Share News

పాలకుర్తి ప్రజల గుండెల్లో ఉన్నాను..

ABN , First Publish Date - 2023-11-26T23:29:47+05:30 IST

‘పాలకుర్తి ప్రజలు చాలా చైతన్యవంతులు.. కాంగ్రెస్‌ పార్టీ మాయమాటలకు మోసపోరు.. మరోసారి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారన్న సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది..’ అని పాలకుర్తి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ధీమా వ్యక్తం చేశారు. పొలిటికల్‌ టూరిస్టులను ప్రజలు నమ్మరని, డబ్బు మూటలతో ఎన్నికల్లో గెలవచ్చనే భ్రమలో ఉన్నవారికి గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, రాబోయే కాలంలో మరింత అభివృద్ధిని చూపిస్తానని దయాకర్‌రావు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

పాలకుర్తి ప్రజల గుండెల్లో ఉన్నాను..

తప్పుడు ప్రచారాలతో పాలకుర్తి నుంచి నన్నెవరూ వేరు చేయలేరు

పొలిటికల్‌ టూరిస్టుల మాటలను ప్రజలు పట్టించుకోరు..

పదేళ్ల కింద పాలకుర్తి ఎట్లున్నది.. ఇపుడెట్లున్నదో ప్రజలకు తెలుసు..

కోతుల బెడదను తప్పించడమే ప్రాధాన్యత అంశం

ఇంజనీరింగ్‌ కళాశాల, పాలకుర్తి రెవిన్యూ డివిజన్‌ కేంద్రం చేస్తా..

తాగునీటి తండ్లాట, సాగునీటి కష్టాలు తీరినయి..

డబ్బుల మూటలెప్పుడూ గెలుపును నిర్దేశించలేవు..

భారీ మెజారిటీతో మరోసారి గెలుస్తాను..

పాలకుర్తి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

‘పాలకుర్తి ప్రజలు చాలా చైతన్యవంతులు.. కాంగ్రెస్‌ పార్టీ మాయమాటలకు మోసపోరు.. మరోసారి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారన్న సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది..’ అని పాలకుర్తి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ధీమా వ్యక్తం చేశారు. పొలిటికల్‌ టూరిస్టులను ప్రజలు నమ్మరని, డబ్బు మూటలతో ఎన్నికల్లో గెలవచ్చనే భ్రమలో ఉన్నవారికి గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, రాబోయే కాలంలో మరింత అభివృద్ధిని చూపిస్తానని దయాకర్‌రావు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఓరుగల్లు, నవంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘ఎన్నికలప్పుడు ఎక్కడెక్కడి నుంచో దిగుతారు.. ప్రజలకు ఇది చేస్తాం.. అది చేస్తాం.. అని మాటలు చెబుతారు.. ఇక్కడేదో దారుణాలు జరిగిపోయాయని గుండెలు బాదుకుంటారు.. ఎన్నికలైపోగానే ఏముంది.. మూటా ముళ్లే సర్దుకుని వచ్చిన దగ్గరకే వెళ్లిపోతారు.. ఈ విషయం పాలకుర్తి ప్రజలకు బాగా తెలుసు’ అని భారత రాష్ట్ర సమితి పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పాలకుర్తిలో ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ప్రశ్ర: పాలకుర్తి ఇపుడు టాక్‌ ఆఫ్‌ ద స్టేట్‌గా మారిపోయినట్టుంది కదా..? ప్రజల స్పందన ఎలా ఉంది..?

జవాబు: ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. పాలకుర్తి నియోజకవర్గంపై కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం పొలిటికల్‌ కన్సల్టెన్సీనే ఏర్పాటు చేసింది. వాళ్లపనంతా తప్పుడు ప్రచారం చేయడమే. కుట్రపూరితంగా అనేక రూపాల్లో అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. అయితే వాస్తవం వేరు.. పాలకుర్తి ప్రజల గుండెల్లో నేనే ఉన్నాను. పాలకుర్తి ప్రజల నుంచి నన్ను ఏ శక్తి వేరు చేయలేదు.

