Share News

ఉద్ధృత ప్రచారానికి తెర!

ABN , First Publish Date - 2023-11-29T04:11:09+05:30 IST

తెలంగాణలో నిశ్శబ్దం ఆవరించింది! నెల రోజులుగా జోరుగా సాగిన ప్రచార హోరుకు తెరపడింది!

ఉద్ధృత ప్రచారానికి తెర!

32 రోజుల్లో 96 సభల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌..

70 రోడ్‌ షోలు, 30 సభల్లో కేటీఆర్‌ ప్రచారం

మోదీ 9, అమిత్‌ షా 20, నడ్డా 19 సభలు

రాహుల్‌ 23, ప్రియాంక 26 సభలకు హాజరు

63 నియోజకవర్గాల్లో రేవంత్‌ సుడిగాలి పర్యటన

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో నిశ్శబ్దం ఆవరించింది! నెల రోజులుగా జోరుగా సాగిన ప్రచార హోరుకు తెరపడింది! ప్రచార గడువు ముగియడంతో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను బీఆర్‌ఎస్‌ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఢిల్లీ నుంచి గల్లీ నాయకుల వరకూ ప్రచార కార్యక్రమాలను హోరెత్తించారు. ప్రధాని మోదీ, ఏఐసీసీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ తదితరులు రోడ్‌ షోలు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సభలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అయితే గత 32 రోజుల్లో ఏకంగా 96 సభల్లో పాల్గొన్నారు. ఆయనకు అండగా మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు ముమ్మరంగా ప్రచారం చేశారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా, ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా విస్తృత ప్రచారం చేయగా.. కాంగ్రెస్‌ అభ్యర్థుల తరపున రాహుల్‌, ప్రియాంక, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, వివిధ రాష్ట్రాల సీఎంలు ప్రచారం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నుంచి మాత్రం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఒక్కడే సుడిగాలి ప్రచారం చేశారు.

ప్రచారాన్ని కలిసి ప్రారంభించి.. కలిసి ముగించిన రాహుల్‌, ప్రియాంక

కాంగ్రెస్‌ ముఖ్య నేతల బస్సు యాత్రతో తెలంగాణలో ఆ పార్టీ క్షేత్రస్థాయి ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. దానిని రాహుల్‌, ప్రియాంక రామప్ప దేవాలయంలో పూజలు చేసి ప్రారంభించారు. దానికి రాహుల్‌ గాంధీనే స్వయంగా నేతృత్వం వహించారు. ప్రచారంలో ఆయన వివిధ వర్గాల వారితో మమేకమయ్యారు. ప్రియాంక సైతం సభలు, రోడ్‌ షోల్లో పాల్గొని.. మహిళలను కలుస్తూ ఆసక్తిని రేకెత్తించారు. రామప్ప దేవాలయం వద్ద ఇద్దరూ కలిసి ప్రారంభించిన క్షేత్రస్థాయి ప్రచారాన్ని.. మల్కాజ్‌గిరి రోడ్‌ షోతో ముగించారు. రాష్ట్రవ్యాప్తంగా 23 సభల్లో రాహుల్‌ పాల్గొంటే.. ప్రియాంక 26 సభలకు హాజరయ్యారు. ఖర్గే పది సభల్లో, కర్ణాటక సీఎం 3 సభల్లో, డీకే శివకుమార్‌ పది సభల్లో పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్‌ నెల రోజుల్లో 63 నియోజక వర్గాల్లో సుడిగాలి పర్యటన చేసి అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. అక్టోబరు 16న వికారాబాద్‌ సభ మొదలుకుని మంగళవారంనాటి మల్కాజ్‌గిరి రోడ్‌ షో వరకు 87 సభల్లో పాల్గొన్నారు.

9 సభలకు మోదీ హాజరు

ప్రధాని మోదీ రాష్ట్రంలో తొమ్మిది బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో రోడ్‌ షోలోనూ పాల్గొన్నారు. అమిత్‌ షా 20 సభల్లో, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 19 సభల్లో పాల్గొని అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌ తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు.

కేసీఆర్‌.. సెంచరీ మిస్‌!

ప్రజా ఆశీర్వాద సభల పేరుతో గడిచిన 32 రోజుల్లో ఏకంగా 96 సభల్లో ప్రజలను ఉద్దేశించి కేసీఆర్‌ ప్రసంగించారు. గత నెల 15న హుస్నాబాద్‌ ఎన్నికల సభతో ప్రారంభమైన ఆయన ప్రచారం.. మంగళవారం సొంత నియోజకవర్గం గజ్వేలులో జరిగిన సభతో ముగిసింది. రోజుకు సగటున మూడు నుంచి నాలుగు సభల్లో ఆయన పాల్గొన్నారు. మధ్యలో మూడు రోజులు మాత్రమే ఆయన విరామం తీసుకున్నారు. ఒకవైపు కేసీఆర్‌ సుడిగాలి ప్రచారం చేస్తుంటే.. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ కూడా ముమ్మరంగా ప్రచారం చేశారు. మంత్రి కేటీఆర్‌ 70 రోడ్‌ షోలు, 30 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ఇంటర్వ్యూలు, టెలి కాన్ఫరెన్సులు, ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాలనూ తన ప్రచారానికి అనువుగా మలచుకున్నారు. ఇక హరీ్‌షరావు 80కిపైగా ప్రచార సభల్లో పాల్పంచుకున్నారు. మొత్తం 59 నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్‌ షోల్లో తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకున్నారు.

Updated Date - 2023-11-29T04:11:10+05:30 IST