రుచి కావాలంటే... కాస్త కూరండి

ABN , First Publish Date - 2023-04-29T00:37:18+05:30 IST

సాధారణంగా స్టఫ్డ్‌ ఫుడ్‌ అంటే మనకు ఠక్కుమని గుత్తి వంకాయ గుర్తొస్తుంది.

రుచి కావాలంటే... కాస్త కూరండి

సాధారణంగా స్టఫ్డ్‌ ఫుడ్‌ అంటే మనకు ఠక్కుమని గుత్తి వంకాయ గుర్తొస్తుంది. మిరపకాయలతో చేయచ్చనుకుంటాం. అయితే కాకరకాయ, పొట్లకాయ, క్యాప్సికమ్‌, బెండకాయల్లోనూ స్టఫ్‌ కూరి మరింత రుచిగా చేసుకుని తినొచ్చు. సులువుగా, వేగంగా తయారు చేసుకునే ఈ స్టఫ్డ్‌ ఫుడ్‌ రెసిపీలు మీకోసం!

Untitled-2.jpg

స్టఫ్డ్‌ కోడిగుడ్డు క్యాప్సికమ్‌

కావాల్సిన పదార్థాలు

క్యాప్సికమ్‌-1 (ఎలాంటి రంగయినా పర్వాలేదు), కోడిగుడ్లు-2, మిరియాల పొడి- చిటికెడు, కారం పొడి- చిటికెడు, ఉప్పు- రుచికి తగినంత, పచ్చిమిర్చి-1 (సన్నగా తరగాలి), క్యారెట్‌ తురుము- పావు టీస్పూన్‌, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- పావు టీస్పూన్‌, నూనె- ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌, టూత్‌పిక్స్‌- 4

తయారీ విధానం

క్యాప్సికమ్‌ తీసుకుని దాని పైభాగాన్ని కట్‌ చేసి పక్కన ఉంచుకోవాలి. లోపల ఉండే పదార్థాన్ని తీసేయాలి. ఆ వెంటనే.. క్యాప్సికమ్‌లో రెండు కోడిగుడ్ల సొన వేయాలి. మిరియాల పొడి, కారం పొడి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్‌ తురుము వేసి టూత్‌పిక్‌తో మిశ్రమాన్ని మెల్లగా కలపాలి. పచ్చ

సొనను విడగొట్టాలి. ఆ తర్వాత పైభాగాన్ని సరైన పద్ధతిలో క్యాప్సికమ్‌కు కప్పి నాలుగు టూత్‌పిక్స్‌ సాయంతో క్యాప్సికమ్‌ రెండు భాగాలు విడిపోకుండా నాలుగు వైపులా గుచ్చాలి. ఇప్పుడు ప్యాన్‌ తీసుకుని అందులో నూనె వేసి దానిమీద క్యాప్సికమ్‌ ఉంచాలి. అవసరం అనుకుంటే క్యాప్సికమ్‌పై కొద్దిగా ఉప్పు, కారంపొడి చల్లిన తర్వాత ప్యాన్‌ మూత పెట్టి కుక్‌ చేయాలి. క్యాప్సికమ్‌ రంగుమారితే.. లోపల ఉండే కోడిగుడ్లు మిశ్రమం బాగా ఉడుకుతుందనమాట. ఆ తర్వాత టూత్‌పిక్స్‌ తీసేసి క్యాప్సికమ్‌ను చిన్న వొప్పులుగా కట్‌ చేసుకుని స్నాక్స్‌లా తినాలి. రుచి భలే ఉంటుంది. మీకు అవసరం అనుకుంటే ఒకేసారి నాలుగైదు కూడా క్యాప్సికమ్స్‌ చేసుకోవచ్చు. దానికి తగినట్లు ఇంగ్రిడియంట్స్‌ తీసుకుంటే సరి. ఒక కోడిగుడ్డు కాకుండా, రెండు కోడిగుడ్లు వాడితే రుచి రెట్టింపవుతుంది.

Untitled-4.jpg

గుత్తి బెండకాయ వేపుడు

కావాల్సిన పదార్థాలు

లేత బెండకాయలు- పావు కేజీ, నూనె- 4 టేబుల్‌ స్పూన్లు, ధనియాలు- పావు కప్పు, ఎండుమిర్చి- 6, శనగపప్పు- ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌, మినప్పప్పు- టేబుల్‌ స్పూన్‌, వెల్లుల్లి పేస్ట్‌- అరటీస్పూన్‌, పల్లీలు- గుప్పెడులో సగం, జీలకర్ర- టీస్పూన్‌, నువ్వులు- పావు టీస్పూన్‌, ఉప్పు- రుచికి తగినంత, పసుపు- కొద్దిగా

తయారీ విధానం

ముందుగా బెండకాయలు తల, తోకలు కట్‌ చేయాలి. దీంతో పాటు ప్రతి బెండకాయకు మధ్యలో గాటుపెట్టి అందులోని మిశ్రమాన్ని తీసేసి పక్కన ఉంచుకోవాలి.

