Share News

ఉపఎన్నికలో నేనొచ్చుంటే ఈ కథే ఉండేది కాదు

ABN , First Publish Date - 2023-11-27T00:06:00+05:30 IST

‘‘మొన్నటి ఉపఎన్నికలో నేను ప్రచారానికి రాలే.. అప్పుడే వచ్చుంటే ఈ కథే ఉండేది కాదని’’ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు. చీమకు, దోమకు హాని చేయనోడు.. ఎంపీగా పదేళ్లు మచ్చ లేకుండా సేవ చేసినోడు.. ఇంకా ఎంపీగా కొనసాగాల్సిన వాడు.. అలాంటోడిని దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనే పొమ్మన్నా.. ఆయన ఏనాడు దుబ్బాక కావాలని అడగలేదని కేసీఆర్‌ తెలిపారు.

ఉపఎన్నికలో నేనొచ్చుంటే ఈ కథే ఉండేది కాదు
ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాకను చూసుకునేందుకు ప్రభాకర్‌రెడ్డిని నేనే పొమ్మన్నా

పదేళ్లు ఎంపీగా ఎవరికీ హాని తలపెట్టనోడు..

ప్రభాకర్‌ను గెలిపించుకుంటే నెల రోజుల్లో రెవెన్యూ డివిజన్‌

దుబ్బాకకు అవుటర్‌ రింగ్‌ రోడ్డుతో పాటు

రూ.200 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు

బీజేపీకి ఓటు వేస్తే మోర్లో వేసినట్లే

ప్రజా ఆశీర్వాద సభలో సీఎం చంద్రశేఖర్‌రావు

రాజకీయంగా ఎదుర్కొనలేకే నాపై హత్యాయత్నం

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాక, నవంబరు26: ‘‘మొన్నటి ఉపఎన్నికలో నేను ప్రచారానికి రాలే.. అప్పుడే వచ్చుంటే ఈ కథే ఉండేది కాదని’’ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు. చీమకు, దోమకు హాని చేయనోడు.. ఎంపీగా పదేళ్లు మచ్చ లేకుండా సేవ చేసినోడు.. ఇంకా ఎంపీగా కొనసాగాల్సిన వాడు.. అలాంటోడిని దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనే పొమ్మన్నా.. ఆయన ఏనాడు దుబ్బాక కావాలని అడగలేదని కేసీఆర్‌ తెలిపారు. ఆదివారం దుబ్బాకలో సీఎం కేసీఆర్‌ ప్రజాఆశీర్వాద సభకు హాజరై మాట్లాడారు. దుబ్బాకలో ఎప్పుడైనా కత్తిపోట్లు చూశామా..? మనకు అంతకంటే పెద్దకత్తులు లేవా అంటూనే ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. 157 మెడికల్‌ కాలేజీల్లో ఒక్కటికూడా తెలంగాణలో ఇవ్వలేదని, ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాలను ఇవ్వాలని వంద ఉత్తరాలు రాసినా కూడా స్పందించని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. బీజేపీకి ఓటు వేస్తే మోర్లో వేసినట్లేనని హెచ్చరించారు. అసైన్డ్‌ భూములను గుంజుకుంటామని చెప్పడం పచ్చి అబద్ధమని, వారికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేసీఆర్‌ తెలిపారు. ప్రభాకర్‌రెడ్డి గెలిచాక నెలరోజుల్లో దుబ్బాక రెవెన్యూ డివిజన్‌ చేసుకుందామన్నారు. దుబ్బాక ప్రజల ఆకాంక్షను తప్పకుండా నెరవేర్చుకుంటామన్నారు. దుబ్బాకలో చదువుకునేప్పుడు కూడవెల్లి రామలింగేశ్వరాలయం, రేకులకుంట మల్లికార్జున జాతరకు వెళ్లేవాళ్లమని వాటినీ అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. ఇక ప్రభాకర్‌రెడ్డి కోరినట్టుగా దుబ్బాకకు అవుటర్‌ రింగ్‌ రోడ్డుతోపాటు రూ.200కోట్ల నిధులతో అభివృద్ధి చేసుకుందామన్నారు. పుట్టిన గడ్డ, చదువుకున్న గడ్డ కంటే ఏది గొప్పదికాదని ఇక్కడే సీఎంగా ఎదిగానని కేసీఆర్‌ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ వస్తే.. రైతు మెడకు ఉరి

కాంగ్రెస్‌ వస్తే రైతు మెడకు ఉరి తప్పదని కేసీఆర్‌ హెచ్చరించారు. దుబ్బాకలో మల్లన్నసాగర్‌ ద్వారా సుమారు లక్షా 70 వేల ఎకరాలకు సాగునీరందించనున్నామని, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని ఆయన స్పష్టం చేశారు. రైతుబంధు దుబారా చేస్తున్నారని, 24 గంటల కరెంటు అవసరం లేదని కాంగ్రెస్‌ వాళ్లు అంటున్నారని, 2014 కంటే ముందు తెలంగాణ ఎలా ఉండేదో మీకు తెలుసన్నారు. కాంగ్రె్‌సకు ఓటేస్తే రైతులకు ఉరేనని, మనవేళ్లతో మన కళ్లను పొడుచుకుందామా? అంటూ ప్రశ్నించారు.

ప్రజలను మభ్యపెట్టిన బీజేపీ అభ్యర్థి

రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని మెదక్‌ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తాను దుబ్బాక నుంచి గెలుస్తున్నాననే భయంతోనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తప్పుడు మాటలతో గెలిచి ప్రజలను మభ్యపెట్టిన బీజేపీ అభ్యర్థిని ప్రజలు గమనించారని, ఆయన నాటకాలను గుర్తించారని ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా అసైన్డ్‌భూములు పోతాయంటూ ప్రజలను బెదిరిస్తూ కొత్త డ్రామాలకు తెరలేపాడని ఆయన దుయ్యబట్టారు. తాను కత్తిపోట్లతో దవాఖానాలో చేరితే ఎగతాళి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ఇప్పుడు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.

Updated Date - 2023-11-27T00:06:01+05:30 IST