Apsara case: సాయికృష్ణతో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

ABN , First Publish Date - 2023-06-16T18:56:37+05:30 IST

సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి సాయికృష్ణను కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సాయికృష్ణతో పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశం, శంషాబాద్ బస్టాండ్ ఏరియాలో పరిశీలించారు. ఈ కేసులో సాయికృష్ణ రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైలులో ఉన్నారు.

Apsara case: సాయికృష్ణతో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

హైదరాబాద్: సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి సాయికృష్ణను కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సాయికృష్ణతో పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశం, శంషాబాద్ బస్టాండ్ ఏరియాలో పరిశీలించారు. ఈ కేసులో సాయికృష్ణ రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైలులో ఉన్నారు. ఇక కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు పేర్కొన్నారు. పథకం ప్రకారమే అప్సరను సాయికృష్ణ హత్య చేసినట్లు వెల్లడించారు. హత్యకు వారం రోజుల ముందుగానే ఎలా హత్య చేయాలి..? సాక్ష్యాధారాలను ఎలా మాయం చేయాలి..? శవాన్ని ఎక్కడ పడేయాలి..? అనే విషయాలను గూగుల్‌లో వెతికినట్లు గుర్తించారు.

గూగుల్‌, యూట్యూబ్‌ చూసి హత్యకు ప్లాన్..!

‘‘గత ఏడాది నవంబరులో సాయికృష్ణ, అప్సర కొద్దిమంది స్నేహితులతో కలిసి గుజరాత్‌ విహారయాత్రకు వెళ్లారు. ఈక్రమంలోనే ఇద్దరి మధ్య మరింత చనువు పెరిగి శారీరక సంబంధానికి దారితీసింది. అలా ఇద్దరూ ఒక్కటవడంతో తనను పెళ్లి చేసుకోవాలని అప్సర కోరింది. అయితే సాయికృష్ణ ఎప్పటికప్పుడు పెళ్లి విషయాన్ని దూరం పెడుతూ వచ్చాడు. ఈ ఏడాది మార్చి నుంచి అప్సర ఒత్తిడి పెంచింది. పెళ్లి చేసుకోకపోతే పరువు తీస్తానని హెచ్చరించింది. అప్పటికే పెళ్లయి ఓ కూతురున్న సాయికృష్ణ అప్సరను పెళ్లి చేసుకుంటే సమాజంలో తన పరువు పోతుందని భావించాడు. ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఇందుకు పథకం రచించాడు. హత్యకు వారం రోజుల ముందే గూగుల్‌, యూట్యూబ్‌లో హత్యలకు సంబంధించిన వీడియోలు చూసి అవగాహన పెంచుకున్నాడు. పథకం ప్రకారం కోయంబత్తూరుకు వెళ్దామని చెప్పి ఈ నెల 3న అప్సరను రాత్రి 8 గంటల సమయంలో బయటకు తీసుకెళ్లాడు. ఏవో కారణాలు చెప్పి ఆమెను అర్ధరాత్రి శంషాబాద్‌ సమీపంలోని సుల్తాన్‌పల్లి గోశాలకు తీసుకెళ్లాడు. అక్కడ అప్సర నిద్రలోకి జారుకున్నాక 4వ తేదీన తెల్లవారుజామున 3:30కి ఆమెను హత్య చేశాడు.’’ అని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2023-06-16T18:56:37+05:30 IST