ప్ర: కాంగ్రెస్‌ పార్టీ సభలో మీ మీద రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు. మీ వల్లే జైలుకు పోయానని చెబుతున్నారు..? మీరేమంటారు..?

జ: రేవంత్‌రెడ్డి మాటలను ప్రజలెవ్వరూ విశ్వసించే స్థితిలో లేరు. తప్పుడు పనులు చేసి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి జైలుకు వెళ్లాడు. అందులో నా పాత్ర ఏముంటుంది. ఇన్నేళ్ల కాలంలో నన్ను ఎత్తిచూపని రేవంత్‌ రెడ్డి.. ఇపుడు మాట్లాడుతున్నాడంటేనే అర్థం చేసుకోవాలి. కేవలం రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నాడని తేలిపోయింది. నా మీద వ్యక్తిగత కక్షతోనే డబ్బుల మూటలతో నన్ను ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. పాలకుర్తి ప్రజలు చాలా చైతన్యవంతులు. కాంగ్రెస్‌ పార్టీ మాయమాటలకు మోసపోరు. మరోసారి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారన్న సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది.

ప్ర: పాలకుర్తి నియోజకవర్గంలో అసలు అభివృద్ధే జరగలేదని, చాలా మంది అసంతృప్తితో ఉన్నారని ఆరోపణలు చేస్తున్నారు కదా..? నిజానికి ఎలాంటి అభివృద్ధి చేశారు..?

జ : అభివృద్ధి జరగలేదా..! ఇంతకంటే దారుణమైన అబద్దం మరొకటి లేదు. పాలకుర్తి నియోజకవర్గం ఆధ్యాత్మిక, రాజకీయ ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. తెలంగాణ సాయుధ పోరాట కేంద్రం. పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతనల గడ్డ. కోట్లాది రూపాయలతో ప్రత్యేకంగా అభివృద్ధి చేశాను. 2014కు ముందు ఈ ప్రాంతంలో తాగు, సాగునీటి తండ్లాట అంతా ఇంతా కాదు. ఇపుడా సమస్య లేనేలేదు. ఎస్పారెస్పీ, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా సాగు నీట కష్టాలు తీరుతున్నాయి. ఇంకా కొంత పనులు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. ఇక అసంతృప్తుల విషయానికి వస్తే స్వార్థం నిండిన కొద్దిమంది నాయకులు మాత్రమే అసంతృప్తితో ఉన్నారు. ఇది ఎక్కడైనా ఉంటారు. కదా.. ప్రజలు మాత్రం సంతృప్తిగా ఉన్నారు.

ప్ర: మీరు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు. దాని వల్ల పాలకుర్తికి ఏం మేలు జరిగిందంటారు..?

జ : సీఎం కేసీఆర్‌ నామీద విశ్వాసం ఉంచి అత్యంత కీలకమైన శాఖలైన పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలను అప్పగించారు. నేను నిర్వహించిన శాఖల పని విధానం వల్లనే కేంద్ర ప్రభుత్వం ఎన్నో అవార్డులను ఇచ్చిందంటే అర్థం చేసుకోవాలి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పాలకుర్తి నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశాను. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి ప్రధాన పట్టణాలకు రోడ్ల నిర్మాణం చేశాం. ప్రతీ మండలంలో గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేశాను. తొర్రూరు పట్టణాన్ని మునిసిపాలిటీగా, రెవిన్యూ డివిజన్‌ కేంద్రంగా ఉన్నతీకరించాను. తొర్రూరులో 50 పడకల ఆస్పత్రిని 100 పడకలుగా, పాలకుర్తిలో 30 పడకల ఆస్పత్రిని 50 పడకలకు అప్‌ గ్రేడ్‌ చేశాం. నువ్వు రాష్ట్రానికి మంత్రివా? ఒక్క పాలకుర్తికే మంత్రివా? అని మా సహచరులు అనేవారు. అంటే పాలకుర్తికోసం ఎన్ని నిధులు కేటాయించానో అర్థం చేసుకోవాలి.

