Share News

దుర్మార్గులకు ఓటేస్తే.. ఐదేళ్లు ఏడ్సుక సావాలి

ABN , First Publish Date - 2023-11-21T23:17:04+05:30 IST

‘ఈ ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటు వేయాలి.. ఆషామాషీగా దుర్మార్గులకు ఓటేస్తే ఐదేళ్లు ఏడ్సుక సావాలి’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా డోర్నకల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డీఎ్‌స రెడ్యానాయక్‌ బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ మరిపెడలో మంగళవారం నిర్వహించారు.

దుర్మార్గులకు ఓటేస్తే.. ఐదేళ్లు ఏడ్సుక సావాలి
ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌, పక్కన డోర్నకల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డీఎ్‌స రెడ్యానాయక్‌

డోర్నకల్‌లో రెడ్యాను గెలిపిస్తే ఆయనకు హోదా పెరుగుద్ది

తెలంగాణ తెచ్చుకున్నా.. కురవి వీరన్న మొక్కు తీర్చుకున్నా

మరిపెడ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌

మహబూబాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : ‘ఈ ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటు వేయాలి.. ఆషామాషీగా దుర్మార్గులకు ఓటేస్తే ఐదేళ్లు ఏడ్సుక సావాలి’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా డోర్నకల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డీఎ్‌స రెడ్యానాయక్‌ బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ మరిపెడలో మంగళవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వేదిక అలంకరిస్తూనే ప్రజలకు అభివాదం చేశారు. ఆపై మొదట గిరిజన లంబాడ భాషలో ‘యాడీ.. బాపు రాం..రాం..’ అంటూ మహిళలకు, పురుషులకు నమస్కరించి ఆకట్టుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయినా ప్రజాస్వామ్య పరిణితి రావాల్సినంత రాలేదని కేసీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. పరిణితి వచ్చిన దేశాలు అభివృద్ధిలో మనకంటే వేగంగా దూసుకుపోతున్నాయన్నారు.

ఆ పరిస్థితి మన దేశంలో రావాలంటే ఆలోచించి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలన్నారు. అభ్యర్థితో పాటు అభ్యర్థి వెనుక పార్టీ గుణగణాలను పరిగణలోకి తీసుకుని ఆయుధం లాంటి ఓటుహక్కుతో సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. తద్వార రాష్ట్రం ఐదేళ్ల భవిష్యత్‌ ఉంటుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ, తెలంగాణ ప్రజల హక్కులు, తెలంగాణ రక్షణ కోసమన్న విషయాల్ని తండా, గ్రామాల్లో చర్చకు పెట్టి రాయోదే.. రత్నమేదో... ఓటరు గుర్తించేలా చూడాలన్నారు.

రెడ్యా గెలిస్తే..

డోర్నకల్‌ నియోజకవర్గంలో రెడ్యానాయక్‌ను గెలిపిస్తే... ఆయన హోదా పెరుగుతుందని సీఎం కేసీఆర్‌ పరోక్షంగా క్యాబినెట్‌ మంత్రి హోదా వస్తుందన్న సంకేతాలు ఇచ్చారు. అంతేకాకుండా రెడ్యానాయక్‌ గెలిస్తే.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ గెలిచినట్లేనని ప్రకటించారు. ఈ సభకు భారీగా హాజరైన ప్రజలను చూస్తే ఈరోజే ఎమ్మెల్యేగా రెడ్యా డిసైడ్‌ అయ్యారని తేటతెల్లమవుతుందన్నారు. కాంగ్రెస్‌ హయంలో తండాల అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదని, గిరిజనుల అభివృద్ధి కోసం 3,500 తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత తెలంగాణ సర్కార్‌దేనన్నారు.

50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ప్రజల కళ్ల గురించి ఎప్పుడైనా ఆలోచించారా..! అంటూ సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. తాము 3 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 80 లక్షల మందికి కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. కత్తి ఒకరికిచ్చి.. యుద్ధం మరొకరిని చేయమంటే సాధ్యమవుతుందా అని ప్రశ్నించిన కేసీఆర్‌.. యుద్ధం చేసే వారిచేతికే కత్తి ఇవ్వాలని స్పష్టం చేశారు. అభివృద్ధి చేసే వారికి పట్టం కడితే ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు.

కురవి వీరన్న మహిమగల దేవుడు

కురవి వీరభద్రస్వామి చాలా శక్తిగల దేవుడని, స్వరాష్ట్ర ఉద్యమం జరిగేటప్పుడు తాను ఇక్కడికి వచ్చి వీరభద్రస్వామిని మొక్కుకున్నానని కేసీఆర్‌ అన్నారు. స్వామి దయవల్ల తెలంగాణ రాష్ట్రం వస్తే నేనొచ్చి స్వామికి బంగారు మీసాలు సమర్పించుకుంటానని మొక్కుకున్నట్లు వెల్లడించారు. స్వామి దయవల్ల తెలంగాణ వచ్చిందని, తాను కూడా మొక్కు చెల్లించుకున్నానని స్పష్టం చేశారు. ఇక సీనియర్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ ఎన్నో కోరికలు కోరారని, అవి పెద్ద సమస్య కాదని, మళ్లీ అధికారంలోకి రాగానే అన్ని సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. ఈ 30న ఓట్లు పడతాయి... ఆపై 3 లెక్కిస్తరు.. అంతటితో అయిపోదని, ఐదేళ్ల భవిష్యత్‌ ఈ ఓట్లపై ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. ఆలోచించి తెలంగాణ కోసం పుట్టిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలన్నారు.

ఈ సభలో రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ మాలోతు కవిత, మానుకోట ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, బొంతు రామ్మోహన్‌రావు, రాష్ట్ర కార్యదర్శి నూకల నరే్‌షరెడ్డి, గ్రంథాలయసంస్థ చైర్మన్‌ గుడిపుడి నవీన్‌రావు, నాయకులు రామసహాయం రంగారెడ్డి, పర్కాల శ్రీనివా్‌సరెడ్డి, కొంపెల్లి శ్రీనివా్‌సరెడ్డి, రామసహాయం సత్యనారాయణరెడ్డి, కేఎ్‌సఎన్‌.రెడ్డి, కొండపల్లి కేశవరావు, కుడితి మహేందర్‌రెడ్డి, బండి వెంకట్‌రెడ్డి, ముత్యం వెంకన్న, షేక్‌.మహబూబ్‌పాషా, పాల్గొన్నారు.

Updated Date - 2023-11-21T23:17:06+05:30 IST