Share News

డిసెంబరు 3న కేసీఆర్‌కు సమాధానం

ABN , First Publish Date - 2023-11-27T00:14:11+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నికతో మొదలైన బీజేపీ ప్రభంజనం మెదక్‌ జిల్లా అంతటా విస్తరించిందని.. ఈ ఎన్నికల్లో గజ్వేల్‌, నర్సాపూర్‌, మెదక్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు, సిద్దిపేటలో కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌, గజ్వేల్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.

డిసెంబరు 3న కేసీఆర్‌కు సమాధానం

గజ్వేల్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌

తూప్రాన్‌, నవంబరు 26: దుబ్బాక ఉప ఎన్నికతో మొదలైన బీజేపీ ప్రభంజనం మెదక్‌ జిల్లా అంతటా విస్తరించిందని.. ఈ ఎన్నికల్లో గజ్వేల్‌, నర్సాపూర్‌, మెదక్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు, సిద్దిపేటలో కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌, గజ్వేల్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం తూప్రాన్‌ పరిధిలో నిర్వహించిన ప్రధాని హాజరైన బీజేపీ సకలజనుల విజయ సంకల్పసభలో ఆయన ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌కు డిసెంబరు 3వ తారీఖున ఈవీఎంలు తెరిచిన అనంతరం విజయంతోనే సమాధానం చెప్తామని పేర్కొన్నారు. ఒకప్పుడు మెదక్‌ జిల్లాలో బీజేపీనా.. అదెక్కడుంది అన్నవారి అహంకారానికి దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు చెంపపెట్టులా నిలిచిందని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచుకుని సత్తాచాటుతామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఓటేస్తే డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇవ్వం.. ఆసరా పింఛన్లు ఇవ్వం.. అని హరీశ్‌రావు, కేసీఆర్‌ అంటున్నారని.. మెదక్‌ జిల్లా మీ అబ్బ జాగీరా అని ఈటల ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్‌ ఇంటికి పోవడం ఖాయమని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్‌ 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతున్నారని, అది నిజమని నిరూపిస్తే తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని ఈటల సవాలు విసిరారు.

ఈటల, రఘునందన్‌కు ప్రధాని అభినందన

సకల జనుల విజయ సంకల్ప సభ వేదిక మీదకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఈటల రాజేందర్‌, రఽఘునందన్‌రావులను శభాష్‌ అని మెచ్చుకున్నారు. ప్రధాని ప్రసంగాన్ని రఘునందన్‌ తెలుగులోకి తర్జుమా చేశారు. సభలో నర్సాపూర్‌ అభ్యర్థి మురళీయాదవ్‌, పటాన్‌చెరు అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్‌, సంగారెడ్డి అభ్యర్థి పులిమామిడి రాజు, సిద్దిపేట అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి, మెదక్‌ అభ్యర్థి విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-27T00:14:12+05:30 IST