Share News

1 Hundred crore Money to Voters : వంద కోట్లు ఉఫ్‌!

ABN , First Publish Date - 2023-11-29T03:59:26+05:30 IST

ఎన్నికల్లో ప్రచార ఘట్టం ముగియడంతో రాజకీయ పార్టీలు ఇక ప్రలోభాల పర్వానికి తెరతీశాయి. గెలుపే లక్ష్యంగా ఎంత డబ్బు అయినా ఓటర్లకు పంచడానికి సిద్ధపడుతున్నాయి.

1 Hundred crore Money to  Voters : వంద కోట్లు ఉఫ్‌!

నియోజకవర్గాల్లో కట్టలు తెగుతున్న నోట్లు

పది చోట్ల ఒక్కో అభ్యర్థి ఖర్చు వంద కోట్ల పైనే..

25 చోట్ల అభ్యర్థులందరి ఖర్చు 100-150 కోట్లు

ఓటుకు రూ.3000-5000 దాకా పంపిణీ

ప్రతి స్థానంలో సగం మందికి పంచడమే లక్ష్యం

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ప్రచార ఘట్టం ముగియడంతో రాజకీయ పార్టీలు ఇక ప్రలోభాల పర్వానికి తెరతీశాయి. గెలుపే లక్ష్యంగా ఎంత డబ్బు అయినా ఓటర్లకు పంచడానికి సిద్ధపడుతున్నాయి. ఓటర్లవారీగా, కాలనీల వారీగా, కులాల వారీగా, సంఘాల వారీగా, గ్రూపుల వారీగా డబ్బు పంచుతున్నాయి. ఈ పంపిణీ ఎక్కడిదాకా వెళ్లిందంటే.. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థే రూ.100 కోట్ల దాకా ఖర్చు చేసేంత! రాష్ట్రంలో 8-10 మంది అభ్యర్థులు ఈ స్థాయిలో ఖర్చు చేసేవారున్నారు. ఇక ఒకే నియోజకవర్గంలో అన్ని పార్టీల అభ్యర్థులు కలిసి రూ.100-150 కోట్ల దాకా ఖర్చు చేసే నియోజకవర్గాలు దాదాపు 25 ఉంటాయి. నామినేషన్ల పర్వం మొదలుకుని, ప్రచార ఘట్టం, పార్టీ నాయకుల కొనుగోళ్లు, వాహనాలు, ప్రచార సరంజామా సమకూర్చుకోవడం, ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడం వంటి అన్ని ఖర్చులూ కలిపితే.. కొంత మంది అభ్యర్థులు రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇలా ఒకే అభ్యర్థి రూ.100 కోట్ల వరకు ఖర్చు పెడుతున్న నియోజకవర్గాలు..

ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో రెండు చొప్పున, హైదరాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ.2-3 వేల వరకు పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లాలో ఓ పార్టీ నేత.. తన స్థానం పరిధిలోని ఒక మండలంలో ఏకంగా రూ.5 వేల చొప్పున పంపిణీ చేశారు. అదే నేత మిగతా మండలాల్లో రూ.3 వేల చొప్పున పంచినట్లు సమాచారం. హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, వరంగల్‌ తదితర జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లోనూ ఈ స్థాయిలో డబ్బు పంపిణీ చేస్తున్నారు. అంతేకాదు.. అవసరమైతే రెండో విడతలో మరో రూ.1000-2000 చొప్పున పంచడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం లక్షన్నర నుంచి 2 లక్షల మంది ఓటర్లకు డబ్బు పంపిణీ చేయాలని పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇలా ఒక్కో ఓటరుకు అన్ని పార్టీల అభ్యర్థులు పంపిణీ చేసే మొత్తం కలిపి రూ.8000 అవుతుందనుకుంటే.. ఆ నియోజకవర్గంలో మొత్తం పంపిణీ ఖర్చు రూ.80-120 కోట్లకు చేరుతుంది. అదే ఒక్కో ఓటరుకు రూ.10 వేల చొప్పున పంచితే రూ.150-200 కోట్లు ఖర్చు చేసినట్లవుతుంది. పోలింగ్‌ జరగనున్న 30వ తేదీ వేకువజాము వరకు ఈ పంపకాలు కొనసాగే అవకాశాలున్నాయి.

100 కోట్ల క్లబ్‌లో చేరే నియోజకవర్గాలివే...

