Share News

రేవంత్‌ తమ్ముడి ఇంట్లో సోదాలు

ABN , First Publish Date - 2023-11-29T04:25:38+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం సాయంత్రం కాంగ్రెస్‌ నాయకుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

రేవంత్‌ తమ్ముడి ఇంట్లో సోదాలు

స్థానిక కాంగ్రెస్‌ నేతల ఇళ్లలోనూ తనిఖీలు

కామారెడ్డిలో పోలీసుల చర్యలు

స్థానికేతరులు వెళ్లిపోవాలని ఆదేశం

కామారెడ్డి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం సాయంత్రం కాంగ్రెస్‌ నాయకుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డితోపాటు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో సోదా లు చేపట్టారు. నియోజకవర్గంలో రేవంత్‌ తరఫున కొండల్‌రెడ్డి ప్రచార బాధ్యతలు చూస్తుండగా.. మంగళవారం ఎన్నికల ప్రచార సమయం పూర్తయ్యాక స్థానికేతరులెవ రూ స్థానికంగా ఉండకూడదంటూ పోలీసులు ఆయనను ఆదేశించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఇతర జిల్లా ల నుంచి వచ్చినవారు ప్రచారం ముగిశాక తిరిగి వెళ్లిపోవాలని సూచించారు.

అయితే పోలీసులు అధికారిక వాహనాల్లో రాకుండా వ్యక్తిగత వాహనాల్లో ఎందుకొచ్చారని కొండల్‌రెడ్డి ప్రశ్నించారు. సుమారు గంటకుపైగా తన ఇంటి చుట్టూ ప్రైవేట్‌ వాహనాలు అనుమానాస్పదంగా తిరుగుతున్నాయని, పోలీసులమంటూ ప్రైవేట్‌ వాహనాల్లో రావడం పట్ల తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. పోలీసుల తీరుపై ఎన్నికల కమిషన్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. మరోవైపు నిజాంసాగర్‌ రోడ్డులోని మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి కార్యాలయంలోనూ పోలీసులు తనిఖీలు చేశారు. డబ్బు, మద్యం నిల్వ ఉంచారని, పంపిణీ చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు సిద్ధమయ్యారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేశామని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కామారెడ్డిలోని మునిసిపల్‌ వైస్‌చైర్‌పర్సన్‌ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. పోలీసులు, స్పెషల్‌ పార్టీ సిబ్బంది మూకుమ్మడిగా తన ఇంటిపై దాడి చేసి అత్యుత్సాహం ప్రదర్శించారని వైస్‌చైర్‌పర్సన్‌ తెలిపారు.

Updated Date - 2023-11-29T04:25:39+05:30 IST