Share News

ప్రచారానికి తెర.. ప్రలోభాలకు ఎర

ABN , First Publish Date - 2023-11-28T23:20:05+05:30 IST

హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు పోలింగ్‌ ప్రక్రియ ఉండడంతో మంగళవారం సాయంత్రం 5 గంటలకే ప్రచారానికి తెరపడింది. ఆఖరు రోజు అభ్యర్థులంతా రోడ్‌షోలు, ర్యాలీలపై దృష్టి పెట్టారు.

ప్రచారానికి తెర.. ప్రలోభాలకు ఎర

- ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

- చివరి రోజు ర్యాలీలు, రోడ్‌షోలు

- ఇక ప్రలోభాలు, తాయిలాలపై దృష్టి

- తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, నవంబరు 28: హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు పోలింగ్‌ ప్రక్రియ ఉండడంతో మంగళవారం సాయంత్రం 5 గంటలకే ప్రచారానికి తెరపడింది. ఆఖరు రోజు అభ్యర్థులంతా రోడ్‌షోలు, ర్యాలీలపై దృష్టి పెట్టారు. ఉదయం 7 గంటల నుండే ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. నేడు బహిరంగ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్‌ హెచ్చరించింది. దీంతో సోషల్‌ మీడియా ద్వారా తమ ప్రచారాన్ని ప్రజలకు చేరేలా సన్నద్ధమయ్యారు.

ఉవ్వెత్తున ప్రచారం

గతంలో ఎన్నడూ లేనంతగా ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు ఉవ్వెత్తున ప్రచారం చేశారు. ఇంటింటా ప్రచారంతో పాటు సభలు, ఆత్మీయ సమ్మేళనాలు, రోడ్‌షోలు, ర్యాలీలతో ప్రచారాన్ని ఉధృతం చేశారు. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ సైతం ఈసారి జిల్లాలో ఐదు భారీ బహిరంగ సభలకు హాజరయ్యారు. హుస్నాబాద్‌, సిద్దిపేట, చేర్యాల, దుబ్బాక, గజ్వేల్‌ సభల్లో పాల్గొన్నారు. ఇక మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌, మహమూద్‌ అలీ బీఆర్‌ఎస్‌ తరఫున ప్రచారం చేపట్టారు. తొలిసారి జిల్లాకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ విచ్చేసి హుస్నాబాద్‌ సభకు హాజరయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం దుబ్బాక, గజ్వేల్‌ సభల్లో పాల్గొన్నారు. ఇక బీజేపీకి సంబంధించి గత ఎన్నికల సమయంలో అమిత్‌షా జిల్లాకు వచ్చారు. కానీ ఈసారి ప్రధాన మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డాలు జిల్లాకు రాలేదు. అయితే పలువురు కేంద్రమంత్రులు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తమ అభ్యర్థుల గెలుపునకు జిల్లాలో పర్యటించారు. చివరి రోజు అన్ని నియోజకవర్గాల్లోనూ ర్యాలీలపై దృష్టి సారించారు. గ్రామగ్రామాన తమ పార్టీలకు మద్దతుగా బైక్‌ ర్యాలీలు నిర్వహించారు.

తాయిలాలతో ఎర!

ప్రచారం ముగియడంతో అభ్యర్థులంతా ప్రలోభాల దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మంగళవారం సాయంత్రం నుంచి పోలింగ్‌ ముగిసే దాకా వైన్‌షాపులను మూసివేశారు. ఇప్పటికే మద్యాన్ని ఆయా గ్రామాలకు తరలించినట్లు సమాచారం. ఒకరోజు ముందుగానే మద్యం సీసాలను ఇంటింటా చేరవేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక నగదు పంపకంపై తర్జనభర్జన పడుతున్నారు. ఏ అభ్యర్థి ఎంతెంత పంచుతారోననే చర్చ జరుగుతున్నది. పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో రూ.500 నుంచి రూ.2వేల దాకా పంచుతారని సమాచారం. ఇప్పటివరకైతే ఎక్కడానూ ఇది బహిరంగం కాలేదు. పోలింగ్‌ గురువారం ఉన్నందున బుధవారం సాయంత్రం నుంచి పంపకాల ప్రక్రియ ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే పంపకాలను అడ్డుకునేందుకు ఎన్నికల అధికారులు, పోలీస్‌ యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టింది. వాహనాలను విస్త్రతంగా తనిఖీలు చేస్తున్నారు.

Updated Date - 2023-11-28T23:20:13+05:30 IST