Share News

కాంగ్రెస్‌ ఉంటే కరెంటు ఉండదు..

ABN , First Publish Date - 2023-11-27T00:17:38+05:30 IST

కాంగ్రెస్‌ ఉంటే కరెంటు ఉండదని... కరెంటు ఉంటే కాంగ్రెస్‌ ఉండదని.. అటువంటి పాలన అవసరమా అని ప్రజలు ఆలోచించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ఉంటే కరెంటు ఉండదు..

బీసీ బిడ్డ గొంతు కోసి నర్సాపూర్‌ టికెట్‌ అమ్ముకున్న రేవంత్‌రెడ్డి

నర్సాపూర్‌ అభివృద్ధి చెందాలంటే సునితక్కను గెలిపించాలి

నర్సాపూర్‌ రోడ్‌షోలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌

నర్సాపూర్‌, నవంరు 26: కాంగ్రెస్‌ ఉంటే కరెంటు ఉండదని... కరెంటు ఉంటే కాంగ్రెస్‌ ఉండదని.. అటువంటి పాలన అవసరమా అని ప్రజలు ఆలోచించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డికి మద్దతుగా ఆదివారం కేటీఆర్‌ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014కు ముందు గ్రామాల్లో కరెంటు పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుచేసుకోవాలని కోరారు. ఎవరైన చనిపోతే అంత్యక్రియల అనంతరం స్నానాలు చేయడానికి కరెంటు కోసం అధికారులను బతిమాలాల్సి వచ్చేదని అన్నారు. నర్సాపూర్‌ కాంగ్రెస్‌ టికెట్‌ బీసీ బిడ్డ గాలి అనిల్‌కుమార్‌కు ఇస్తామని నమ్మబలికిన రేవంత్‌రెడ్డి.. ఆయన గొంతుకోసి టికెట్‌ వేరేవారికి ఇచ్చాడని ఆరోపించారు. అందుకే ఆయనను రేటెంతరెడ్డి అని అంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రె్‌సకు 11 సార్లు అవకాశమిచ్చినా ప్రజలకు ఏమీ చేయలేదని.. ఇప్పుడు మరోసారి అవకాశమివ్వాలని కోరడానికి వారికి సిగ్గుండాలని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి తదితర పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. మూడోసారి అధికారంలోకి వస్తే రైతుబంధు, పెన్షన్లు పెంచుతామని, గ్యాస్‌ సిలిండర్‌ రూ. 400కే ఇస్తామని, రేషన్‌ దుకాణాల్లో సన్నబియ్యం ఇస్తామని పేర్కొన్నారు. అసైన్డ్‌ భూములకు అన్ని హక్కులు కల్పిస్తూ పట్టాలిస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే విదేశాల్లో నల్లధనాన్ని తిరిగి తెప్పించి ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని గొప్పలు చెప్పిన నరేంద్రమోదీ.. ప్రభుత్వం వచ్చి పదేళ్లవుతున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేటీఆర్‌ విమర్శించారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గిస్తామని చెప్పిన మోదీ.. రూ. 400 ఉన్న సిలిండర్‌ ధరను రూ. 1,200 చేశాడని మండిపడ్డారు.

నర్సాపూర్‌ అభివృద్ధికి నాదీ హామీ..

నర్సాపూర్‌ ప్రజల కోసం తపించే సునీతారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి తాను అండగా నిలుస్తానని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఐటీహబ్‌, నర్సాపూర్‌లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, ఉపాధి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గాన్ని సిరిసిల్ల జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌లో కలిపే అంశాన్ని పరిశీలిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సన్నిహిత మిత్రుడని, ఆయనను తమ కుటుంబ సభ్యుడిలా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటామని చెప్పారు. పార్టీలో చేరిన గాలి అనిల్‌కుమార్‌, గోపీలకు సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునితాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామ్‌రెడ్డి, లేబర్‌ వెల్ఫేర్‌బోర్డు చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, జడ్పీటీసీ పబ్బ మహే్‌షగుప్తా, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజుయాదవ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నయిమొద్దీన్‌, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మన్సూర్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-27T00:17:40+05:30 IST