Share News

వరద బాధిత కుటుంబాలకు 3,000 తక్షణ సాయం

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:38 AM

గోదావరి వరద బాధిత కుటుంబాలకు రూ.3,000 చొప్పున నగదు, 25 కిలోల బియ్యంతోపాటు కందిపప్పు, ఉల్లిపాయలు,

వరద బాధిత కుటుంబాలకు 3,000 తక్షణ సాయం

25 కిలోల బియ్యం, కిలో చొప్పున నిత్యావసర సరుకుల పంపిణీ

నిబంధనలకన్నా ఎక్కువ పరిహారమే అందజేస్తాం

శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన

బాధితులకు అండగా ఉండాలని మంత్రులు,

ఎమ్మెల్యేలకు ఆదేశం

అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): గోదావరి వరద బాధిత కుటుంబాలకు రూ.3,000 చొప్పున నగదు, 25 కిలోల బియ్యంతోపాటు కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలో చొప్పున, ఒక లీటరు పామాయిలు కూడా తక్షణ సాయంగా అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. ఇళ్లలోకి వరద నీరు చేరి, పునరావాస కేంద్రాల్లో ఉంటున్నవారందరికీ ఈ తక్షణ సాయం అందుతుందని తెలిపారు. గోదావరి వరదల వల్ల ఆయా జిల్లాల్లో వాటిల్లిన నష్టాలపై సభలో చర్చించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ‘ఇటీవల కురిసిన భారీవర్షాలకు తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఒక లక్షా 6 ఎకరాల్లో వరిపంట, 4,317 ఎకరాల్లో వరి నారుమళ్లు దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 273 ఎకరాల్లో పంటలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పూర్తిస్థాయిలో వరద నష్టాలను అంచనా వేసిన తర్వాత పంటలు నష్టపోయిన రైతులకు నిబంధనల మేరకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే పరిహారం అందజేస్తాం’ అని ప్రకటించారు. వరద నష్టాలను త్వరగా పూర్తి చేయించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనితలను ఆదేశించారు. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించాలని చెప్పారు.

శాసనసభ నిరవధిక వాయిదా

రాష్ట్ర శాసనసభ మొదటి సమావేశాలు శుక్రవారం ముగిశాయి. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు జరిగిన సమావేశాల గణాంకాలను స్పీకరు అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ‘మొత్తంగా ఆరు రోజులు జరిగిన సమావేశాల్లో సభా కార్యకలాపాలు 27 గంటల 22 నిమిషాలపాటు కొనసాగాయి. రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టగా ఆ రెండూ ఆమోదం పొందాయి’ అని స్పీకర్‌ వివరించారు. ఈ సమావేశాలు విజయవంతంగా ముగిశాయని పేర్కొన్న స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు... శుక్రవారం మధ్యాహ్నం 3.18 నిమిషాలకు సభను నిరవధికంగా వాయిదా వేశారు.

Updated Date - Jul 27 , 2024 | 03:39 AM