WPL title Mumbai : తొలి విజేత ముంబై

ABN , First Publish Date - 2023-03-27T03:49:31+05:30 IST

ఆఖరి ఓవర్‌ వరకూ హోరాహోరీగా సాగిన పోరులో థ్రిల్లింగ్‌ విజయాన్ని అందుకొన్న ముంబై ఇండియన్స్‌.. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) తొలి టైటిల్‌ను కైవసం చేసుకొంది.

 WPL title Mumbai : తొలి విజేత ముంబై

ముంబైకి రూ. 6 కోట్లు

ఢిల్లీకి రూ. 3 కోట్లు

హర్మన్‌సేనకు డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌

ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం

ముంబై: ఆఖరి ఓవర్‌ వరకూ హోరాహోరీగా సాగిన పోరులో థ్రిల్లింగ్‌ విజయాన్ని అందుకొన్న ముంబై ఇండియన్స్‌.. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) తొలి టైటిల్‌ను కైవసం చేసుకొంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ నటాలి సివర్‌ బ్రంట్‌ (55 బంతుల్లో 7 ఫోర్లతో 60 నాటౌట్‌) మ్యాన్‌ విన్నింగ్‌ అర్ధ శతకంతో.. ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది. వాంగ్‌, హేలీ మాథ్యూస్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు.ఓ మాదిరి లక్ష్య ఛేదనలో ముంబై 19.3 ఓవర్లలో 134/3 చేసి నెగ్గింది. బ్రంట్‌, హర్మన్‌ప్రీత్‌ (37) మూడో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. హీలే మాథ్యూస్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ లభించాయి.

హర్మన్‌ కూల్‌గా..: ఛేదనలో సివర్‌ బ్రంట్‌ మరోసారి ముందుండి నడిపించడంతో.. ముంబై 3 బంతులు మిగిలుండగానే గెలిచింది. ఓపెనర్లు మాథ్యూస్‌ (13), యాస్తిక (4) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. యాస్తికను రాధ అవుట్‌ చేయగా.. మాథ్యూ్‌సను జొనాసెన్‌ వెనక్కిపంపింది. దీంతో బ్రంట్‌, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూనే వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలతో స్కోరు బోర్డును నడిపించారు. అయితే చివరి 5 ఓవర్లలో 45 పరుగులు కావాల్సి ఉండగా.. వీరిద్దరూ వేగం పెంచారు. కీలక సమయంలో పాండే మెరుపు ఫీల్డింగ్‌తో హర్మన్‌ రనౌట్‌ అయింది. ఇక ఆఖరి 18 బంతుల్లో 26 పరుగులు కావాల్సి ఉండగా.. ఎడాపెడా బౌండ్రీలు బాదిన బ్రంట్‌ జట్టును గెలిపించింది.

బ్యాటింగ్‌లో ఢమాల్‌..: పేసర్‌ వాంగ్‌ టాప్‌ను పడగొడితే.. స్పిన్నర్‌ మాథ్యూస్‌ లోయరార్డర్‌ను వేటాడడంతో ఢిల్లీ బ్యాటింగ్‌ పేకమేడను తలపించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న క్యాపిటల్స్‌ ఒక దశలో 6 పరుగుల తేడాతో 6 వికెట్లు చేజార్చుకొని దీన స్థితిలో పడగా.. టెయిలెండర్లు శిఖ, రాధ 10వ వికెట్‌కు 24 బంతుల్లో 52 పరుగులు చేసి ఆదుకున్నారు. షఫాలీ (11), క్యాప్సీ (0)తోపాటు జెమీమా (9)ని వాంగ్‌ ఊరించే ఫుల్‌టా్‌సలతో పెవిలియన్‌ చేర్చింది. కానీ, మరో ఓపెనర్‌ లానింగ్‌, కాప్‌ జోడీ నాలుగో వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేసింది. కుదురుకొంటున్న సమయంలో 73/3 స్కోరు వద్ద పరుగు తేడాతో కాప్‌, లానింగ్‌ అవుట్‌ కావడంతో ముంబై మ్యాచ్‌పై పట్టుబిగించింది. 11వ ఓవర్‌లో కెర్‌ బౌలింగ్‌లో కాప్‌ అవుట్‌ కాగా.. లానింగ్‌ రనౌటైంది. అరుంధతి (0)ని కెర్‌ అవుట్‌ చేయగా.. జొనాసెన్‌ (2), మిన్ను (1), తానియా (0)ను మాథ్యూస్‌ వెనక్కి పంపింది. కానీ, శిఖ, రాధ ఎదురుదాడి చేస్తూ టీమ్‌ స్కోరును సెంచరీ మార్క్‌ దాటించారు. వాంగ్‌ వేసిన 19వ ఓవర్‌లో పాండే మూడు ఫోర్లు, సిక్స్‌తో 20 పరుగులు రాబట్టగా.. ఆఖరి ఓవర్‌లో రాధ రెండు భారీ సిక్స్‌లతో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చింది.

స్కోరుబోర్డు

ఢిల్లీ: లానింగ్‌ (రనౌట్‌) 35, షఫాలీ (సి) కెర్‌ (బి) వోంగ్‌ 11, క్యాప్సీ (సి) అమన్‌జోత్‌ (బి) వోంగ్‌ 0, జెమీమా (సి) మాథ్యూస్‌ (బి) వోంగ్‌ 9, కాప్‌ (సి) యాస్తిక (బి) కెర్‌ 18, జొనాసెన్‌ (సి అండ్‌ బి) మాథ్యూస్‌ 2, అరుంధతి (సి) ఇషాక్‌ (బి) కెర్‌ 0, శిఖా పాండే (నాటౌట్‌) 27, మిన్ను (స్టంప్డ్‌) యాస్తిక (బి) మాథ్యూస్‌ 1, తానియా (బి) మాథ్యూస్‌ 0, రాధా యాదవ్‌ (నాటౌట్‌) 27; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 20 ఓవర్లలో 131/9; వికెట్ల పతనం: 1-12, 2-12, 3-35, 4-73, 5-74, 6-75, 7-75, 8-79, 9-79; బౌలింగ్‌: సివర్‌ బ్రంట్‌ 4-0-37-0, వోంగ్‌ 4-0-42-3, ఇషాక్‌ 4-0-28-0, కెర్‌ 4-0-18-2, హేలీ మాథ్యూస్‌ 4-2-5-3.

ముంబై: మాథ్యూస్‌ (సి) అరుంధతి (బి) జొనాసెన్‌ 13, యాస్తిక (సి) క్యాప్సీ (బి) రాధ 4, బ్రంట్‌ (నాటౌట్‌) 60, హర్మన్‌ప్రీత్‌ (రనౌట్‌) 37, కెర్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 19.3 ఓవర్లలో 134/3; వికెట్ల పతనం: 1-13, 2-23, 3-95; బౌలింగ్‌: కాప్‌ 4-0-22-0, రాధ 4-0-24-1, జొనాసెన్‌ 4-0-28-1, శిఖ 4-0-23-0, క్యాప్సీ 3.3-0-34-0.

Updated Date - 2023-03-27T03:49:35+05:30 IST