ప్యాన్‌లో టేబుల్‌ స్పూన్‌ నూనె వేసిన తర్వాత అందులో ధనియాలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, జీలకర్ర, నువ్వులు, పసుపు, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లార్చిన తర్వాత మిక్సీ మెత్తగా పట్టాలి. అందులో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి.

కట్‌ చేసి ఉంచుకున్న బెండకాయల్లోకి ఈ స్టఫ్‌ను కూరాలి. ఆ తర్వాత ప్యాన్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసిన తర్వాత మెల్లగా బెండకాయల్ని ప్యాన్‌లో సర్దాలి. మిగిలిపోయిన స్టప్‌ ఉంటే బెండకాయలపై వేయాలి. ప్యాన్‌పై మూత పెట్టి నాలుగు నిముషాల పాటు కుక్‌ చేయాలి. అన్ని వైపులా వేగేట్లు గరిటెతో కదుపుతూ కుక్‌ చేసుకోవాలి. చివర్లో ఉప్పు చల్లుకుని కుక్కర్‌ మూత క్లోజ్‌ చేసి కొద్దిసేపటి తర్వాత తీసేయాలి. గుత్తి బెండకాయ రెడీ. ఇది సైడ్‌ డిష్‌గానే సర్వ్‌ చేసుకోవాలి.

Untitled-3.jpg

స్టఫ్డ్‌ కాకరకాయ వేపుడు

కావాల్సిన పదార్థాలు

కాకరకాయలు-10 (చిన్నవి), నూనె- 6 టేబుల్‌ స్పూన్లు, మీడియం సైజ్‌ ఉల్లిపాయలు-2 (సన్నగా తరగాలి), జింజర్‌, గార్లిక్‌ పేస్ట్‌- 1 టేబుల్‌ స్పూన్‌, పసుపు- అరటీస్పూన్‌, కారంపొడి - ఒకటిన్నర టీస్పూన్‌, అమ్‌చూర్‌ పౌడర్‌- 2 టీస్పూన్లు, తురిమిన బెల్లం- 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- రుచికి తగినంత, ఇంగువ- చిటికెడు, ధనియాలపొడి- ఒకటిన్నర టీస్పూన్‌, జీలకర్ర- అర టీస్పూన్‌, వేగించిన పల్లీలు- 3 టేబుల్‌ స్పూన్లు, కొబ్బరి తురుము- 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ విధానం

ముందుగా కాకరకాయల మీద బుడిపెలు లేకుండా తరగాలి. ఆ పొట్టు మిశ్రమాన్ని పడేయకుండా ఒక బౌల్‌లో ఉంచుకోవాలి. కాకరకాయల మీద గాటుపెట్టి లోపల ఉండే పదార్థాన్ని చిన్న స్పూన్‌తో తీసేయాలి. ఇలా అన్ని కాకరకాయల్ని స్టఫ్‌ ఉంచటానికి అనువుగా ఉండేట్లు లోపల పదార్థాన్ని తీసేసుకోవాలి.

స్టఫ్‌ తయారీ

ఒక ప్యాన్‌మీద మూడు టేబుల్‌ స్పూన్ల నూనె వేయాలి. ఉల్లిపాయ ముక్కలు, పక్కన ఉంచుకున్న కాకరకాయ తురుము, జింజర్‌ గార్లిక్‌ పేస్ట్‌ వేసి మీడియం ఫ్లేమ్‌లో ఉల్లిపాయలు రంగు మారేంత వరకూ వేయించాలి. ఆ తర్వాత పసుపు, కారం పొడి, ఆమ్‌చూర్‌ పౌడర్‌, బెల్లం, ఇంగువ, ధనియాల పొడి, జీలకర్ర పొడి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ గరిటెతో కలియబెడుతూ ఉండాలి. చివరగా సరిపడ ఉప్పును జత చేసి మిశ్రమాన్ని మూడు నిముషాల బాగా కలపాలి. మరీ పొడిగా ఉందనుకుంటే కొద్దిగా నీరు కలిపితే మిశ్రమం అనువుగా తయారవుతుంది. పల్లీలను చేతుల్లో గట్టిగా నలిపి అందులో వేసిన తర్వాత కొబ్బరి పొడి వేసిన తర్వాత బాగా కలపాలి. ఈ స్టప్‌ను అన్ని కాకరకాయల్లో కూరాలి.

చివరగా ప్యాన్‌లో మూడు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి స్టప్డ్‌ కాకరకాయల్ని రెండువైపులా వేగేట్లు లో ఫ్లేమ్‌లో కుక్‌ చేసుకోవాలి. దీని వల్ల కాకరకాయలు మాడిపోవు. ఈ స్టఫ్డ్‌ కాకరకాయల్ని పప్పన్నం, పెరుగన్నంతో కలిపి తినాలి.

Updated Date - 2023-04-29T00:37:24+05:30 IST