Share News

బీసీ బిడ్డలను గెలిపించుకోవాలి...

ABN , First Publish Date - 2023-11-28T23:33:29+05:30 IST

వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి దాస్యం వినయభాస్కర్‌, తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌లు ఇద్దరూ బీసీ బిడ్డలని, వారిని బీసీలంతా కలిసికట్టుగా గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఈ ఇద్దరు వరంగల్‌ నగరాభివృద్ధికి ఎంతో కృషి చేశారని, వారిని మళ్లీ ఎన్నుకుంటే మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు. మంగళవారం హనుమకొండలోని కాకతీయ మెడికల్‌ కళాశాల మైదానంలో వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు కలిపి నిర్వహించిన ప్రజాశీర్వద సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

బీసీ బిడ్డలను గెలిపించుకోవాలి...
ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌. పక్కన వరంగల్‌ పశ్చిమ, తూర్పు అభ్యర్థులు వినయభాస్కర్‌, నరేందర్‌

తూర్పులో నరేందర్‌కు, పశ్చిమలో వినయభాస్కర్‌కు భారీ మెజారిటీ ఇవ్వాలి

కాంగ్రె్‌సను గెలిపిస్తే మళ్లీ అంధకారం తప్పదు

నగరంలో ఆరు రైల్వే బ్రిడ్జిలు నిర్మిస్తాం..

వరంగల్‌ నగరానికి ఉజ్వల భవిష్యత్తు

బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌

నగరంలో వరంగల్‌ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల ప్రజాశీర్వాద సభ

హనుమకొండ, నవంబరు 28 (ఆంరఽధజ్యోతి): వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి దాస్యం వినయభాస్కర్‌, తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌లు ఇద్దరూ బీసీ బిడ్డలని, వారిని బీసీలంతా కలిసికట్టుగా గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఈ ఇద్దరు వరంగల్‌ నగరాభివృద్ధికి ఎంతో కృషి చేశారని, వారిని మళ్లీ ఎన్నుకుంటే మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు. మంగళవారం హనుమకొండలోని కాకతీయ మెడికల్‌ కళాశాల మైదానంలో వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు కలిపి నిర్వహించిన ప్రజాశీర్వద సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి కేసీఆర్‌ మాట్లాడుతూ.. పశ్చిమ, తూర్పు అభ్యర్థులు వినయభాస్కర్‌, నరేందర్‌లను గెలిపిస్తే ఎన్నికల తర్వాత వరంగల్‌ను ఒక ఉజ్వల నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ పాలనలో వరంగల్‌ నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను కేసీఆర్‌ ఈ సందర్భంగా ఉదహరించారు. వినయ్‌, నరేందర్‌ తన దృష్టికి తెచ్చిన కొన్ని నగర సమస్యలను పరిష్కరిస్తానని వాగ్దానం చేశారు.

ఎన్నికల్లో ఓట్లేసేటప్పుడు ప్రజలు అభ్యర్థులు, వారి వెనుక ఉన్న పార్టీల గురించి, వాటి నడవిడక, ప్రజాబాహుళ్యం, ధృక్పథం, విధానం గురించి కూడా ఆలోచించాలని ఉద్బోధించారు. ఎన్నికలతోనే అయిపోదనీ, ఆ తర్వాతే ఆసలు దుకాణం మొదలవుతుందన్నారు. కనుక రాయి ఏదో, రత్నం ఏదో నిగ్గు తేల్చుకొని ఓటేయ్యాలన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ ఏర్పాటు, ఈ ప్రాంత ప్రజల హక్కులు కాపాడటం కోసం అని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.

వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నవారికి ఎన్నికల తర్వాత నూటికి నూరు శాతం పట్టాలు ఇస్తానని అన్నారు. వరంగల్‌లో ఒకప్పుడు తాగడానికి మంచినీళ్లు కూడా వచ్చేవి కావన్నారు. కానీ ఇప్పుడు మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు వస్తున్నాయన్నారు. నిజాం కాలం నాటి ఆజంజాహీ మిల్లును మూసివేసి భూములను అమ్ముకున్నది కాంగ్రెస్‌ పార్టీ అని ఆరోపించారు. ప్రత్యామ్నాయంగా తమ ప్రభుత్వం రూ.1200కోట్లతో ఏర్పాటు చేసిన మెగాటెక్స్‌టైల్‌ పార్క్‌లో త్వరలో లక్షమందికి ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు.

ఒకప్పుడు దుమ్ముకొట్టుకుపోయిన వరంగల్‌ నగరం. ఇప్పుడు సర్వాంగ సుందరంగా రూపు దిద్దుకున్నదని కేసీఆర్‌ అన్నారు. రైల్వే ట్రాకుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు వరంగల్‌లో ఎన్నికల తర్వాత ఆరు బ్రిడ్జిలను నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. రింగ్‌ రోడ్డును కూడా పూర్తి చేస్తామని, మాస్టర్‌ ప్లాన్‌కూడా అమలు చేస్తామన్నారు. వరంగల్‌ను ఒక ఉజ్వలమైన నగరంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్‌ వాగ్దానం చేశారు. వరంగల్‌లో ఒక పెద్ద డెయిరీ పరిశ్రమ ఏర్పాటవుతుందన్నారు. ఆటోలకు ట్యాక్సును రద్దు చేశామని, ఎన్నికల తర్వాత ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రుసుము లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.

ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ, ఎన్‌కౌంటర్లు, కాల్చివేతలు, కూల్చివేతలేనని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి ఓటేస్తే తెలంగాణలో మళ్లీ అంధకారమేనని హెచ్చరించారు. 50 ఏళ్ల ఆ పార్టీ పాలన, బీఆర్‌ఎస్‌ 10 ఏళ్ల చరిత్రను బేరీజు వేసుకోవాలని కోరారు. తెలంగాణను అన్ని రంగాల్లో అరిగోసపెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. మానుకోటలో సమైక్యవాదుల ముసుగులో తెలంగాణవాదులపై రాళ్లదాడి చేసిన వాళ్లే మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో నిలబడ్డారన్నారు.

తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఉందన్నారు. వైద్యం, ఇతర సంక్షేమ పథకాల అమలులో కూడా ముందున్నామన్నారు. కంటి వెలుగు కార్యక్రమం కింద లక్షలాది మందికి కంటిచూపును ప్రసాదించామన్నారు. కేసీఆర్‌ కిట్‌, షాదీముబారక్‌ తదితర అనేక కార్యక్రమాల ద్వారా నిరుపేదల ప్రజలను ఆదుకుంటున్నామన్నారు. కాంగ్రెస్‌ రాజ్యంలో కేవలం రూ.200 ఫింఛన్‌ ఇచ్చారని, కానీ నిరుపేదలు, నిస్సహాయులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం మొదట రూ.వెయ్య, తర్వాత రూ.2వేలకు పెంచిందని, ఈ ఎన్నికల తర్వాత ఆ మొత్తాన్ని రూ.5వేలకు పెంచుతామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ ఇద్దరు అభ్యర్థులు దాస్యం వినయ్‌ భాస్కర్‌, నన్నపునని నరేందర్‌, మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్యయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్‌ గుండు సుధారాణి, కుడా చైర్మన్‌ సుందర్‌రాజ్‌ యాదవ్‌, రాష్ట్ర రైతు విముక్తి కమిషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌, ఎంపీ పసునూరి దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలే నా బలం, బలగం : వరంగల్‌ పశ్చిమ అభ్యర్థి వినయభాస్కర్‌

