Share News

‘ఎవరికి ఓటేశామో సీసీ కెమెరాల్లో చూసేశారు..’

ABN , First Publish Date - 2023-11-29T04:24:01+05:30 IST

తాము ఎవరికి ఓటు వేశామనే విషయం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యిందంటూ పఠాన్‌ చెరు రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో) కార్యాలయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్న ఉద్యోగులు మంగళవారం ఆందోళనకు దిగారు.

‘ఎవరికి ఓటేశామో సీసీ కెమెరాల్లో చూసేశారు..’

పోస్టల్‌ బ్యాలెట్‌ వేసిన ఉద్యోగుల ఆందోళన

పఠాన్‌చెరు ఆర్వో కార్యాలయంలో ఘటన

పటాన్‌ చెరు, నవంబరు 28: తాము ఎవరికి ఓటు వేశామనే విషయం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యిందంటూ పఠాన్‌ చెరు రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో) కార్యాలయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్న ఉద్యోగులు మంగళవారం ఆందోళనకు దిగారు. తమ వ్యక్తిగత స్వేచ్ఛను హరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పటాన్‌చెరు తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్వో కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా, ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు అక్కడే పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ నిర్వహించారు. విధులకు వెళ్లే ముందు సుమారు 600 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అక్కడికి వచ్చారు. అయితే, తాము ఎవరికి ఓటు వేశామో తెలిసేలా బ్యాలెట్‌ బాక్స్‌ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని గుర్తించిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తాము వేసిన ఓటును సీసీ కెమెరాల ద్వారా కొందరు సిబ్బంది గమనిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా ఈ కేంద్రంలో ఉద్యోగులు ఓట్లు వేస్తున్నారని, అవన్నీ రికార్డ అయ్యాయని మండిపడ్డారు. దీనిపై ఆర్వో దేవుజను నిలదీయగా, సీసీ కెమెరాలు ఉన్న దిశను మార్పించడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు. కాగా, ఈ విషయం తెలిసి అక్కడికి చేరుకున్న బీజేపీ నేత ఆశి్‌షగౌడ్‌, కాంగ్రెస్‌ నేత నర్సింహారెడ్డి ఎన్నికల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. రహస్యంగా జరగాల్సిన ఓటింగ్‌ను ఎవరి కోసం బహిర్గతం చేస్తున్నారని నిలదీశారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2023-11-29T04:24:02+05:30 IST