Share News

CEO Vikas Raj : అంతా గప్‌చుప్‌..!

ABN , First Publish Date - 2023-11-29T04:07:33+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత 40 రోజులుగా హోరెత్తించిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది. పార్టీలు, అభ్యర్థుల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగియడంతో మైకులన్నీ మూగబోయి..

 CEO Vikas Raj : అంతా గప్‌చుప్‌..!

ముగిసిన ఎన్నికల ప్రచారం

రేపటి వరకు రాష్ట్రంలో 144 సెక్షన్‌

రేపు ఉదయం 7 నుంచి సా. 5 వరకు పోలింగ్‌

35,655 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌

ఇంటినుంచే ఓటు వేసిన 27,178 మంది

పోలింగ్‌ ముగిసే వరకు మద్యం షాపులు బంద్‌

రేపు ప్రైవేటు సంస్థలకు సెలవు: సీఈవో వికాస్‌ రాజ్‌

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత 40 రోజులుగా హోరెత్తించిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది. పార్టీలు, అభ్యర్థుల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగియడంతో మైకులన్నీ మూగబోయి.. తెలంగాణ అంతా గప్‌చు్‌పగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచార గడువు చివరి నిమిషం వరకు హోరెత్తించాయి. ఎన్నికలు తుది అంకానికి చేరుకోవడంతో బుధ, గురువారం రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు పరుస్తున్నారు. ఒకేచోట ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే కఠిన చర్యలుంటాయని భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ) హెచ్చరించింది. ముందుగా అనుమతి పొందిన ప్రకటనలను కేవలం పత్రికల్లో మాత్రమే ప్రచురించే అవకాశం ఉంది. సోషల్‌ మీడియా, టీవీ చానళ్లలో రాజకీయ ప్రచార ప్రకటనలకు నిషేధం విధించింది.

అంతే కాకుండా పోలింగ్‌ ముగిసిన అరగంట తర్వాతనే ఒపీనియన్‌, ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాల్సి ఉంటుందని ఈసీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రచార పర్వం ముగియడంతో వివిధ పార్టీలకు చెందిన నేతలు, స్థానికేతర నాయకులు సైతం.. ఆయా నియోజకవర్గాలను వదిలి స్వస్థలాలకు వెళ్లిపోయారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన 35,655 పోలింగ్‌ కేంద్రాల్లో గురువారం ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌ జరగనుంది.

ఈ 48 గంటలు చాలా కీలకం: సీఈవో

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుందని, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని, ఎన్నికల విధుల్లో ఉన్న అన్ని విభాగాలకు ఈ 48 గంటలు చాలా కీలకమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) వికా్‌సరాజ్‌ పేర్కొన్నారు. మంగళవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత పటిష్టం చేశామని, నియోజకవర్గాల్లో ప్రతి కదలికను గుర్తించేలా.. ఆయా విభాగాలు అనుక్షణం పనిచేస్తాయని చెప్పారు. ప్రతి వాహనాన్ని తనిఖీచేయాలని, పట్టణాలు గ్రామాల్లో ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలను గుర్తించి, నగదు, మద్యం పంపిణీని కట్టడి చేయాలని ఆయన జిల్లా ఎన్నికల అధికారులను (కలెక్టర్లను) ఆదేశించారు. రాష్ట్రం అంతటా 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సామగ్రి తరలించే వాహనాలకు జీపీఎస్‌ ఉంటుందని చెప్పారు. 30న ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం అవుతుందని, దానికి గంటన్నర ముందు తెల్లవారుజామున 5.30 గంటలకు మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తారని చెప్పారు. రాష్ట్రంలో మొదటిసారి హోం ఓటింగ్‌ విధానంలో వయోవృద్ధులు, వికలాంగులు 27,178 మంది ఓటు వేశారని తెలిపారు. అదేవిధంగా 1.48 లక్షల మంది బ్యాలెట్‌ ఓట్లు వేశారని, ఈ సంఖ్య పెరుగుతుందన్నారు. పోలింగ్‌ రోజు (30)న రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు, విధిగా సెలవు ప్రకటించాలని చెప్పారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల వేళ సెలవు ఇవ్వలేదని తనకు ఫిర్యాదులు వచ్చాయని, ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలని సీఈవో వికా్‌సరాజ్‌ ఆదేశించారు.

బందోబస్తుకు ఇతర రాష్ట్రాల పోలీసులు

అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పోలీ్‌సశాఖ పక్కా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర పోలీస్‌ బలగాలతోపాటు, కేంద్ర పారా మిలటరీ బలగాలు, ఇతర రాష్ట్రాల పోలీసులతో కలిపి మొత్తం సుమారు 75 వేల మంది పోలీస్‌ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. పొరుగున ఉన్న ఏపీతోపాటు జార్ఖండ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి జియో ట్యాగింగ్‌ చేశారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, జిల్లా ఎస్పీ, కమిషనర్‌ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూంకి తరలించడం, కౌంటింగ్‌ జరిగే వరకు నిరంతర నిఘా కొనసాగేలా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. స్ట్రాంగ్‌ రూంల వద్ద కేంద్ర సాయుధ బలగాల్ని మోహరించనున్నారు.

గడువు దాటినా కొనసాగిన మద్యం షాపులు

ఈ నెల 28న సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్‌ జరిగే 30న సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని మద్యం షాపులు, బార్లు, మద్యం సర్వ్‌ చేసే క్లబ్బులు, రిసార్టులన్నింటినీ మూసి ఉంచాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ జ్యోతి బుద్ధ ప్రకాష్‌ ఆదేశించారు. కాగా.. రాష్ట్రంలోని చాలా మద్యం షాపులు 28న సాయంత్రం సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉన్నాయి. అయినా ఎక్సైజ్‌ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో మద్యం షాపులు సాయంత్రం 7 గంటల వరకు తెరిచే ఉంచారు. మరోవైపు మద్యం షాపులతో పాటు మద్యం డిపోలకు కూడా ఎక్సైజ్‌ కమిషనరేట్‌ డ్రైడేలుగా ప్రకటించింది. కానీ ఈ నెల 29న మద్యం డిపోలను తెరిచి ఉంచాలని, డిపో మేనేజర్లతో సహా, సిబ్బంది అందరూ విధులకు హాజరు కావాలంటూ తెలంగాణ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ మంగళవారం ఫోన్‌ మెసేజ్‌లు పెట్టారు. దీనిపట్ల కార్పొరేషన్‌ సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-11-29T05:47:13+05:30 IST