TS Politics: తుమ్మలతో రేవంత్ భేటీ.. త్వరలో హస్తం గూటికి మాజీ మంత్రి!?
ABN , First Publish Date - 2023-08-31T19:51:22+05:30 IST
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ (BRS) నుంచి పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)... కారు దిగి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆయన సంకేతాలు ఇచ్చారు.
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ (BRS) నుంచి పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)... కారు దిగి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆయన సంకేతాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి తుమ్మలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy, సుదర్శన్ రెడ్డి, మల్లు రవి, ఇతర నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్లోకి రావాలని నేతలు ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే తుమ్మల కాంగ్రెస్లో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గత వారం 115 మందితో కూడిన బీఆర్ఎస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ (Cm Kcr) ప్రకటించారు. ఈసారి పాలేరు టికెట్ తుమ్మలకు కాకుండా వేరే వారికి కేటాయించారు. దీంతో తుమ్మల అలకబూనారు. గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. మరోవైపు ఇటీవల హైదరాబాద్ నుంచి భారీ వాహనాల నడుమ ఖమ్మం వరకూ బలప్రదర్శన చేశారు. దీంతో ఆయన పార్టీ వీడుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
తుమ్మల పరిణామంతో సీఎం కేసీఆర్ కూడా అప్రమత్తమయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ నేతలతో తుమ్మల వ్యవహారాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. తాజాగా తుమ్మలతో రేవంత్ భేటీ అయిన సందర్భంగా ఈ అంశాన్ని బీఆర్ఎస్ అధిష్టానం ఏ విధంగా చూస్తుందో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే గురువారం ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో (Sonia Gandhi) వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) భేటీ అయ్యారు. తెలంగాణలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, పార్టీ వీలనంపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనం అంశం చర్చించినట్లు చర్చ నడుస్తోంది. త్వరలోనే ఈ విలీన ప్రక్రియ కూడా పూర్తికానున్నట్లు సమాచారం. అంతేకాకుండా పార్టీ విలీనం తర్వాత పాలేరు నుంచి పోటీ చేసేందుకు షర్మిల సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్లో చేరి పాలేరు టికెట్ ఆశిస్తున్నారు. ఈ పరిణామాలు ఎలా దారితీస్తాయో వేచి చూడాలి. మరోవైపు వైఎస్సార్టీపీ విలీనాన్ని తెలంగాణ పీసీసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఏం జరగబోతుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.