ప్ర: మీ ట్రస్టు ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు..?

జ : నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల కోసం శిక్షణ, ఉపాధి అవకాశాలు లభించే వృతిపరమైన నైపుణ్య శిక్షణ, పరీక్షల సమయంలో ప్రత్యేకంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఒక రోజు ఉపాధి హామీ కూలీలతో మాట్లాడినప్పుడు వారికి మధ్యాహ్న భోజనం తెచ్చుకునేందుకు ప్రత్యేక టిఫిన్‌ బాక్స్‌లు ఉంటే బావుంటుందని అర్థమైంది. ఇందుకోసం ఒక బ్యాగ్‌ టిఫిన్‌ బాక్స్‌, వాటర్‌ బాటిల్‌ కలిపే ఉండే దాదాపు 80 వేల కిట్‌లను అందించాం. డీఆర్‌డీఏ ద్వారా పైలట్‌ ప్రాజెక్ట్‌గా నియోజకవర్గంలో కుట్టుశిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి 3 వేల మందికి శిక్షణ ఇచ్చాం. అనంతరం మరో ఆరువేల మందికి ట్రస్ట్‌ ద్వారా శిక్షణ ఇప్పించి కుట్టుమిషన్‌లు అందించాం. ఇక కరోనా సమయంలో అవసరమైన అన్ని పనులను ట్ర స్ట్‌ ద్వారా అందించాం.

ప్ర: మీ ప్రత్యర్థులు పాలకుర్తిలో అసలేం అభివృద్ధి జరగలేదని అంటున్నారు కదా.. మీరేమంటారు..?

జ : వాళ్లు పొలిటికల్‌ టూరిస్టులు. రాజకీయాల కోసమే ఆ ఆరోపణలు చేస్తున్నారు. డబ్బుల మూటలతోనే ఎన్నికల్లో గెలవచ్చన్న భ్రమలో ఉన్నారు. వారి విమర్శలు, ఆరోపణల లోతుల్లోకి పోదలచుకోలేదు. ప్రజల గురించి, నియోజకవర్గం గురించి మాత్రమే పట్టించుకుంటాను. పాలకుర్తి మీద ప్రేమ 40 ఏళ్ల తర్వాత ఎందుకు గుర్తుకు వచ్చిందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎన్నికల తర్వాత మూటా ముళ్ళె సర్దుకుని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోతారన్న విషయం పాలకుర్తి ప్రజలకు తెలిసిందే.

ప్ర: పాలకుర్తిలో ప్రజలు ఇంకా ఎలాంటి సమస్యలు పరిష్కారం కావాలని అనుకుంటున్నారు..? మీరేం చేయబోతున్నారు..?

జ: చాలా ఉన్నాయి. ప్రాధాన్యత అంశాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా రైతాంగం ఇబ్బంది పడే అతి ముఖ్యమైన సమస్య కోతుల బెడద. కోతుల వల్ల పంట నష్టం తీవ్రంగా ఉందంటున్నారు. అందుకే కోతులను పట్టించే కార్యక్రమం ఇప్పటికే మొదలు పెట్టాను. గెలిచిన తర్వాత దాన్ని ముమ్మరంగా చేపడతాను. అదేవిధంగా నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్‌ కళాశాల, పాలకుర్తి రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటు చేయడం లాంటి అంశాలు ఉన్నాయి. ఈసారి పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తాను. కాంగ్రెస్‌ పార్టీ చేసే కల్లబొల్లి కబుర్లకు, మాయ మాటలకు మోస పోవద్దని ప్రజలకు చెబుతున్నాను. నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

Updated Date - 2023-11-26T23:29:49+05:30 IST