Share News

పారిశ్రామిక ప్రగతికి కాంగ్రెస్‌తోనే పునాదులు

ABN , First Publish Date - 2023-11-27T00:16:21+05:30 IST

మెదక్‌ జిల్లా పారిశ్రామిక ప్రగతికి పునాదులు వేసిన ఘనత స్వర్గీయ ఇందిరాగాంధీకే దక్కుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

పారిశ్రామిక ప్రగతికి కాంగ్రెస్‌తోనే పునాదులు

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్‌దే

కేసీఆర్‌ కుటుంబం తిన్న లక్ష కోట్ల రూపాయలు, పదివేల ఎకరాల భూములను కక్కిస్తాం

పటాన్‌చెరు రోడ్‌షోలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

పటాన్‌చెరు, నవంబరు 26 : మెదక్‌ జిల్లా పారిశ్రామిక ప్రగతికి పునాదులు వేసిన ఘనత స్వర్గీయ ఇందిరాగాంధీకే దక్కుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ధి కాట శ్రీనివా్‌సగౌడ్‌కు మద్దతుగా ఇస్నాపూర్‌ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరాగాంధీ మెదక్‌ లోక్‌సభ నుంచి ఎంపీగా ఎన్నికై దేశానికి ప్రధానిగా పనిచేశారన్నారు. ఆ సమయంలో జిల్లాలో బీడీఎల్‌, బీహెచ్‌ఈఎల్‌, ఓడీఎఫ్‌ లాంటి భారీ పరిశ్రమలు ఏర్పాటు చేశారని చెప్పారు. పటాన్‌చెరులో పారిశ్రామికవాడను స్థాపించి వేల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సౌకర్యాలు కల్పించారని గుర్తుచేశారు. దీంతో లక్షలాదిమందికి ఉద్యోగాలు లభించాయని అన్నారు. నేటికీ యువతకు ఉపాధిని లభిస్తున్నదంటే ఆ ఘనత కాంగ్రె్‌సకే దక్కుతుందన్నారు. హైదరాబాద్‌లో ఐటీకి పునాదులువేసి విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత కూడా కాంగ్రె్‌సదేనని పేర్కొన్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు, మెట్రోరైలు, కృష్ణాజలాలు తదితర ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధిలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాత్ర శూన్యమని విమర్శించారు. పటాన్‌చెరు పారిశ్రామిక ప్రగతికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు.

కేసీఆర్‌ కుటుంబ దోపిడీపై విచారణ చేయిస్తాం

కేసీఆర్‌ కుటుంబం గత పదేళ్లలో రూ. లక్ష కోట్లు, పదివేల ఎకరాలు దోచుకున్నారని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మరుక్షణం వీటిపై విచారణ చేయిస్తామని చెప్పారు. కేసీఆర్‌ను చర్లపల్లికి జైలుకు పంపడం ఖాయమని, జైలులో ఆయన కోసం డబుల్‌బెడ్‌రూం సిద్ధం చేస్తామని ఎద్దేవా చేశారు. మోసాల పునాదులపై అధికారంలోకి వచ్చిక కేసీఆర్‌ తెలంగాణా ప్రజల ఆస్తులను చెరబట్టారని మండిపడ్డారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్‌ కుటుంబం బిర్లా మందిర్‌ మెట్ల దగ్గర, నాంపల్లి దర్గా దగ్గర అడుక్కుతినేవారని విమర్శించారు. 2014లో కేసీఆర్‌ కుటుంబ ఆస్తులకు.. నేటి ఆస్తులకు పొంతన లేదని ఆరోపించారు. ఫామ్‌హౌజ్‌లు, టీవీచానళ్లు, న్యూస్‌పేపర్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో నేడు విమానాల్లో షికార్లు చేస్తున్నారని మండిపడ్డారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాలుడు.. కాదని శిశుపాలుడన్నారు. పెద్దఎత్తున అవినీతికి పాల్పడి వేల కోట్లకు పడగలెత్తాడని, కబ్జాలు, పరిశ్రమలపై దౌర్జన్యాలు, గుండాయిజం చేసి సంపాదించిన సొమ్ముతో ఎన్నికల్లో గెలవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించవన్నారు. అవినీతి సొమ్మును ఓటర్లకు పంచేందుకు వస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులను తన్ని డబ్బు గుంజుకోవాలని పిలుపునిచ్చారు. ధర్మానికి.. అధర్మానికి జరుగుతున్న ఈ పోరాటంలో ప్రజలు కాంగ్రెస్‌ పక్షాన నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. అనంతరం కాంగ్రె్‌సలో చేరిన మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు మండవవెంకటేశ్వరావు మాట్లాడుతూ కేసీఆర్‌ అవినీతిని ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ అవినీతి, అరాచక పాలనకు చరమగీతం పాడాలన్నారు.

Updated Date - 2023-11-27T00:16:22+05:30 IST