నియోజకవర్గంలో అన్ని పార్టీల పంచి పెట్టే మొత్తం రూ.100 కోట్లు దాటే స్థానాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ప్రధానంగా ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో డబ్బు పంపిణీ రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల మధ్యలో ఉండనుంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు బడా కాంట్రాక్టర్లు కావడంతో ఇక్కడ డబ్బు పంపిణీ ఏరులై పారుతోంది. ఇప్పటికే మొదటి విడత కింద రూ.3 వేల చొప్పున పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరో దఫా మరికొంత మొత్తం పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. భువనగిరి, మునుగోడు నియోజకవర్గాలు డబ్బు పంపిణీలో టాప్‌లో ఉన్నాయి. భువనగిరిలో ఇద్దరు అభ్యర్థులు, మునుగోడులో ఒక అభ్యర్థి.. ఒక్కో ఓటరుకు రూ.2000 చొప్పున పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ రెండో దశ పంపిణీ కూడా జరగనుంది. ఈ రెండు నియోజవర్గాలు కూడా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరనున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొడంగల్‌, తాండూరు, మహేశ్వరం, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లోనూ పంపిణీ జోరుగానే ఉంది. ఇక్కడి అభ్యర్థులు ఆర్థికంగా బలమైనవారు కావడంతో అందరి పంపిణీ కలిపి ఒక్కో ఓటరుకు రూ.8000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొడంగల్‌, తాండూరు, మహేశ్వరంలలో ఒక పార్టీ ఓటరుకు రూ.2000 చొప్పున, మరో పార్టీ కొడంగల్‌, తాండూరులో రూ.2000 చొప్పున, మహేశ్వరంలో రూ.1000 చొప్పున పంపిణీ చేశాయి. మహేశ్వరంలో మరో ప్రధాన పార్టీ రూ.2000 చొప్పున పంపిణీ చేసింది. ఇలా ప్రధాన పార్టీల పంపిణీ మొత్తం ఒక్కో ఓటరుకు రూ.8000 వరకు చేరనుంది.

చాలా చోట్ల డబ్బున్న అభ్యర్థులే..

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి, మేడ్చల్‌, ఉప్పల్‌ నియోజకవర్గాల్లో కూడా డబ్బు పంపిణీ జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే రూ.2 వేల చొప్పున పంపిణీ చేశాయి. మరో దఫా పంపిణీకి సిద్ధమవుతున్నాయి. ఇక్కడ కూడా రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు పంపిణీ సాగవచ్చని తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌, ఎల్‌బీ నగర్‌ నియోజవర్గాల్లోనూ డబ్బున్నవారే పోటీ చేస్తున్నారు. ఒక్కో అభ్యర్థి ఓటరుకు కనీసం రూ.4000 వరకు పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. కరీంనగర్‌లో పోటీ చేస్తున్న ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆర్థికంగా బలమైనవారే. దీంతో ఇక్కడ కూడా పంపిణీ ఖర్చు రూ.150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని కామారెడ్డి, బాల్కొండ, ఆర్మూర్‌ నియోజకవర్గాల్లోనూ డబ్బును వెదజల్లుతున్నారు. సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజవర్గంలో పంపిణీ మరింత జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఒక్కో ఓటరుకు ఒక్కో పార్టీ రూ.3000 చొప్పున పంపిణీ చేసినట్లు తెలిసింది. మరో దఫా ఇంకో వెయ్యి, రెంరూ.2వేలు కూడా పంపిణీ చేసే అవకాశాలున్నాయి. ఇక్కడ పంపిణీ మొత్తం రూ.175-200 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆర్మూర్‌, బాల్కొండ, నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గాల్లో ఓటుకు రూ.2000-3000 వరకు పంచుతున్నారు.

మనీకి తోడు మద్యం

మెదక్‌ ఉమ్మడి జిల్లాలో కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో ఒక్కో ఓటరుకు రూ.3000 చొప్పున పంపిణీ చేశారు. మరోసారి రూ.4000 వరకు పంచే అవకాశాలున్నాయి. ఇక్కడ ఓ అభ్యర్థి రూ.100 కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. మంచిర్యాల, చెన్నూరు, నిర్మల్‌ వంటి నియోజకవర్గాలు కూడా రూ.100 కోట్ల క్లబ్బులో చేరుతున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి సంపన్నులు పోటీ చేస్తున్నారు. మనీ, మద్యం పంపిణీ జోరుగా చేపడుతున్నారు. ఒక్కో ఓటరుకు కనీసం రూ.6000 నుంచి రూ.8000 వరకు అందే అవకాశాలున్నాయి. దీంతో పంపిణీ రూ.100-150 కోట్ల మధ్యలో ఉంటుందని భావిస్తున్నారు. ఇలా రూ.100 కోట్ల క్లబ్బులో చేరే నియోజకవర్గాలు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, రూ.100 కోట్ల లోపు, రూ.50 కోట్లకు పైగా పంపిణీ జరిగే నియోజకవర్గాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని నియోజవర్గాల్లో ఒక పార్టీకి ఆర్థికంగా బలమైన అభ్యర్థి ఉండగా... మరో పార్టీకి కాస్త బలహీనమైన అభ్యర్థి ఉన్నారు. ఒక అభ్యర్థి ఓటరుకు రూ.2000 చొప్పున పంచినా, మరో అభ్యర్థి రూ.1000 చొప్పున పంపిణీ చేసినా... వ్యయం మొత్తం రూ.50 కోట్లకు పైగా ఉండొచ్చని తెలుస్తోంది.

Updated Date - 2023-11-29T05:42:41+05:30 IST