Share News

ఓటేసి పోండి...

ABN , First Publish Date - 2023-11-21T23:29:21+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఆయా పార్టీల అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరానిపాట్లు పడతున్నారు. ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఓటేసి పోండి...

వలస ఓటర్లకు అభ్యర్థుల ఫోన్‌కాల్‌

వేరే ప్రాంతాల్లో నివాసముంటున్న వారికి ఆహ్వానం

స్థానికంగా ఉంటున్న వారి ద్వారా సంప్రదింపులు

ప్రయాణ ఖర్చులతోపాటు ఇతర ఆఫర్లు!

కృష్ణకాలనీ (భూపాలపల్లి), నవంబరు 21: అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఆయా పార్టీల అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరానిపాట్లు పడతున్నారు. ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. తమదైన వ్యూహంతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామో వివరిస్తున్నారు. తమ పార్టీ రూపొందించి మేనిఫెస్టోను వివరిస్తూనే తమ సొంత ఎజెండా ఏమిటో చెబుతున్నారు. మరో వైపు వివిధ ప్రాంతాలకు ఉపాధి, ఉన్నత చదువులు, ఇతర అవసరాల కోసం వెళ్లిన వారిని సైతం ప్రసన్నం చేసుకుంటున్నారు. ఒక్క ఓటు కూడా చేజారకుండా అభ్యర్థులు పడుతున్న పాట్లు ఆసక్తికరంగా మారాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి నేరుగా ఫోన్లు చేసి పోలింగ్‌ తేదీకల్లా రావాలని కోరుతున్నారు. ఓటరు జాబితాను ముందేసుకొని వలస వెళ్లిన వారెవరెవరో గుర్తించి వారికి కాల్‌ చేస్తున్నారు. సొంత ఊరికి వచ్చి తనకు ఓటు వేయాలని, ఇందుకు రానూ పోనూ ప్రయాణ ఖర్చులు ఇస్తామని గాలం వేస్తున్నారు. అంతేకాదు.. మరికొందరైతే ప్రయాణ ఖర్చులతోపాటు ఇతర ఆఫర్లు సైతం ఇస్తున్నారని తెలుస్తోంది.

జయశంకర్‌ భూపాలపల్లి నియోజకవర్గంలో 2,73,633 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కొంత మంది వివిధ పనులు, వ్యాపారాలు, ఉద్యోగాల రీత్యా హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ ఇతరత్రా ప్రాంతాల్లో ఉంటున్నారు. వారంతా తమ స్వగ్రామాల్లోని చిరునామాలను పెట్టి ఓటు హక్కు పొంది ఉన్నారు. దీంతో వారిని ఎలాగైనా రప్పించి ఓటు తమకే వేయించుకునేందకు వివిధ పార్టీల అభ్యర్థులు, వారి అనుచరులు రంగంలోకి దిగారు. వలస వెళ్లిన వారి వివరాలు సేకరించి నిత్యం ఫోన్లు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో అభ్యర్థుల అనుచరులు, కిందిస్థాయి నేతలు కాల్‌ చేస్తూ టచ్‌లో ఉంటున్నారు. పోలింగ్‌ నాటికి సొంతూరికి రావాలని, తమకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

బంధువులతో సంప్రదింపులు

వలస ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అవకాశం ఉన్న మేర అభ్యర్థులు, వారి అనుచరులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇతర ప్రాంతాల వారిని రప్పించడంతో పాటు తమకే పక్కాగా ఓటు వేసేలా వ్యూహ రచన చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారి వివరాలు సేకరించి ఇక్కడే నివాసం ఉంటున్న వారి బంధువులు, స్నేహితులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వివిధ ప్రాంతాల్లో నివాసించేందుకు వెళ్లిన వారు ఏదైనా పండగలు, ఫంక్షన్లు ఉంటే తప్ప అంతగా సొంతూళ్లకు వెళ్లే పరిస్థితులు ఉండవు. ఓటు హక్కును వినియోగిం చుకోవడం ప్రతి ఒక్కరి బాఽధ్యత కాగా వలస వెళ్లిన వారిని అభ్యర్థులు ఈసాకుతో రప్పించుకుంటున్నారు.

Updated Date - 2023-11-21T23:29:26+05:30 IST