురించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి?

కష్టపడేతత్త్వం లేనప్పుడు రిటైర్ మెంట్ తీసుకోవడమే మంచిదని అన్నాను. కెరీర్ మొదట్లో ఒక ఆకలి వుంటుంది. ఒక పేరు తెచ్చుకోవాలి, మనల్ని మనం తెరపై చూసుకోవాలనే స్పిరిట్ .. కొంతకాలం తర్వాత ఎందుకు వుండకూడదు. కష్టపడాలి. అమితాబ్ బచ్చన్ గారు ఇప్పటికీ హార్డ్ వర్క్ చేస్తారు. ఇక్కడ ఎప్పుడూ అర్ద ఆకలితో వుండాలి. కడుపు నిండిన వ్యవహారంలా వుంటే మాత్రం అనుకున్నది డెలివర్ చేయలేవని చెప్పడమే నా ఉద్దేశం.

ఇన్నేళ్ళ తర్వాత కూడా ఏ ఎలిమెంట్ మిమ్మల్ని ఆ ఆకలి, కసితో డెలివర్ చేస్తోంది?

కేవలం ప్రేక్షకుల యొక్క ఆదరణ నా డ్రైవింగ్ ఫోర్స్. వాళ్ళు ఆదరిస్తున్నారు కాబట్టే చేయగలుగుతున్నా. బావగారు బాగున్నారా లో బంగీ జంప్ చేస్తున్నపుడు.. ఇది ప్రేక్షకులు చూస్తే ఎంతో ఎక్సయిట్‌గా ఫీలౌతారు.. వాట్ ఏ ఫీట్ అని క్లాప్స్ కొడతారని ఊహించుకున్న తర్వాత ఎక్కడలేని ఎనర్జీ వచ్చింది. చాలా రిలాక్స్‌గా దూకాను. ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ నన్ను ముందుకు నడుపుతుంది.

రవితేజలో అప్పటికీ, ఇప్పటికీ ఏం తేడాలు గమనించారు?

రవితేజ అప్పటికీ ఇప్పటికీ ఒకే మనిషి. ఇమేజ్ వచ్చిన తర్వాత తనలో వచ్చిన మార్పులు ఏమీ లేవు. అదే ఎనర్జీతో వున్నాడు. తన ఆహారపు అలవాట్లు కూడా మారలేదు. అప్పటికీ ఇప్పటికీ అదే ప్రేమ, ఉత్సాహం వున్నాయి. వాల్తేరు వీరయ్యలో రవితేజ పాత్ర కథకు మరింత బలం చేకూరుస్తుంది. తన పాత్రలో చాలా ఎమోషన్ వుంటుంది. ఆ పాత్రకు చక్కని న్యాయం చేశాడు.

ఒక పాట కోసం భారీ సెట్ వేశారు కదా... మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) మేకింగ్ గురించి?

మైత్రీ మూవీ మేకర్స్ లాంటి నిర్మాతలు చాలా అరుదుగా వుంటారు. ఖర్చుకు వెనకడుగు వేయకుండా ఒక ప్యాషన్‌తో సినిమాలు చేస్తున్నారు. ‘ఖర్చు విషయంలో జాగ్రత్త. మీ లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి’ అని చెబుతుంటాను. బాబీకి కూడా అదే విషయం చెప్పాను. ఎక్కడ వృధా కాకుండా బాబీ చక్కని పనితనం చూపించాడు. దాని వలన నిర్మాతలకు కూడా చాలా కలిసొచ్చింది. నిర్మాతల బాగోగులు చూడాల్సిన బాధ్యత దర్శకులపై కూడా వుంది. షూటింగ్‌లో ఒక రోజుకి నలభై లక్షల రూపాయిలు ఖర్చు అయ్యేది. మారేడుమిల్లిలో షూట్ చేస్తున్నపుడు అక్కడ ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ తో కూర్చుని ప్లాన్ చేసి ఎక్కడా వృధా కాకుండా చేయగలిగాం. మలేసియాలో కూడా షూట్ చేశాం.

Chiru.jpg

సంక్రాంతికి మీ సినిమా ఎప్పుడూ ముందు వస్తుంది. ఈసారి లాస్ట్ వస్తున్నారు. ఆ నిర్ణయం కూడా మీదే అని తెలిసింది?