హనుమకొండ టౌన్‌, నవంబర్‌ 28: నియోజకవర్గ ప్రజలే తన బలం, బలగమని వరంగల్‌ పశ్చిమ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాస్యం వినయభాస్కర్‌ అన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో వినయభాస్కర్‌ మాట్లాడుతూ.. పదవి ఉన్నా లేకున్నా నిత్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలను నియోజకవర్గంలోని ప్రతీ గడపకూ చేరవేశానన్నారు. హైదరాబాద్‌కు ధీటుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

ఎడ్యుకేషన్‌, ఐటీ, కల్చరల్‌ హబ్‌ గా నియోజకవర్గాన్ని మార్చామన్నారు. పార్కులు, జంక్షన్‌లు అభివృద్ధి చేసినట్లు ఆయన వివరించారు. కరోనా సమయంలో, వరదల సమయంలో బాధితులకు అండగా నిలిచానని ఆయన అన్నారు. విపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుందని, కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలు సైతం కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వినయభాస్కర్‌ పేర్కొన్నారు.

అసూయ పడేలా ‘తూర్పు’ అభివృద్ధి : వరంగల్‌ తూర్పు అభ్యర్థి నన్నపునేని

హనుమకొండ టౌన్‌, నవంబర్‌ 28: ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో పొరుగు నియోజకవర్గాలు అసూయ పడేలా తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని వరంగల్‌ తూర్పు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌ తెలిపారు. ప్రజా ఆశీర్వాద సభలో నన్నపునేని నరేందర్‌ మాట్లాడారు. ముందుగా తనకు మరో అవకాశం ఇవ్వాలని వేదికపైనుంచి సాష్టాంగ నమస్కారం చేసి నియోజకవర్గ ప్రజలను కోరారు. లారీ డ్రైవర్‌ కొడుకునైన తాను.. ఈ స్థాయికి రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన అవకాశమేనని కొనియాడారు. తనకు కేసీఆర్‌ ఇచ్చిన అవకాశంతో నియోజకవర్గ ప్రజలకు సేవచేసే భాగ్యం కలిగిందన్నారు. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. నియోజవర్గంలో 57వేల మంది మైనారిటీలు ఉన్నారని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కేసీఆర్‌ను కోరారు. విద్య, వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్న కేసీఆర్‌.. తన నియోజకవర్గంలో 24 అంతస్థులతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించడం హర్షనీయమన్నారు. తూర్పు నియోజకవర్గ ప్రజలు గులాబీ జెండాతోనే ఉంటారని నరేందర్‌ తెలిపారు.

ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్‌

హనుమకొండ టౌన్‌, నవంబర్‌ 28: బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు వరంగల్‌ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మంగళవారం వరంగల్‌ మెడికల్‌ కళాశాల మైదానంలో ఈ సభ నిర్వహించారు.

హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన సీఎం కేసీఆర్‌ మెడికల్‌ కళాశాల సమీపంలోని ఎల్‌బీ కళాశాల మైదానంలో దిగి నేరుగా సభా ప్రాంగణానికి ప్రత్యేక బస్సులో వచ్చారు. వేదికపైకి మద్యాహ్నం 1.09గంటలకు వచ్చారు. దాస్యం వినయభాస్కర్‌, నన్నపునేని నరేందర్‌లు మాట్లాడిన అనంతరం కేసీఆర్‌ మాట్లాడారు. మధ్యాహ్నం 1.25గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించిన కేసీఆర్‌ 1.52గంటలకు ముగించారు. 27నిమిషాలు ప్రసంగించిన కేసీఆర్‌ కాంగ్రె్‌సపై విమర్శలు చేయడంతో పాటు పలు హామీలను ఇచ్చారు. సభ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్‌, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, మధుసూధనాచారి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవిందర్‌రావు, మేయర్‌ గుండు సుధారాణి, కుడా చైర్మన్‌ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌, రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మౌలానా, నేతలు మర్రి యాదవరెడ్డి, ఎల్లావుల లలితాయాదవ్‌, చింతల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T23:33:32+05:30 IST