Share News

మోదీ ఆశయాలకు అనుగుణంగా జనసేన

ABN , First Publish Date - 2023-11-29T04:18:46+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ పని చేస్తోందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

మోదీ ఆశయాలకు అనుగుణంగా జనసేన

మాది కూడా ‘సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌’ పంథానే

పార్టీ పెట్టినప్పటి నుంచీ ఓటములే.. అయినా ప్రజాభిమానంతో ముందుకు

టీడీపీతో కలిసి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

కూకట్‌పల్లి రోడ్‌షోలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

కూకట్‌పల్లి, నవంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ పని చేస్తోందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. బీజేపీ నినాదమైన ‘సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌’ పంథాలోనే తాము కూడా ముందుకు వెళ్తామని, కుల మత రాజకీయాలు తాము చేయబోమని తెలిపారు. బీజేపీ ప్రకటించినట్టుగా తెలంగాణకు బీసీ నేత ముఖ్యమంత్రి అయితేనే సామాజిక తెలంగాణ కల సాకారమవుతుందన్నారు. మంగళవారం కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బాలానగర్‌, బోయిన్‌పల్లి, హస్మత్‌పేట్‌లలో జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమకుమార్‌కు మద్దతుగా జరిగిన రోడ్‌షోలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ యువత నాడు ఏ అభివృద్ధి కోసం పోరాడిందో, ఆత్మబలిదానాలు చేసుకుందో.. ఆ అభివృద్ధి కోసం జనసేన కృషి చేస్తుందని తెలిపారు. గెలుపోటములు తనకు ముఖ్యం కాదని, ఆ మాటకొస్తే తాను పార్టీ పెట్టినప్పటి నుంచి ఓటములే చవి చూస్తున్నా.. ప్రజాభిమానం, జనసైనికుల కృషి, పట్టుదలతో పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నానన్నారు. ఏపీలో టీడీపీతో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అనంతరం ఆ రాష్ట్రంలో గద్దర్‌ విగ్రహం ఏర్పాటు చేయిస్తానన్నారు. తెలుగు ప్రజల ఐక్యత కోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన నాటి హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పేరును ఏపీలో ఒక హైవేకు పెడతామని చెప్పారు. తన సభలకు, ర్యాలీలకు మద్దతుగా వచ్చిన టీడీపీ కార్యకర్తలకు పవన్‌ కల్యాణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్ర మూలలున్న వారిలో 26 బీసీ కులాలను తెలంగాణ ఆవిర్భావం తరువాత బీసీ జాబితా నుంచి తొలగించారని, దీని గురించి కేసీఆర్‌తో మాట్లాడాలని ఏపీ సీఎం జగన్‌కు వారు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. జగన్‌ వారి తరఫున ఎందుకు మాట్లాడలేదని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు.

Updated Date - 2023-11-29T04:18:47+05:30 IST