Share News

IND-W vs AUS-W: చరిత్ర లిఖించిన భారత అమ్మాయిలు.. తొలి టెస్టు మ్యాచ్ విజయం

ABN , Publish Date - Dec 24 , 2023 | 02:43 PM

భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో అలిస్సా హీలే నేతృత్వంలోని ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఘన విజయం నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో అవసరమైన 75 పరుగులను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 2 వికెట్లు నష్టపోయి సునాయాసంగా సాధించింది.

IND-W vs AUS-W: చరిత్ర లిఖించిన భారత అమ్మాయిలు.. తొలి టెస్టు మ్యాచ్ విజయం

ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో అలిస్సా హీలే నేతృత్వంలోని ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఘన విజయం నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో అవసరమైన 75 పరుగులను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 2 వికెట్లు నష్టపోయి సునాయాసంగా సాధించింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో బంతికే ఓపెనర్ షెఫాలీ వర్మ ఔటయినప్పటికీ ఆ తర్వాత రిచా ఘోష్, స్మృతి మందాన జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. చివరిలో రిచా ఘోష్ అయినప్పటికీ జెమిమా రోడ్రిగ్స్ (12 నాటౌట్), స్మృతి మందాన (38 నాటౌట్) మిగతా పనిని పూర్తి చేశారు. రోడ్రిగ్స్-మందాన కలిసి మూడో వికెట్‌కు 20 పరుగుల జోడించారు. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి క్రీజులో సమయస్ఫూర్తితో ఆడింది. చక్కటి నియంత్రణతో బ్యాటింగ్ చేసింది. తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు ఉన్నాయి. కూల్‌గా ఆడి సంచలన విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో 18.4 ఓవర్లలోనే భారత్ విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసిన ‘ఆఫ్ స్పిన్నర్’ స్నేహ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం 7 వికెట్లు తీసి టీమిండియా విజయంలో స్నేహ ముఖ్యపాత్ర పోషించింది. ఆసీస్ బ్యాట్స్‌ ఉమెన్లను క్రీజులో కుదురుకోనివ్వకుండా ఇబ్బంది పెట్టింది. స్పిన్ బౌలింగ్‌కు పిచ్ అనుకూలంగా మారడాన్ని చక్కగా ఉపయోగించుకుంది.

Untitled-9.jpg


కాగా నాలుగు రోజుల ఈ టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ వెనుకబడే ఉంది. ఏ దశలోనూ టీమిండియా కంటే పైచేయి సాధించలేదు. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 50 పరుగులు చేసిన తహ్లీయా టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక భారత బౌలర్లలో పూజా వస్త్రకర్ అత్యధికంగా 4 వికెట్లు, స్నేహ రాణా 3, దీప్తి శర్మ 2 చొప్పున వికెట్లు తీయగా ఒక వికెట్ రనౌట్ రూపంలో దక్కింది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 406 పరుగుల కొట్టడంతో ఏకంగా 187 పరుగుల ఆధిక్యం లభించింది. షెఫాలి వర్మ (40), స్మృతి మందాన (74), రీచా ఘోష్ (52), రోడ్రిగ్స్ (73), పూజా వస్త్రకర్ (47) చొప్పున పరుగులు చేసి అద్భుతంగా రాణించారు. ఆసీస్ బౌలర్లలో గార్డెనర్ 4 వికెట్లు, కిమ్ గార్త్ 2, సుతర్లాండ్ 2, జొనాసెన్ 1 చొప్పున వికెట్లు తీయగా మరో వికెట్ (స్మృతి మందాన) రనౌట్ రూపంలో దక్కింది.

ఇక రెండో ఇన్నింగ్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా 261 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తాలీ మెక్‌గ్రాత్ (73), పెర్రీ (45) రాణించారు. భారత బౌలర్లలో స్నేహ రాణా అత్యధికంగా 4 వికెట్లు తీసింది. గైక్వాడ్, హర్మాన్‌ప్రీత్ కౌర్ చెరో 2 పడగొట్టగా రనౌట్ రూపంలో ఒక వికెట్ దక్కింది. దీంతో 75 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించింది.

Updated Date - Dec 24 , 2023 | 02:45 PM