Share News

AP Elections 2024: ఉద్యోగాలు ఇవ్వలేనివాడు నాయకుడా?

ABN , Publish Date - May 01 , 2024 | 05:44 AM

పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేనివాడు ఒక నాయకుడా అని టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు.

AP Elections 2024: ఉద్యోగాలు ఇవ్వలేనివాడు నాయకుడా?

పిల్లలను జగన్‌ గంజాయిపరం చేశారు: చంద్రబాబు

పులివెందులలో సీఎం భార్యనే జనం నిలదీశారు

ఆ స్ఫూర్తితో అందరూ రోడ్లపైకి రావాలి

తాడో పేడో తేల్చుకుందాం

ప్రజాగళంలో టీడీపీ అధినేత పిలుపు

దెందులూరు, తెనాలిల్లో భారీ సభలు

ఏలూరు, గుంటూరు-ఆంధ్రజ్యోతి/దెందులూరు/పెదవేగి, ఏప్రిల్‌ 30: పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేనివాడు ఒక నాయకుడా అని టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు. పిల్లలను గంజాయిపరం చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఐదేళ్లలో చేయబోయే పనులని.. అంతేగానీ ఇంట్లో కూర్చుని బటన్‌ నొక్కేస్తానంటే కుదురుతుందా అని నిలదీశారు. ‘నేనేమీ చేయలేనంటా.. ఈ మగాడు పెద్దగా చేస్తాడంటా.. చూశారుగా ఏం చేశాడో ఇప్పటివరకు’ అని ఎద్దేవాచేశారు. ఉమ్మడి మేనిఫెస్టో అదిరిపోయిందని.. సైకో మేనిఫెస్టో కిందకు దిగిపోయిందన్నారు. ప్రజాగళంలో భాగంగా మంగళవారం సాయంత్రం ఏలూరు జిల్లా దెందులూరు, రాత్రికి గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. ‘కొత్తగా జగన్‌ గాంబ్లింగ్‌ యాక్టు తెస్తున్నారు.. ఆ చట్టం అమలైతే మన ఆస్తులన్నీ ఆయనే కైవసం చేసుకుంటారు. అబద్ధాలు చెప్పడంలో పీహెచ్‌డీ చేశారు. తప్పులు చేసినవాడిని కాదని బాధితుల పైనే కేసులు పెట్టిస్తున్నారు. ఆయన్ను చూడగానే గొడ్డలి జ్ఞాపకం వస్తుంది. కరెంటు చార్జీలు పెంచనని చెప్పి తొమ్మిదిసార్లు పెంచారు. ఆస్తిపన్ను, చెత్తమీద పన్ను.. ఇలా పన్నుమీద పన్ను వసూలు చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు. ఇంకా ఏమన్నారంటే..

రికార్డులు మార్చేస్తే గిజగిజే

జగన్‌ తీసుకొచ్చింది ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు కాదు.. అది జగన్‌ గ్రాబింగ్‌ యాక్టు. ఆ చట్టంతో భూములు ప్రజల పేరుతో ఉండవు. జగన్‌ ఆన్‌లైన్‌లో పెట్టుకుంటాడు. రికార్డులు మార్చేస్తే వాటి యజమానులు గిజగిజ కొట్టుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. నిన్న జగన్‌ భార్య పులివెందులకు వెళ్తే భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి ధైర్యంగా అడిగాడు. ఏమమ్మా నా భూమి మీ ఆయన ఇచ్చాడా... మీ మామ ఇచ్చాడా... మీ తండ్రి ఇచ్చాడా? మా తండ్రి, తాత ఇచ్చారు. అలాంటిది మా భూమి పట్టాదారు పాసుపుస్తకంపై నీ భర్త ఫొటో ఏందని అడిగాడు. ఆ విధంగా తిరుగుబాటు పులివెందుల నుంచే మొదలైంది.

హత్యా రాజకీయాల మనస్తత్వమా నాది?