మా సంస్థ నుండి రెండు సినిమాలు అనేసరికి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. పండగ ఎన్ని సినిమాలనైనా తీసుకుంటుంది. ఒక రోజు గ్యాప్ ఇస్తే గనుక ఏ సినిమా రెవెన్యూ ఆ సినిమాకి వుంటుంది. అందుకే నేనే వెనుకకు జరుగుతానని చెప్పాను.

మరి అప్పటికే విడుదలైన సినిమాల వలన థియేటర్లు టైట్ అవుతాయి కదా?

ఫస్ట్ డే రికార్డ్ కోసం తాపత్రయపడే వారైతే గనుక మా రెవెన్యు తగ్గిపోతుందనే ఫీలింగ్ వుంటుంది. రావాల్సిన షేర్ వస్తుందనే నమ్మకం వుంటే గనుక ఎప్పుడు ఎలా విడుదల చేసినా ఇది నిలబడి తీరుతుంది.

వాల్తేరు వీరయ్యలో అవుట్ ఫీట్స్ బావున్నాయి కదా? గతంలో ఇంద్ర సినిమా షర్ట్స్ ట్రెండ్ అయ్యాయి.. వీరయ్య కూడా అలా జరుగుతుందా?

గతంలో ఇంద్ర, గ్యాంగ్ లీడర్ షర్ట్ లు చాలా ట్రెండ్ అయ్యాయి. వాల్తేరు వీరయ్యలో ఒక ఫిషర్ మ్యాన్ క్యారక్టర్. తను రిచ్ గా వుండే అవకాశం వుంది. సుస్మిత చాలా మాసీగా డిజైన్ చేసింది. గతంలో ఇంత మాసీ అవుట్ ఫిట్స్, కాస్ట్యూమ్స్ ఎప్పుడూ వేయలేదు.

గత 30 ఏళ్ళలో టెక్నాలజీ చాలా మారింది. బాబీ ఒక అభిమానిగా మిమ్మల్ని ఎలా చూపించబోతున్నాడు?

నేను కంటెంట్‌ని బలంగా నమ్ముతాను. బాబీ కూడా కంటెంట్‌ని నమ్ముతాడు. అందుకే మా ఇద్దరికి చక్కగా కుదిరింది. దీని అవసరం మేరకు టెక్నాలజీని వాడుకోవడం జరిగింది. బాబీ ఫ్యాన్‌గా కంటే డైరెక్టర్‌గా ఎక్కువ మార్కులు సంపాయించాడు.

వాల్తేరు వీరయ్యలో రవితేజ, మీరు డైలాగులు మార్చుకోవడం ఎలా అనిపించిది?

ఒక ఫ్యాన్ బాయ్‌గా దర్శకుడికి వచ్చిన ఆలోచన ఇది. దీనికి ఇద్దరం ఆమోదించాం. నన్ను ఇష్టపడే రవితేజకి నా డైలాగ్ చెప్పడం తనకి ఫ్యాన్ బాయ్ మూమెంట్. అలాగే నా తమ్ముడి లాంటి రవితేజ డైలాగ్‌ని నేను చెప్పడం సరదాగా అనిపించింది.

వాల్తేరు వీరయ్యలో ఎంటర్ టైన్‌మెంట్‌కి ఎంత అవకాశం వుంది?

ఒక ముఠామేస్త్రీ, ఘరానామొగుడు, అన్నయ్యలో ఫస్ట్ హాఫ్ క్యారెక్టరైజేషన్‌తో పోల్చుకోవచ్చు. ప్రతి సీన్ ఎంటర్‌టైన్ చేస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ పిల్లలతో వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు.

బాబీ ఈ కథ చెప్పినప్పుడు మిమ్మల్ని ఆకర్షించిన ప్రధాన అంశం?

ఏదైనా కథ విన్నప్పుడు అందులో ముఖ్యంగా ఎమోషన్ చూస్తాను. పాటలు, ఫైట్లు అదనపు అలంకరణలు. ఎమోషన్ కనెక్ట్ అయితేనే ప్రేక్షకులని హత్తుకుంటుంది. వాల్తేరు వీరయ్య కథలో అంత గొప్ప ఎమోషన్ వుంది. అందుకే బాబీ చెప్పిన కథ విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా ఓకే చేశాను.

శ్రుతి హాసన్ తో ఇందులో మీ కెమిస్ట్రీ ఎలా వుంటుంది?

