Share News

కేసీఆర్‌ వారంటీ ముగిసింది

ABN , First Publish Date - 2023-11-29T04:14:10+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారంటీ ముగిసిందని, ఇక ఆయన ఫామ్‌హౌ్‌సకే పరిమితం అవుతారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్‌ అన్నారు.

కేసీఆర్‌ వారంటీ ముగిసింది

ఆయన ఫామ్‌హౌస్‌కే పరిమితం: జైరాం రమేశ్‌

కరీంనగర్‌ అర్బన్‌, వడ్డెపల్లి, నవంబరు 28 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారంటీ ముగిసిందని, ఇక ఆయన ఫామ్‌హౌ్‌సకే పరిమితం అవుతారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్‌ అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమన్నారు. అధిష్ఠానం, మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు కరీంనగర్‌, హనుమకొండల్లో మంగళవారం వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్‌ రాష్ట్ర విభజన చేసిందని గుర్తు చేశారు. కానీ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌, ఆయన కుటుంబంలోని నలుగురికి మాత్రమే న్యాయం జరిగిందని తెలిపారు. హైదరాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలకే అభివృద్ధిని పరిమితం చేసిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిగిలిన ప్రాంతాలను గాలికి వదిలిసేందని ఆరోపించారు. దీంతో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని చెప్పారు. రాహుల్‌ గాంధీ పాదయాత్ర రాష్ట్ర ప్రజల్లో జోష్‌ నింపిందని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. రైతుబంధు నిలిపివేయడం బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి ఆడిన నాటకమని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే ప్రతీ రైతు ఖాతాలో 15 వేలు, కౌలు రైతులకు రూ.12వేలు జమ చేస్తామన్నారు.

Updated Date - 2023-11-29T04:14:11+05:30 IST