అడ్డంగా దొరికిపోయిన ‘కల్తీ’ కేటుగాళ్లు
ABN , Publish Date - Oct 05 , 2024 | 04:37 AM
టీటీడీకీ నెయ్యి సరఫరా చేసే టెండరు దక్కించుకున్న ఏఆర్ డెయిరీ అడ్డగోలు దందాలు చేసింది. పేరు మాత్రమే ఏఆర్ డెయిరీది. నెయ్యి మాత్రం...
ఏఆర్ డెయిరీ నుంచి జూన్, జూలైలో 8 ట్యాంకర్లు
అవన్నీ తిరుపతి సమీపంలోని వైష్ణవిలో నింపినవే
యూపీలోని భోలేబాబా నుంచి వైష్ణవి కొనుగోళ్లు
కొన్నది కిలో రూ.355కు.. అమ్మిన ధర 318.57
అడ్డగోలుగా కల్తీ చేయకుంటే ఇదెలా సాధ్యం?
5 ట్యాంకర్లు పెనుబాక-దిండిగల్ మీదుగా తిరుమలకు
మూడు ట్యాంకుల నెయ్యి నేరుగా తిరుమలకే
టోల్‌గేట్లు దాటక పోవడమే స్పష్టమైన ఆధారం
స్టేట్ జీఎస్టీ నివేదికలో విస్తుగొలిపే నిజాలు
ఏఆర్ డెయిరీ తమిళనాడులోని దిండిగల్‌లో ఉంది. నిబంధనల ప్రకారం తమ డెయిరీ నుంచే ఈ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలి. కానీ... తిరుపతి సమీపంలోనే ఉన్న వైష్ణవి డెయిరీ నెయ్యి ఏఆర్ డెయిరీ పేరుతో తిరుమలకు చేరుకుంది. కొన్ని ట్యాంకర్లు పెనుబాక నుంచి నేరుగా
తిరుమలకు చేరుకున్నాయి. అవి దిండిగల్-తిరుపతి మధ్య ఉన్న
టోల్‌గేట్లు దాటకపోవడమే దీనికి రుజువు!
తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా నిజం
మార్కెట్‌లో కిలో నెయ్యి రూ.600 కంటే తక్కువకు ఎక్కడా దొరకదు. భోలేబాబా డెయిరీ నుంచి తిరుపతి సమీపంలోని పెనుబాకలో ఉన్న వైష్ణవి డెయిరీ కిలో రూ.355 చొప్పున కొనుగోలు చేసింది.
అదే నెయ్యిని ఏఆర్ డెయిరీకి కిలో రూ.318.57కే విక్రయించింది. అంటే కిలోకు సుమారు 37 రూపాయల నష్టం! నెయ్యిని నానా రకాలుగా కల్తీ చేశారనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి!
వైష్ణవి డెయిరీ నుంచి కిలో రూ.318.57 కొనుగోలు చేసిన (కల్తీ) నెయ్యిని ఏఆర్ డెయిరీ టీటీడీకి రూ.319.50 చొప్పున సరఫరా చేసింది. అంటే అంతా గోల్‌మాల్!
భోలేబాబా నుంచి వైష్ణవి.. దాని నుంచి ఏఆర్ నెయ్యి కొని తిరుమలకు సరఫరా చేసిందని రుజువైంది.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
కల్తీ నెయ్యి దొంగలు అడ్డంగా దొరికిపోయారు! భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిని అడ్డదిడ్డంగా కల్తీ చేశారని రుజువైంది. ‘మాది స్వచ్ఛమైన నెయ్యి. మేం ఏ పాపమూ ఎరుగం’ అని ఏఆర్ డెయిరీ చెప్పినవన్నీ అచ్చోసిన అబద్ధాలని స్పష్టమైంది. ఏఆర్ డెయిరీ పేరుతో వచ్చిన నెయ్యి ‘పక్కా లోకల్’ అని, తమిళనాడులోని దిండిగల్ నుంచి రాలేదని ‘ఆంధ్రజ్యోతి’ ఇది వరకే ప్రచురించిన కథనం అక్షర సత్యమని రుజువైంది. ఈ నెయ్యి ట్యాంకర్ల కదలికలు, కొనుగోళ్లు, వాటి మూలాలపై రాష్ట్ర జీఎస్టీ విభాగం టీటీడీ ఈవోకు సవివరమైన నివేదిక సమర్పించింది. ఉత్తరప్రదేశ్‌లోని భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడు దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీతోపాటు తిరుపతి జిల్లా పెనుమాకలో ఉన్న వైష్ణవి డెయిరీ మధ్య పెనవేసుకున్న ‘నెయ్యి’ బంధం జీఎస్టీ ఇన్‌వాయి్‌సలు, వే బిల్లులు, ట్యాంకర్ నంబర్లతో సహా స్పష్టమైంది. ఏఆర్ డెయిరీ నానారకాలుగా కల్తీ చేసిన నెయ్యినే తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి సరఫరా చేసిందనే విషయం ఆధారాలతో సహా రుజువైంది.
కల్తీ బంధం...
