Telangana SSC Results : పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలు ఎప్పుడంటే..
ABN , First Publish Date - 2023-05-09T15:16:07+05:30 IST
తెలంగాణలో పదో తరగతి పరీక్షల (Tenth Exams) ఫలితాల విడుదలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు..
తెలంగాణలో పదో తరగతి పరీక్షల (Tenth Exams) ఫలితాల విడుదలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మే-10న (May 10th) బుధవారం నాడు విద్యాశాఖ అధికారులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. 4.8 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఏప్రిల్-03 నుంచి 11వ తేదీ మధ్య టెన్త్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా.. ఈ ఏడాది 6 పేపర్లే కావడంతో వాల్యుయేషన్ ప్రక్రియను అధికారులు త్వరగా పూర్తి చేశారు. గతంలో లాగా ఫలితాల్లో తప్పులు దొర్లకుండా అధికారులు ట్రయల్ రన్ నిర్వహించినట్లు సమాచారం. రెండు, మూడుసార్లు వెరిఫికేషన్ చేసి మరీ.. టెక్నికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఫైనల్ దశకు చేరుకోవడంతో బుధవారం నాడు ఫలితాలు ప్రకటించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.
కాగా.. గత ఏడాది పది ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైన విషయం విదితమే. గత ఫలితాల్లో సిద్దిపేట మొదటి స్థానంలో నిలవగా.. నిర్మల్ రెండు, సంగారెడ్డి మూడో స్థానంలో.. చివరి స్థానంలో హైదరాబాద్ నిలిచింది. అయితే ఈసారి ఎంత శాతం ఉత్తీర్ణత ఉంటుంది..? ఏ జిల్లా మొదటి స్థానంలో ఉండబోతోంది..? హైదరాబాద్ పరిస్థితి ఏంటి..? అని తెలుసుకోవడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంటర్ పరీక్షల ఫలితాలు మంగళవారం నాడు రిలీజ్ అయిన విషయం తెలిసిందే.