Malla reddy: మంత్రి మల్లారెడ్డికి ఓ స్టూడెంట్ సవాల్.. స్వీకరిస్తారో లేదో మరి
ABN , First Publish Date - 2023-02-17T16:24:14+05:30 IST
నేను పాలు అమ్మినా, పూలు అమ్మినా, పాఠశాలలు స్థాపించి, మెడికల్ కాలేజ్‌లు నడుపుతున్నా..
హైదరాబాద్: ‘‘నేను పాలు అమ్మినా, పూలు అమ్మినా, పాఠశాలలు స్థాపించి, మెడికల్ కాలేజ్‌లు నడుపుతున్నా’’ ఇవి మంత్రి మల్లారెడ్డి (Malla reddy) నోటి నుంచి జాలువారే పదాలు. కాలేజ్ ఈవెంట్, పబ్లిక్ మీటింగ్, మీడియా సమావేశం.. ఆఖరికి అసెంబ్లీ (Assembly)లో కూడా.. ఇలా వేదిక ఏదైనా గొప్పతనాన్ని చెబుకుంటూ మురిసిపోతుంటారు మల్లారెడ్డి. తనకు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలున్నాయన్న విషయాన్ని ఆయనే అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. ఇప్పుడు ఆయన గొప్పలు ఆయనకే తిప్పలు తెచ్చి పెడుతున్నాయి. ప్రతిపక్షాలు, విద్యార్థులు విమర్శించడానికి ఆయనే ఆయుధాలిచ్చారు.
ఇన్ని కాలేజీలున్న మల్లారెడ్డి పేద విద్యార్థులకు ఎందుకు ఉచిత విద్యను అందివ్వరని ఓ విద్యార్థి ఆక్రోషం వెల్లగక్కాడు. ఆవేదనతో మగ్గిపోతున్న సదరు విద్యార్థి (student) మల్లారెడ్డికి సవాల్ విసిరారు. ‘‘మల్లారెడ్డి పాలు, పూలు అమ్మడం కాదు. మీ కాలేజీల్లో ఉచిత విద్యను ఇవ్వాలి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులకు సీట్లు దొరకడం లేదు. ప్రభుత్వ కాలేజీల్లో కనీసం మౌలిక వసతులు లేవు. ప్రైవేటు కాలేజీల్లో టీచింగ్ స్టాఫ్ సరిగా ఉండదు. చాలా మంది విద్యార్థులు చదువుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఫీజులు ఇవ్వలేక చదువుకు దూరం అవుతున్నారు. నేను సివిల్ ఇంజనీర్ అవుదామని కాలేజీలో చేరాను. కానీ అధిక ఫీజుల వల్ల మిడిల్లో డ్రాప్ అయ్యాను. ప్రైవేటు కాలేజీలతో ప్రభుత్వం కుమ్మక్కు అవుతోంది. లక్షలకు లక్షలు తీసుకుంటూ విద్యార్థుల ఊపిరి తీస్తున్నారు’’ అని విద్యార్థి వాపోయాడు.