Share News

రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి వీస్తోంది..

ABN , First Publish Date - 2023-11-24T23:54:54+05:30 IST

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని.. తెలంగాణ అంతా కాంగ్రెస్‌ గాలి వీస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తొర్రూరు పట్టణంలో కాంగ్రెస్‌ విజయభేరి సభ శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరైప్రసంగించారు. బలిదానాల వల్ల ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. పేదల జీవితాల్లో మార్పు రావాలంటే కాంగ్రెస్‌ రావాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్‌ కాలెండర్‌ ప్రకటిస్తామని, మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని ప్రియాంకాగాంధీ హామీ ఇచ్చారు. అందుకు పాలకుర్తి అభ్యర్థి యశస్వినిని గెలిపించాలని కోరారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి వీస్తోంది..

ఇందిరమ్మ పాలన మళ్లీ తీసుకువద్దాం

పోరాడి సాధించుకున్న పవిత్ర నేల తెలంగాణ

ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తాం

తెలంగాణ అభివృద్ధిపై మాకు ప్రత్యేక విజన్‌ ఉంది

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ

మహబూబాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : యావత్‌ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి వీస్తోందని, పాలకుర్తిలోనూ అదే పరిస్థితి ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. తొర్రూరులో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి మామిడ్ల యశస్వినిరెడ్డి విజయ భేరి సభ శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పవిత్రమైన గడ్డ తెలంగాణ రాష్ట్రమని కొనియాడారు.

మొదట జై బోలో తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించిన ఆమె తొర్రూరు ప్రాంత ఆధ్యాత్మిక సోమేశ్వరస్వామికి జై.. పాలకుర్తి సోమనాథుడికి జై అంటూ నినదించారు. దీంతో సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. ఈ ప్రాంతానికి రావడం తనకు ఎంతో గర్వకారణంగా అనిపిస్తోందని, ఇక్కడి యువశక్తి, నారీశక్తి తలుచుకుంటే విజయం కాంగ్రె్‌సకే లభిస్తుందని స్పష్టం చేశారు.

తొలుత వేదికపైకి రాగానే ఈ ప్రాంతానికి చాకలి ఐలమ్మ తాత్కాలిక విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆ పక్కనే గద్దర్‌ చిత్రపటం వద్ద నిలబడి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ పాలకుర్తి ప్రాంతంలో హనుమాండ్ల కుటుంబం సుదీర్ఘకాలంగా సేవలు చేస్తున్నారని, పేదల కోసం స్కూల్‌, ఆస్పత్రి, గ్రంథాలయం కట్టించి భూములు కూడా పంచారని కొనియాడారు.

ఎన్నికల సమయంలో ఆలోచించి దేశ ప్రజలను జాగృతి పరిచే విధంగా ఓటరు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎన్నో బలిదానాలు, త్యాగాల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని చెప్పారు. యావత్‌ ప్రపంచం తెలంగాణను గుర్తిస్తుందంటే అన్నివర్గాల త్యాగాల నేపథ్యం ఉందని వివరించారు. ఏ ఆశలు, ఆంకాంక్షల కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నారో.. ప్రస్తుత పదేళ్ల పాలనలో ఏవి ప్రజలకు చేరలేదని విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మార్పు కావాలి... కాంగ్రెస్‌ రావాలి అంటూ తెలుగులో అన్నారు. ఆది నుంచి ఆఖరు వరకు ప్రసంగంలో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలన పట్ల ప్రజలు విసుగు చెందారని అన్నారు. భారత చరిత్రలో ఇందిరమ్మ పాలన ఎవ్వరు మరిచిపోవద్దని గుర్తు చేసిన ఆమె... మళ్లీ ఇందిరమ్మ పాలన తెచ్చుకుంటే అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారని చెప్పారు. కాంగ్రె్‌సకు తెలంగాణ అభివృద్ధిపై ఒక విజన్‌ అంటూ ఉందని, చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు.

ఉద్యోగాలను భర్తీ చేస్తాం..

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేస్తామని, జాబ్‌ క్యాలెండర్‌లో ఏయే రోజుల్లో ఏయే పరీక్షలు, ఫలితాలు ఉంటాయనేది తేదీలతో పక్కాగా ప్రకటించడం జరుగుతుందని ప్రియాంక తెలిపారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల లాగానే తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఏడాదికి పెట్టుబడి సాయం కింద రైతులకు రూ.15వేలు, కూలీలకు రూ. 12వేలు, రైతు పండించిన పంటలకు మద్దతు ధర, వరికి క్వింటాకు బోనస్‌ కింద రూ.500 ఇస్తామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ఠాక్రే, సిరిసిల్ల రాజయ్య, బలరాంనాయక్‌, కర్ణాటక వైద్యశాఖ మంత్రి దినే్‌ష గుండురావు, ఝాన్సీరాజేందర్‌ రెడి,్డ కాకిరాల హరిప్రసాద్‌, లక్ష్మీనారాయణ, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, పెద్దగాని సోమయ్య, అశోక్‌గౌడ్‌, హమ్యానాయక్‌, తూనం శ్రావణ్‌, మేకల కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

దేశాన్ని లూటీ చేస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌

ఈ ఎన్నికల్లో ‘గులాబీ’ నాయకులకు బుద్ధి చెప్పాలి

కాంగ్రెస్‌ నేతలు పొంగులేటి, తీన్మార్‌ మల్లన్న

తొర్రూరు, నవంబరు 24 : బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఏకమై దేశాన్ని దోచుకుంటున్నాయని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి విమర్శించారు. మహబూబాబాద్‌ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో శుక్రవారం ఏర్పాటు చేసిన విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న యుద్ధంలో పాలకుర్తి ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి, గెలిపించుకోవాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 10 నుంచి 11 సీట్లు, ఖమ్మంలో 9 కాంగ్రెస్‌ 1 సీపీఐ మొత్తం పది సీట్లు గెలువబోతున్నామని పొంగులేటి జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.

పార్టీ నాయకుడు తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలను మోసం చేస్తున్నాయే తప్ప వారికి ఉపయోగపడేవి కావని తీన్మార్‌ మల్లన్న అన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒక్కటే నని నరేంద్రమోదీ, కేసీఆర్‌ల మాటలు పైకిమాత్రం వేరుగా ఉంటాయని, లోపల ఇద్దరూ ఒక్కటేనని వారు వేసుకునే అంగీలు మాత్రమే వేరని, ఇద్దరు బనీన్లు ఒక్కటేనన్నారు. తాను నిర్వహించిన సర్వేలో నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి సుమారు 30వేల మెజారిటీతో గెలవబోతుందన్నారు.

టీజేఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్‌ మాట్లాడుతూ రాష్ట్రం లో పేద ప్రజల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం కావడంతో తాను ఆ పార్టీకి మద్దతు తెలుపుతున్నానన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ జోష్‌ కొనసాగుతోందని, తెలంగాణలో పేదల ప్రజా పాలన రావాలంటే కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలన్నారు.

పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి మాట్లాడుతూ రాష్ర్టాన్ని ఇచ్చిన సోనియమ్మను, కాంగ్రెస్‌ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి ఈ ప్రాంత బిడ్డగా మీ ముందుకు వచ్చానని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్‌ రావు ఠాక్రే, కర్ణాటక వైద్యశాఖ మంత్రి దినేష్‌ గుండూరావ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్‌ రెడ్డి, మాజీ ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్‌, కాకిరాల హరిప్రసాద్‌, ఎర్రబెల్లి స్వర్ణ, నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఇన్‌చార్జిలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-24T23:55:33+05:30 IST