Share News

బీజేపీతోనే అవినీతిరహిత పాలన

ABN , First Publish Date - 2023-11-28T00:30:45+05:30 IST

మెదక్‌ పట్టణం కాషాయమయంగా మారింది. బీజేపీ అభ్యర్థి పంజా విజయకుమార్‌కు మద్దతుగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభకు అసోం సీఎం హిమంతబిశ్వశర్మ హాజరవడంతో కార్యకర్తల్లో జోష్‌ నెలకొంది.

బీజేపీతోనే అవినీతిరహిత పాలన

అసోం సీఎం హిమంతబిశ్వశర్మ

బీజేపీ ర్యాలీతో కాషాయమయంగా మెదక్‌

మెదక్‌ అర్బన్‌, నవంబరు 27: మెదక్‌ పట్టణం కాషాయమయంగా మారింది. బీజేపీ అభ్యర్థి పంజా విజయకుమార్‌కు మద్దతుగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభకు అసోం సీఎం హిమంతబిశ్వశర్మ హాజరవడంతో కార్యకర్తల్లో జోష్‌ నెలకొంది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి రాందాస్‌ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో అస్సాం సీఎం ప్రసంగించారు. దేశంలో ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నూతన ఆవిష్కరణలు, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో అవినీతిరహిత పాలన కోసం బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీని సీఎం చేస్తామని, ఎస్సీ వర్గీకరణ పూర్తిచేస్తామని పేర్కొన్నారు. మెదక్‌లో ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలాగా.. అస్సాంలో కామాఖ్యదేవి మాత శక్తివంతమైన అమ్మవారని పేర్కొన్నారు. సమయం లేని కారణంగా ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకోలేకపోయానని, మళ్లీ వచ్చినప్పుడు తప్పకుండా దర్శించుకుంటానని తెలిపారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతుందని, తెలంగాణలో బీజేపీ సర్కార్‌ వచ్చాన ఇక్కడి ప్రజలను ప్రభుత్వ ఖర్చులతో రాముని దర్శింపజేస్తామన్నారు. ఈ నెల 30 జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటువేసి మెదక్‌ నుంచి బీజేపీ అభ్యర్థి పంజా విజయ్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ తనను గెలిపిస్తే మెదక్‌ నుంచి పటాన్‌చెరువు వరకు రైల్వేలైన్‌ పొడగింపు, జిల్లాను చార్మినార్‌ జోన్‌లో విలీనం చేయడం, నిజాం షుగర్‌ఫ్యాక్టరీని తెరిపించడం, జాతీయ రహదారి మంజూరు చేయిస్తానని ప్రమాణం చేస్తూ రూ.100 బాండ్‌ పేపర్‌పై రాసి ఇచ్చాడు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాళ్ళపల్లి రాజశేఖర్‌, కరణం పరిణిత, నాయకులు సుభాష్‌గౌడ్‌, నందారెడ్డి, సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు ప్రసాద్‌, రాములు తదితరులు పాల్గొన్నారు. మెదక్‌ జిల్లాలో ఆదివారం ప్రధాని మోదీ పర్యటించడంతోపాటు రాష్ట్ర, జాతీయస్థాయి ముఖ్య నాయకులు పర్యటించడంతో స్థానిక బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.

Updated Date - 2023-11-28T00:30:46+05:30 IST