Share News

ఇక చివరి ఘట్టం

ABN , First Publish Date - 2023-11-28T00:14:18+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల ఘట్టం చివరి అంకానికి చేరుకున్నది. దాదాపు నెలరోజుల పాటు హోరెత్తిన ప్రచారం నేటితో ముగియనున్నది. ఈ ఒక్కరోజు మాత్రమే సమయం మిగలడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా అప్రమత్తమయ్యారు.

ఇక చివరి ఘట్టం

నేటితో ముగియనున్న ప్రచారం

ప్రధాన పార్టీల అభ్యర్థులు అప్రమత్తం

ప్రచారం చేయని గ్రామాలపై ఫోకస్‌

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, నవంబరు 27 : అసెంబ్లీ ఎన్నికల ఘట్టం చివరి అంకానికి చేరుకున్నది. దాదాపు నెలరోజుల పాటు హోరెత్తిన ప్రచారం నేటితో ముగియనున్నది. ఈ ఒక్కరోజు మాత్రమే సమయం మిగలడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా అప్రమత్తమయ్యారు. ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందుకే ఒక రోజు ముందుగానే అభ్యర్థుల ప్రచారానికి బ్రేక్‌ పడుతుంది. బహిరంగంగానే కాకుండా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసుకునే వెసులు బాటూ ఉండదు. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల, బెజ్జంకి ప్రాంతాల్లో ఎన్నడూ లేనంతగా ఈసారి ప్రచారం కొనసాగింది. ఇటు గ్రామాలు, అటు పట్టణాల్లో అన్ని పార్టీల ప్రచార రథాల పాటలు గగ్గోలు పెట్టించాయి.

ర్యాలీలపై దృష్టి

జిల్లాలోని హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి ప్రజాఆశీర్వాద సభలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌ తన చివరి సభను గజ్వేల్‌లో ముగించనున్నారు. ఇప్పటికే ఒకసారి కార్యకర్తలతో సమావేశమయ్యారు. నేడు పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి ప్రసంగించనున్నారు. ఇక స్టార్‌ క్యాంపెయినర్‌గా రాష్ట్రమంతా పర్యటిస్తున్న మంత్రి హరీశ్‌రావు కూడా సిద్దిపేటలో నేడు రోడ్‌ షోకు హాజరుకానున్నారు. చివరిరోజు కావడంతో ఇంటింటా ప్రచారం చేయడం వీలు కాదు. ఒక్కచోట ఆగి రోడ్‌ షోలు, సభలు నిర్వహిస్తే సమయం సరిపోదు. అందుకే ప్రధాన పార్టీల అభ్యర్థులు ర్యాలీలపై దృష్టి పెట్టారు. హుస్నాబాద్‌, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్‌లోనూ ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించి తమ పార్టీల బలాన్ని చాటేలా ప్లాన్‌ చేసుకున్నారు. ద్విచక్రవాహనాలతో, పాదయాత్రతో పలు వార్డులు, గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలను ఆకర్షించాలని చూస్తున్నారు. అదే విధంగా ఇప్పటివరకు ప్రచారం చేయని గ్రామాలపై ఫోకస్‌ పెట్టారు. ఆయా గ్రామాలకు వెళ్లి హుటాహుటీన ప్రచారం చేసేలా నిమగ్నమయ్యారు. అంతేగాకుండా వివిధ అసోసియేషన్లు, కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

మార్మోగిన ప్రచార పాటలు

ఈసారి ప్రచార రథాల ప్రభావం విపరీతంగా కనిపించింది. ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులతోపాటు స్వతంత్రంగా బరిలోకి దిగిన వారు తమ పేరిట అనేక రకాల పాటలను తయారు చేయించుకున్నారు. అభ్యర్థుల వ్యక్తిత్వాలు, భవిష్యత్‌ కార్యచరణపై రూపొందించిన పాటలను తమ ప్రచార రథాల ద్వారా ప్రజలకు వినిపించారు. వీటికి తోడు పార్టీల పాటలు కూడా మార్మోగాయి.

Updated Date - 2023-11-28T00:14:19+05:30 IST