Gellu Vs Kaushik : సభావేదికగా గెల్లు శ్రీనివాస్‌కు షాకిచ్చిన కేటీఆర్.. ఆయనకే టికెట్ అంటూ ప్రకటన చేయడంతో...

ABN , First Publish Date - 2023-01-31T18:57:20+05:30 IST

హుజురాబాద్ (Huzurabad) బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ గెల్లు శ్రీనివాస్‌‌ను (Gellu Srinivas) అధిష్టానం పక్కనపెట్టిందా..?

Gellu Vs Kaushik : సభావేదికగా గెల్లు శ్రీనివాస్‌కు షాకిచ్చిన కేటీఆర్.. ఆయనకే టికెట్ అంటూ ప్రకటన చేయడంతో...

కరీంనగర్/హైదరాబాద్ : హుజురాబాద్ (Huzurabad) బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ గెల్లు శ్రీనివాస్‌‌ను (Gellu Srinivas) అధిష్టానం పక్కనపెట్టిందా..? గత హుజురాబాద్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) తరఫున పోటీచేసి ఓడిన గెల్లుకు మరోసారి టికెట్ ఇవ్వడానికి హైకమాండ్ ఇష్టపడట్లేదా..? ఈటల రాజేందర్‌కు (Etela Rajender) గెల్లు సరైన పోటీ కాదని.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన యువనేత కౌశిక్ రెడ్డినే (Kaushik Reddy) బరిలోకి దింపాలని ముఖ్యనేతలు భావిస్తున్నారా..? అంటే కరీంనగర్ (Karimnagar) జిల్లా జమ్మికుంట బహిరంగ సభలో మంత్రులు కేటీఆర్ (KTR), గంగుల కమలాకర్ (Gangula Kamalakar) చేసిన కామెంట్స్‌తో ఇవన్నీ అక్షరాలా నిజమనిపిస్తోంది.

గెల్లు వర్సెస్ కౌశిక్..!

గెల్లు శ్రీనివాస్.. ఉస్మానియా యూనివర్సిటీ (Osmania Univesity) విద్యార్థి నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నాడు. హుజురాబాద్ (Huzurabad By-poll) ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా గెల్లును ప్రకటించింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసిన ఈటల రాజేందర్ 23,855 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికను కేసీఆర్ సర్కార్ (KCR Govt) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. ఈటల ముందు వారి వ్యూహాలు ఫలించలేదు. ఆ తర్వాత.. నియోజకవర్గ ఇంచార్జ్‌గా గెల్లును నియమించింది అధిష్టానం. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి తీరాలని ఇప్పట్నుంచే వ్యూహాలు రచించుకుంటున్నారు గెల్లు. మరోవైపు.. ఇదే నియోజకవర్గం నుంచి కౌశిక్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఈటలను కౌశిక్ ఢీకొన్నారు కూడా. కౌశిక్ బీఆర్ఎస్ పార్టీలోకి రావడంతో నియోజకవర్గంలో గెల్లు హవా నడవట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ తనపని తాను చేసుకుంటూ పోతున్నారు గెల్లు. కౌశిక్‌కు మాత్రం అధిష్టానం నుంచి మెండుగా అండదండలు ఉన్నాయి. దీంతో పరిస్థితులు కాస్త గెల్లు వర్సెస్ కౌశిక్‌గా మారిపోయాయి. ఈ ఇరువురి అనుచరుల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. అలా ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు మొదలై.. రహస్య సమావేశాల వరకూ వెళ్లింది.

Minister-Ktr.jpg

సభావేదికగా ఎందుకిలా..!?

ఇద్దరి మధ్య విబేధాలు నడుస్తుండగానే కరీంనగర్ జమ్మికుంటలో బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు కేటీఆర్ వస్తున్నారని భారీ ఎత్తున ఫ్లెక్సీలతో ఆ ప్రాంతం అంతా గులాబీమయం చేశారు కౌశిక్. ఈ ఫ్లెక్సీల్లో ఎక్కడా గెల్లు శ్రీనివాస్ ఫొటో కనిపించకపోవడం.. ఉన్న కొన్నింటిలో చిన్నగా ఫొటో ఉండటంతో ఆయన అనుచరుల్లో అసంతృప్తి మొదలైంది. మరోవైపు.. సుమారు 50వేల మంది కార్యకర్తలను తరలించి ఒకింత బలప్రదర్శన కూడా చేసేశారు కౌశిక్. దీంతో లోలోపల ఏదో జరుగుతోందని.. గెల్లుతో పాటు ఆయన అనుచరుల్లో సందేహాలు మొదలయ్యాయి. కేటీఆర్ (Minister KTR) రానే వచ్చారు.. వస్తూ వస్తూనే గెల్లుకు ఊహించని రీతిలో షాకిచ్చేశారు. కౌశిక్‌రెడ్డికే హుజురాబాద్ ఎమ్మెల్యే (Huzurabad MLA Ticket) టికెట్ అంటూ వేదికపై నుంచి సంకేతాలిచ్చేశారు. అంతేకాదు.. రానున్న 8 నెలలు హుజురాబాద్‌లోనే ఉండాలని కౌశిక్‌రెడ్డికి కేటీఆర్ సూచించారు కూడా. కేటీఆర్ మాట్లాడిన తర్వాత మంత్రి గంగుల కమాలకర్ (Minister Gangula) అదే సభలో ప్రసంగిస్తూ.. కేసీఆర్ ఆశీస్సులతో కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యే అవుతారని కామెంట్స్ చేశారు. అటు కేటీఆర్.. ఇటు గంగుల నోట ఒకే మాట రావడంతో గెల్లు పరిస్థితేంటి..? అని ఆలోచనలో పడ్డారు శ్రీనివాస్ అనుచరులు.

అందుకే ఇలా చేస్తున్నారా..!

వాస్తవానికి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అధిష్టానం భావించింది. ఇందుకు సంబంధించి ప్రపోజల్‌ను గవర్నర్‌కు (Governer) కూడా పంపింది హైకమాండ్. అయితే చాలా రోజుల వరకూ గవర్నర్ ఎటూ తేల్చలేదు. ఆఖరికి ఎలాగో కౌశిక్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్టే ఇవ్వాలని కేటీఆర్ భావిస్తున్నారనే విషయం ఆయన కామెంట్స్‌తో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి చూస్తే.. కేటీఆర్ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకే దారితీసింది. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెల్లు పరిస్థితేంటి..? ఆయన్ను అధిష్టానం ఎలా చూడబోతోంది..? పార్టీ నుంచి బయటికి పొమ్మనలేక పొగబెడుతూ ఇలా పరోక్షంగా సంకేతాలిస్తున్నారా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై అధిష్టానం.. గెల్లు, కౌశిక్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాలి మరి.

Updated Date - 2023-02-01T18:22:30+05:30 IST