Share News

ప్రచార హోరు

ABN , First Publish Date - 2023-11-23T23:25:16+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి అస్త్రాలు సంధిస్తున్నాయి. సరిగ్గా మరో ఐదురోజుల పాటు ప్రచారం హోరెత్తనుంది. ఈ సమయంలో ఆయా పార్టీలు అగ్రనేతలను రంగంలో దింపుతున్నాయి. దీంతో మహబూబాబాద్‌ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల జోష్‌ తారస్థాయికి చేరుకోబోతోంది. మహబూబాబాద్‌, డోర్నకల్‌ పూర్తిస్థాయి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండేసి మండలాల ప్రాతినిథ్య పాలకుర్తి, ఇల్లందు, ములుగు నియోజకవర్గాలు ఉండగా.. ఆయా మండలాల్లో ప్రధాన అధికార, ప్రతిపక్షాల ప్రచారం హోరెత్తిపోతోంది.

ప్రచార హోరు

నేడు ప్రియాంక.. రేపు హరీ్‌షరావు రాక

27న ప్రధాని మోదీ, రేవంత్‌రెడ్డి..

ఓటర్లను ఆకట్టుకునే అగ్రనేతలు రంగంలోకి..

ఇక.. వరుసగా పర్యటనలు

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల జోష్‌

మహబూబాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి అస్త్రాలు సంధిస్తున్నాయి. సరిగ్గా మరో ఐదురోజుల పాటు ప్రచారం హోరెత్తనుంది. ఈ సమయంలో ఆయా పార్టీలు అగ్రనేతలను రంగంలో దింపుతున్నాయి. దీంతో మహబూబాబాద్‌ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల జోష్‌ తారస్థాయికి చేరుకోబోతోంది. మహబూబాబాద్‌, డోర్నకల్‌ పూర్తిస్థాయి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండేసి మండలాల ప్రాతినిథ్య పాలకుర్తి, ఇల్లందు, ములుగు నియోజకవర్గాలు ఉండగా.. ఆయా మండలాల్లో ప్రధాన అధికార, ప్రతిపక్షాల ప్రచారం హోరెత్తిపోతోంది. ఇక బీజేపీ, కాంగ్రెస్‌ అగ్రనేతలతో పాటు బీఆర్‌ఎస్‌ మంత్రులు కూడా ప్రచార చివరాంకంలోనూ మహబూబాబాద్‌ జిల్లాలో కాలుమోపుతున్నారు. ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ, అగ్రనేత ప్రియాంకగాంధీ, భారత ప్రధాని నరేంద్రమోదీ, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావుల పర్యటనలు దాదాపు ఖరారయ్యాయి.

కేసీఆర్‌, ఈటల, కర్ణాటక మంత్రుల..

బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ మహబూబాబాద్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, పాలకుర్తి అభ్యర్థి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, డోర్నకల్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే డీఎ్‌స.రెడ్యానాయక్‌ల తరుపున మానుకోట, తొర్రూరు, మరిపెడల్లో భారీ బహిరంగ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని, ఓటర్లలో ఉత్తేజాన్ని నింపివెళ్లారు. భారతీయ జనతా పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మహబూబాబాద్‌ అభ్యర్థి జాటోతు హుస్సేన్‌నాయక్‌ విజయం కోసం గూడూరు, డోర్నకల్‌ అభ్యర్థి భూక్య సంగీత తరుపున నర్సింహులపేట సభల్లో ప్రచారం నిర్వహించి వెళ్లారు.

డోర్నకల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ జాటోతు రాంచంద్రునాయక్‌ తరుపున కర్ణాటక రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖమంత్రి శివరాజ్‌ ఎస్‌ తంగిడిగి, ఏఐసీసీ ఇన్‌చార్జి, కర్ణాటక మాజీమంత్రిశివశంకర్‌రెడ్డి, తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాంలు ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ భూక్య మురళీనాయక్‌ తరుపున తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ, టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ డోలి సత్యనారాయణ, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి ప్రచారం నిర్వహించి వెళ్లారు.

నేటి నుంచి అగ్రనేతల ప్రచారం..

అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరుకు కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. శుక్రవారం ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ, అగ్రనేత ప్రియాంకగాంధీ పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు తొర్రూరులో నిర్వహించే ఆ పార్టీ అభ్యర్థి యశస్వీరెడ్డిని తరుపున పాలకుర్తి విజయభేరి సభలో పాల్గొని ఓటర్లను ఉత్తేజపరచనున్నారు. ఈనెల 25న శనివారం మహబూబాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ శంకర్‌నాయక్‌ విజయం కోసం మహబూబాబాద్‌లో ఉదయం 10 గంటలకు, గూడూరులో 11 గంటలకు నిర్వహించే రోడ్‌షో, కార్నర్‌ సభల్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొంటున్నారు.

27న మహబూబాబాద్‌ బీజేపీ అభ్యర్థి జాటోతు హుస్సేన్‌నాయక్‌తో పాటు ఈ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లస్థాయిలో మధ్యాహ్నం బీజేపీ నిర్వహించే సకల జనుల విజయ సంకల్ప సభకు భారత ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. అదేరోజు అటు డోర్నకల్‌ నియోజకవర్గంలో మరిపెడలో కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ జాటోతు రాంచంద్రునాయక్‌ విజయం కోసం ఉదయం 11 గంటలకు నిర్వహించే భారీ బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయా నాయకుల కార్యక్రమాలు దాదాపు ఖరారయ్యాయని సంబంధిత పార్టీ ముఖ్యులు వెల్లడించారు. ఇలా అగ్రనేతలతో జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం పూర్తికానుంది.

Updated Date - 2023-11-23T23:25:17+05:30 IST