Share News

కాంగ్రెస్‌కు ఓటేయండి.. అధికారంలోకి తీసుకురండి

ABN , First Publish Date - 2023-11-28T00:31:57+05:30 IST

రాష్ట్రంలో ఈ నెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఓటేసి అధికారంలోకి తీసుకురావాలని కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి కోరారు.

కాంగ్రెస్‌కు ఓటేయండి.. అధికారంలోకి తీసుకురండి

సంగారెడ్డి అభివృద్ధికి జగ్గారెడ్డి గెలుపు అవసరం

సంగారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి

ఆంధ్రజ్యోతి, సంగారెడ్డి, నవంబరు 27: రాష్ట్రంలో ఈ నెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఓటేసి అధికారంలోకి తీసుకురావాలని కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి కోరారు. సంగారెడ్డి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే జగ్గారెడ్డి మళ్లీ గెలుపొందాలని ఆమె పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని హాస్టల్‌గడ్డ, బాబానగర్‌, నేతాజీనగర్‌లలో సోమవారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి, అక్రమాలు తప్ప అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ప్రాజెక్టుల పేరిట ప్రజా ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కాంగ్రె్‌సను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేలు ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీములను కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల లోపు అమలు చేస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో తొమ్మిది సంవత్సరాల్లో రాష్ట్రం అన్నిరంగాల్లో వెనుకబడిందని, అప్పుల రాష్ట్రంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇళ్లు లేనివారికి స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టుకోడానికి ఆర్థికసాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని తెలియజేశారు. స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం డబ్బులు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు, బీసీలకు రూ.5లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చినట్టుగా తాము మొఖాలు చూసి ఇవ్వమని, అర్హత ఉన్న లబ్ధిదారులందరికీ ఇళ్లు ఇస్తామని తెలిపారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి అధికారంలోకి రాగానే రచ్చబండ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతీ మహిళకు నెలనెలా రూ.2,500, గ్యాస్‌ సిలిండర్‌ రూ.500లకే అందిస్తామని తెలిపారు. రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని వివరించారు. రైతులు, కౌలు రైతులకు రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు అందజేస్తామని తెలిపారు. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, రూ.4వేల పింఛన్‌, రూ.10లక్షలతో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా పథకం, కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తూనే తులం బంగారం ఇస్తామని వెల్లడించారు. వరి పంటకు రూ.500 బోనస్‌, ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తామని జయారెడ్డి తెలియజేశారు.

Updated Date - 2023-11-28T00:31:58+05:30 IST