టీటీడీకీ నెయ్యి సరఫరా చేసే టెండరు దక్కించుకున్న ఏఆర్ డెయిరీ అడ్డగోలు దందాలు చేసింది. పేరు మాత్రమే ఏఆర్ డెయిరీది. నెయ్యి మాత్రం... వైష్ణవి డెయిరీది. ఇక్కడ ట్యాంకర్లను నింపేసి... ఇన్‌వాయి్‌సలు మార్చేసి ట్యాంకర్లను నేరుగా తిరుమలకు పంపించింది. ఇక్కడే పెద్ద మాయ జరిగింది. తిరుపతి జిల్లాలోని వైష్ణవి డెయిరీ... కాన్పూర్‌లో ఉన్న భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది. జూన్, జూలై నెలల్లో పలుమార్లు యూపీ నుంచి నెయ్యిని దిగుమతి చేసుకుంది. భోలే బాబా నుంచి సగటున కిలో నెయ్యి రూ.355లకు కొనుగోలు చేసింది. ఇదే నెయ్యిని ఏఆర్ డెయిరీకి కిలో రూ.318.57లకు అమ్మింది. అంటే... కొన్న రేటుకంటే 37 రూపాయలు తక్కువ! నెయ్యిని నానారకాలుగా కల్తీ చేసి, అడ్డమైన కొవ్వులూ కలిపేస్తే తప్ప గిట్టుబాటుకాని ధర ఇది! ఇలా వైష్ణవి నుంచి కొనుగోలు చేసిన 8 ట్యాంకర్ల నెయ్యి ఏఆర్ డెయిరీ పేరుతో తిరుమలకు చేరుకుంది. ఇందులో నాలుగు ట్యాంకర్లతో లడ్డూలు తయారు చేసేశారు. వాటి నాణ్యతపై భారీగా ఫిర్యాదులు రావడంతో... తదుపరి దశలో వచ్చిన 4 ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసి గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పంపించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వాడిన నెయ్యి ఘోరమైన స్థాయిలో కల్తీ జరిగినట్లు ఎన్‌డీడీబీ ప్రయోగశాల స్పష్టమైన నివేదిక ఇచ్చింది.
దారి తప్పి.. దాగుడు మూతలు...
తిరుమలకు ఏఆర్ డెయిరీ పంపిన 8 నెయ్యి ట్యాంకర్ల ‘కదలిక’లను రాష్ట్ర జీఎస్టీ అధికారులు ప్రత్యేకంగా పరిశీలించారు. ఇందులో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి.
ఏఆర్ డెయిరీ పేరుతో వచ్చిన 8 ట్యాంకర్లు... పెనుబాకలోని వైష్ణవి డెయిరీలోనే నెయ్యి నింపుకొన్నాయి. ఏదీ దిండిగల్ నుంచి బయలుదేరి తిరుమలకు రాలేదు.
మొత్తం ఐదు వాహనాలు ఎనిమిది ట్రిపుల్లో నెయ్యిని తిరుమలకు తీసుకొచ్చాయి. ఇందులో నాలుగు తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న ట్యాంకర్లు. ఈ నాలుగు వైష్ణవిలో నెయ్యిని నింపుకొని... దిండిగల్‌కు వెళ్లి... అక్కడి నుంచి తిరుమలకు చేరుకున్నాయి.
ఏపీ26టీసీ4779 అనే నెంబరు ఉన్న ట్యాంకర్ మాత్రం పెనుబాకలోని వైష్ణవి డెయిరీ నుంచి నేరుగా తిరుమలకు ట్రిప్పులు వేసింది. ఈ ట్యాంకర్ టీటీడీకి మూడుసార్లు నెయ్యిని తీసుకొచ్చింది.
తిరుపతి-దిండిగల్ మధ్య గాదంకి, మహాసముద్రం, దానమయ్యగారిపల్లె, ఎల్ అండ్ టి కృష్ణగిరి తోపూర్, ఓమలూర్, రాసంపాళ్యం, వేలంశెట్టియూర్ టోల్‌గేట్లు ఉన్నాయి. కొన్ని ట్యాంకర్లు ఎస్‌వీపురం, తళ్లికొండ, వాణియంబాడి జంక్షన్ మీదుగా ప్రయాణించాయి. ఐదు వాహనాలు ఈ టోల్‌గేట్లను దాటి తిరుపతికి చేరుకోగా... ఏపీ26టీసీ4779 ట్యాంకర్ మాత్రం టోల్‌గేట్ల మీదుగా ప్రయాణమే చేయలేదు. ఏఆర్ డెయిరీ పేరుతో పెనుబాక నుంచి నేరుగా తిరుమలకు నెయ్యి తెచ్చేసింది.
నాలుగు వాహనాలు పెనుబాక నుంచి దిండిగల్‌కు వెళ్లి... అక్కడి నుంచి తిరుమలకు వచ్చాయి. ఇవి ఐదు లోడ్లను సరఫరా చేశాయి. ఒక ట్యాంకర్ మాత్రం వైష్ణవి (పెనుబాక) నుంచి మూడు లోడ్లను నేరుగా తిరుమలకు తీసుకొచ్చింది. ఇందులో మతలబేమిటి? ‘కల్తీ’ ప్రయాణంలో మజిలీలు ఎన్ని?
వైష్ణవీ డెయిరీ... భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ నుంచి అనేకసార్లు నెయ్యి కొనుగోలు చేసింది. ఒక్క జూన్ నెలలోనే... రూ.412తో 19,500 కేజీలు... రూ.403 రేటుకు 29,000 కేజీలు... రూ.313.60 ధరతో 1.58 లక్షల కిలోల నెయ్యిని కొనుగోలు చేసింది. ఇక జూలైలో కిలో రూ.403 చొప్పున 64 వేల కేజీలు, రూ.412 రేటుతో 19,500 కేజీలు కొనుగోలు చేసింది. ఇదే నెయ్యిని వైష్ణవీ డెయిరీ దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీకి విక్రయించింది.