Share News

బీఆర్‌ఎస్‌ పాము లాంటిది.. ముంగీస లాంటోడు జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2023-11-27T00:12:49+05:30 IST

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ పాము లాంటిదని.. తాను ముంగీస లాంటివాడినని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ పాము లాంటిది.. ముంగీస లాంటోడు జగ్గారెడ్డి

ఇంటింటికీ బీఆర్‌ఎస్‌ పాములొస్తున్నాయి జాగ్రత్త

ముంగీసలా వాటిని తరిమికొడతా

నన్ను మీరే కాపాడుకోండి

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

గంజ్‌మైదాన్‌లో నాడు ఇందిరాగాంధీ.. నేడు రాహుల్‌గాంధీ ప్రసంగం

సంగారెడ్డి టౌన్‌, నవంబరు 26: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ పాము లాంటిదని.. తాను ముంగీస లాంటివాడినని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డిలోని గంజ్‌మైదాన్‌లో ఆదివారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొన్న విజయభేరి కార్యక్రమంలో జగ్గారెడ్డి ప్రసంగించారు. ఎన్నికల వేళ ఇంటింటికీ బీఆర్‌ఎస్‌ పాములు వస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పాములాంటి బీఆర్‌ఎ్‌సను తరిమికొట్టే ముంగీస తానేనని, తనను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పేర్కొన్నారు. ఇంటింటికీ బీఆర్‌ఎస్‌ పాములు వచ్చి రూ.2వేలు ఇవ్వజూస్తాయని, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఐదేళ్లకోసారి జేబులో చేయి పెట్టే బీఆర్‌ఎస్‌ కావాలా.. ఎదురు పడ్డప్పుడల్లా జేబులో చేయి పెట్టే నేను కావాలో.. నిర్ణయించుకోవాలని అన్నారు. సంగారెడ్డి గంజ్‌మైదాన్‌లో అప్పట్లో ఇందిరాగాంధీ ప్రసంగిస్తే.. నేడు ఆమె మనుమడు రాహుల్‌గాంధీ ప్రసంగించడం సంతోషంగా ఉందన్నారు. 1980లో మెదక్‌ ఎంపీగా పోటీచేసిన ఇందిరాగాంధీ సంగారెడ్డిలో నామినేషన్‌ వేసిన అనంతరం గంజ్‌మైదాన్‌లోనే ప్రజలనుద్దేశించి ప్రసంగించారని గుర్తు చేశారు. ఇప్పుడు రాహుల్‌గాంధీ ఇదే గంజ్‌మైదాన్‌లో ప్రసంగించడం తన జీవితంలో మర్చిపోలేని మదుర జ్ఞాపకమని అన్నారు.

ఆరు గ్యారంటీ స్కీంలకు చట్టం తెస్తాం

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్‌ సమావేశంలోనే ఆరు గ్యారంటీ స్కీంల అమలు కోసం ప్రత్యేక చట్టం తీసుకుస్తామని జగ్గారెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల లోపు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని వివరించారు. బీఆర్‌ఎస్‌ ఇచ్చినట్టు తాము మొఖాలు చూసి ఇవ్వమని, అర్హత ఉన్న లబ్ధిదారులందరికీ ఇస్తామని తెలిపారు. ప్రజల చెంతకు పాలనను తీసుకురావడానికి రచ్చబండ కార్యక్రమం మళ్లీ మొదలుపెడతామని పేర్కొన్నారు. ఎవరికి ఏ సమస్యలున్నా గ్రామాల్లోనే రచ్చబండలో కూర్చొని పరిష్కరిస్తామని చెప్పారు.

Updated Date - 2023-11-27T00:15:14+05:30 IST