నేను జగన్‌ను చంపేస్తానట! బుద్ధ్దుందా ఆయనకు? హత్యా రాజకీయాలు చేసే మనస్తత్వమా నాది..! అభివృద్ధి చేసే రాజకీయం నాది. ఆయన్ను చంపడానికి ప్లాన్‌ వేస్తున్నామని ఆయన మాట్లాడతారు.. ఆయన భార్య మాట్లాడుతున్నారు.. ఏ-2 కూడా మాట్లాడతారు. ఇటువంటి వ్యక్తిని శాశ్వతంగా రాజకీయాల నుంచి పంపేయాలి!

ఎవరు బాగున్నా సహించలేరు..

జగన్‌ ఒక అహంకారి.. సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తి. పక్కనున్నవాళ్లు తెల్లబట్టలు వేసుకున్నా సహించలేని గుణం. ఎవరన్నా బాగుంటే ఏమాత్రం ఉపేక్షించరు. జగన్‌.. కక్షలుంటే నీ ఇంట్లో పెట్టుకో. ప్రజాజీవితంలో వాటికి తావు లేదు. నాకు, ఆయనకు ఆస్తుల తగాదా ఉందా..ఆయనేమైనా మా దాయాదా.. ఊరోడా.. బంధువా, కులమా? రాజకీయ విభేదాలు సిద్ధాంతపరంగా ఉంటాయి.

బీజేపీ వాళ్లు ఇంట్లో కూర్చోవద్దు

రాష్ట్రంలో వైసీపీ ఉండడానికి వీల్లేదు. ఓట్లు చీలడానికి వీల్లేదని, అందుకు పొత్తు అనివార్యమని పవన్‌ చెప్పారు. ఆ స్ఫూర్తి ఎక్కడికెళ్లినా ప్రజల్లో కనిపిస్తోంది. బీజేపీ పోటీచేయడం లేదని ఆ పార్టీ వాళ్లు ఇంట్లో కూర్చోవద్దు. తిరుగులేని మెజారిటీ వచ్చేలా చూడాలి. చింతమనేని మీద అక్రమ కేసులు పెట్టారు...నాపైనా కేసులు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నాది.. రైతులకు గోనె సంచులు ఇవ్వలేని ఎర్రిపప్ప (మంత్రి కారుమూరి నాగేశ్వరరావు).. తన కొడుకును (వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి) ఇక్కడకు పంపించాడు. ఆయన్ను ప్రజలంతా ఎర్రిపప్ప చేసి ఇంటికి పంపాలి. కాగా, చంద్రబాబు బుధవారం బాపట్ల జిల్లా చీరాలలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత గుంటూరులో రోడ్‌ షో, సభలో పాల్గొంటారు.

అన్నం పెడితే సహించలేరు

2014-19 నడుమ అభివృద్ధిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను నంబర్‌ వన్‌గా నిలిపాం. 100 సంక్షేమ పథకాలు అమలు చేశాం. అలాంటిది అన్న క్యాంటీన్లను జగన్‌ తీసేశారు. పేదలకు అన్నం పెడితే సహించలేని మూర్ఖుడు. ఇలాంటి వ్యక్తి పేదల పెన్నిధా? రంజాన్‌ తోఫాలు ఆపేశాడు. పండగ చేసుకోకుండా పొట్టగొట్టిన వ్యక్తి మైనారిటీలకు శ్రేయోభిలాషా? మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టులో మంచి న్యాయవాదులను పెట్టి పోరాడింది టీడీపీయే. బీజేపీ నేత సిద్ధార్థనాథ్‌ సింగ్‌ సమక్షంలోనే ఉమ్మడి మేనిఫెస్టోలో మైనారిటీ డిక్లరేషన్‌ను ప్రకటించాం. అదీ మాకు మైనారిటీలపై ఉన్న చిత్తశుద్ధి. వారి జోలికొస్తే తాట తీస్తాం.

Updated Date - May 01 , 2024 | 09:19 AM