తను కమల్ హాసన్‌ (Kamal Haasan)గారి కూతురు. తన డీఎన్‌ఏ‌లోనే డ్యాన్స్ వుంది. అవలీలగా డ్యాన్స్ చేస్తుంది. అయితే చాలా చలిలో డ్యాన్స్ చేయడం ఒక సవాలే. తను చాలా హార్డ్ వర్క్ చేసింది. తనకి పని పట్ల అంకితభావం ఎక్కువ. తనతో మళ్ళీ వర్క్ చేయాలని వుంది.

ఇప్పుడు కథల విషయంలో కొరత ఉందా?

లేదండీ. కొత్త దర్శకులు మంచి మంచి కథలతో వస్తున్నారు. అర్జున్ రెడ్డి, ఉప్పెన, జాతిరత్నాలు, పెళ్లి చూపులు ఇవన్నీ మంచి కంటెంట్ వున్న కథలే కదా.. చాలా మంచి ప్రతిభ వున్న దర్శక, రచయితలు వస్తున్నారు. కథల విషయంలో కొరత లేదు.

రీమేక్ సినిమాలు చేయడం రిస్క్ తో కూడుకున్నదా?

ఒక రీమేక్ కథ చేస్తున్నపుడు మన హీరో ఇందులో ఎలా ఉంటాడనే క్యురియాసిటీ వుంటుంది. గాడ్ ఫాదర్ విజయానికి కారణం కూడా ఇదే. కొన్ని మంచి మార్పులు చేసి ఇది చేశాం. అప్పటికే ఆ సినిమా మాతృక చూసినప్పటికీ గాడ్ ఫాదర్ ని కూడా ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు వేదాలం రీమేక్ చేస్తున్నాను. దీనిని కూడా చాలా డిఫరెంట్‌గా ప్రజంట్ చేస్తున్నాం.

దేవిశ్రీ (DSP) మ్యూజిక్ గురించి?

దేవిశ్రీ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. వాల్తేరు వీరయ్య మ్యూజిక్ తను మనసు పెట్టి చేశాడు. నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాట చాలా చిలిపితనంతో రాసి చేశాడు. అలాగే బాస్ పార్టీ కూడా. ఇందులో వుండే పాటలన్నీ నాకు ఇష్టం. నీకేమో అందం ఎక్కువ పాట కూడా నాకు చాలా ఇష్టం. నా ఫేవరేట్ సాంగ్ ఇది.

బాబీ సింహా (Bobby Simha) గురించి చెప్పండి?

బాబీ సింహా జాతీయ అవార్డ్ పొందిన నటుడు. నా సినిమాల్లో డైలాగులు పాటలు అవలీలగా చెప్పాడు. తనది తమిళనాడు అనుకున్నాను. తెలుగువాడే అని తెలిసి సర్‌ప్రైజ్ అయ్యాను. తను కూడా ఫ్యాన్ బాయ్. ఈ సినిమాలో అద్భుతంగా చేశాడు.

దర్శకుడు బాబీతో పని చేయడం గురించి?

బాబీకి నేను ఫ్యాన్ అయ్యాను అని ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చెప్పాను. అతని హార్డ్ వర్క్ చూసి ఫ్యాన్ అయ్యాను. వాళ్ళ నాన్న గారు చనిపోయిన తర్వాత చిన్న దినం అయిన వెంటనే అంత బాధని దిగమింగుకొని ఇక్కడ వచ్చి పని చేశాడు. అతని కమిట్‌మెంట్ కి హ్యాట్సాఫ్. అతని కమిట్‌మెంట్‌కి ఫ్యాన్ అయ్యాను.

దర్శకత్వం (Direction) చేయాలనే ఆలోచన వుందా?

జీవితాంతం సినిమాతో మమేకం అవ్వాలనే వుంది. ఏదొక ఒక సమయంలో అలాంటి సందర్భం వచ్చి, దర్శకత్వం చేయగలననే నమ్మకం వస్తే గనుక దర్శకత్వం చేస్తాను.

టికెట్ రేటుని 25 రూ. పెంచుకునే వెసులుబాటు ఏపీ ప్రభుత్వం కల్పించింది. అలాగే ఆరు షోలు వేసుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించింది కదా?

ప్రభుత్వ నిర్ణయాలని మనం గౌరవించాలి. ఈ వెసులు బాటు కల్పించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

చివరిగా.. ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు (Golden Globe) దక్కడం ఆనందంగా ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు నా అభినందనలు. ఇదొక చారిత్రక విజయం. దేశం గర్వించే విజయమిది. (Megastar Chiranjeevi about Waltair Veerayya)

Updated Date - 2023-01-11T19:29:31+05:30 IST