అమెరికా వస్తున్న విద్యార్థుల్లో 56% తెలుగువారే!
ABN , Publish Date - Nov 21 , 2024 | 04:00 AM
అమెరికాలో చదువుకోడానికి భారతదేశం నుంచి వస్తున్నవారిలో 56 శాతం మంది తెలుగు రాష్ట్రాలవారే ఉన్నారని అమెరికన్ కాన్సుల్ జనరల్(హైదరాబాద్) రెబకా డ్రామె తెలిపారు.
అమెరికన్ కాన్సుల్ జనరల్ రెబకా డ్రామె
విశాఖపట్నం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): అమెరికాలో చదువుకోడానికి భారతదేశం నుంచి వస్తున్నవారిలో 56 శాతం మంది తెలుగు రాష్ట్రాలవారే ఉన్నారని అమెరికన్ కాన్సుల్ జనరల్(హైదరాబాద్) రెబకా డ్రామె తెలిపారు. విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. గతంలో చైనా నుంచి ఎక్కువ మంది విద్యార్థులు అమెరికా వచ్చేవారని, ఇప్పుడు భారత్ మొదటి స్థానం ఆక్రమించిందని చెప్పారు. 2023-24లో భారత్ నుంచి 3.3 లక్షల మంది అమెరికాకు రాగా వారిలో 56 శాతం మంది తెలుగువారే ఉన్నారని, అందులో తెలంగాణ నుంచి 34 శాతం, ఆంధ్రప్రదేశ్ నుంచి 22 శాతం ఉన్నారని తెలిపారురు. వీలైనంత ఎక్కువ మందికి వీసాలు ఇవ్వడానికి యత్నిస్తున్నామని, గతంలో రోజుకు 450 వీసాలు ఇవ్వగా.. ఇప్పుడు ఆ సంఖ్య 1,600కు చేరిందని చెప్పారు. వచ్చే ఫిబ్రవరి నాటికి రోజుకు 2,500 వీసాలు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించుకున్నామన్నారు. విజయవాడ, విశాఖపట్నంలలో ఇంటర్వ్యూ సెంటర్ ఏర్పాటు చేయాలని అడుగుతున్నారని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.