పదేళ్ల పంచాయితీకి పరిష్కారం!
ABN , Publish Date - Jul 06 , 2024 | 04:20 AM
రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత జరుగుతున్న కీలక భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది! పెండింగ్ అంశాల పరిష్కారంపై కలిసి మాట్లాడుకుందామంటూ చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు రేవంత్ అంగీకరించిన నేపథ్యంలో...
విభజన సమస్యలపై ఇద్దరు సీఎంల భేటీ నేడే
రేవంత్‌తో చర్చల్లో రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాధాన్యం: బాబు
పదేళ్లుగా పరిష్కారంకాని పంపకాలపై ప్రధానంగా దృష్టి
ఆస్తుల విభజన, విద్యుత్ బకాయి,జల వాటాలే అజెండా
షెడ్యూల్ 9లోని 89 సంస్థల విలువ 1,63,122 కోట్లు
ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు రూ.7,703 కోట్లు
వడ్డీని తీసేసి అసలైనా చెల్లించాలంటున్న ఏపీ
రెండు రాష్ట్రాల మధ్య తెగని ఉద్యోగుల బదిలీ అంశం
కృష్ణాజలాల వాటాల వివాదానికి ఇకపైనా తెర పడేనా?
విభజన జరిగిన పదేళ్లలో సీఎంల భేటీ ఇదే తొలిసారి
చంద్రబాబు చొరవతో పడిన తొలి అడుగు
హైదరాబాద్ ప్రజాభవన్‌లో రేవంత్‌తో చర్చలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు ఇకనైనా పరిష్కారమవుతాయా?
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య చర్చలు సానుకూల ఫలితాలు లభిస్తాయా?
రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత జరుగుతున్న కీలక భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది! పెండింగ్ అంశాల పరిష్కారంపై కలిసి మాట్లాడుకుందామంటూ చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు రేవంత్ అంగీకరించిన నేపథ్యంలో... హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో శనివారం సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రులిరువురూ భేటీ కానున్నారు. విభజన అంశాలే అజెండాగా ఈ సమావేశం జరగనుంది. ఇందులో మూడు అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవి... 1) విభజన చట్టం షెడ్యూల్ 9లో ఉన్న 91 సంస్థలు, షెడ్యూల్ పరిధిలో ఉన్న 142 సంస్థలు, విభజన చట్టంలో ప్రస్తావనకు రాని 12 సంస్థలకు సంబంధించిన ఆస్తుల విభజన. 2) విద్యుత్ బకాయిలు. 3) జల పంపకాలు
ఆస్తుల పంచాయితీ..
విభజన చట్టంలోని షెడ్యూల్ 9లోని 91 సంస్థలో ఎస్‌సీసీఎల్, ఏపీఎ్‌సఎ్‌ఫసీల విభజన కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. మిగిలిన 89 సంస్థల ఆస్తుల విలువ సుమారుగా (భూములు, భవనాలు) రూ.1,06,199 కోట్లు (ఏపీ వాటా రూ.46,949 కోట్లు, తెలంగాణ 35,231 కోట్లు, హెడ్‌క్వార్టర్స్ రూ.24019 కోట్లు), చరాస్తులు రూ.9,893, యంత్రాలు, ఇతర పరికరాలు రూ.39,421 కోట్లు, బ్యాంకు ఖాతాల్లో, ఎఫ్‌డీల్లో ఉన్న సొమ్ము -రూ.7,609 కోట్లు (ఏపీ- 3,588 కోట్లు, తెలంగాణ రూ.3049 కోట్లు, ఫ్రోజెన్-రూ.972 కోట్లు ). ఇవి మొత్తం రూ.1,63,122 కోట్లు.. హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న ఆస్తుల్లో 6ుఅంటే రూ.1,463 కోట్లు విలువైనవి ఏపీలో, మిగిలిన 94 శాతం అంటే, రూ.22,556 కోట్ల విలువైనవి తెలంగాణలో ఉన్నాయి. ఇందులో ఏపీ ప్రభుత్వం 58ు,(రూ.14,002కోట్లు) క్లెయిమ్ చేయగా, షీలా భిడే నిపుణుల కమిటీ రూ.7,127 కోట్లు(30ు) మాత్రమే ఏపీ కోసం సిఫారసు చేసింది. తెలంగాణ ప్రభుత్వం 88ు(రూ.21,028 కోట్లు) క్లెయిమ్ చేయగా నిపుణుల కమిటీ రూ.16,891 కోట్లు(70ు) సిఫారసు చేసింది.
కమిటీ ఇచ్చిన ప్రతిపాదనల్లో 68ు సంస్థల విభజనకు తెలంగాణ ప్రభుత్వం 2019 అక్టోబరులో అంగీకారం తెలిపింది. ఏపీ ప్రభుత్వం మొత్తం 89 సంస్థల విభజనకు అంగీకారం తెలిపింది. ఎస్‌సీసీఎల్(సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్) విభజన సమస్య, ఏపీ స్టేట్ పైనాన్షియల్ సర్వీసెస్ విభజన సమస్య కేంద్ర ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇక...ఏపీ విభజన చట్టం కిందకురాని 12 సంస్థలు సెక్షన్ 64 పరిధిలోకి వస్తాయి. ఈ సంస్థలను జనా భా ప్రాతిపదికన విభజించలేదు. నగదు, చరాస్థులు మాత్రమే విభజించాలని, చరాస్థులు పూర్తిగా తమకే చెందుతాయని తెలంగాణ వాదిస్తోంది. కేంద్ర న్యాయశాఖను సంప్రదించాక ఈ 12 సంస్థల విభజనపై ఒక నిర్ణయం తీసుకుంటామని 2022 సెప్టెంబరు 27న జరిగిన సమావేశంలో కేంద్ర హోం శాఖ తెలిపింది. ఈ సమస్యపై అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని కేంద్ర హోం శాఖ పరిశీలిస్తోందని 2023 మే 5వ తేదీన కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. హోం శాఖ నిర్ణ యం వెల్లడించాల్సి ఉంది. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లో ఉన్న సంస్థల విభజనతోపాటు ఇతర ఆస్తుల విభజన కోసం నిష్పాక్షికంగా వ్యవహరించే ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జీని నియమించాలంటూ ఏపీ ప్రభుత్వం..సుప్రీంకోర్టులో 2022లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం; ఏపీ వేసిన పిటిషన్ ప్రాథమిక హక్కులకు విరుద్ధం కావున కొట్టేయాలంటూ కేంద్రం కౌంటర్ వేశాయి. వీటికి ఏపీ ప్రభుత్వం సమాధానం ఇస్తూ అఫిడవిట్లు వేసింది. జూలై 9న అది విచారణకు రానుంది.
పాత లెక్కలు తేలేనా?
ఏపీజెన్కో 2014 జూన్ 2 నుంచి 2016 జూన్ 10వ తేదీ వరకు తెలంగాణ డిస్కమ్‌లకు విద్యుత్ సరఫరా చేసింది. దీనికి సంబంధించి అసలు బిల్లు రూ.3,442 కోట్లు, వడ్డీ రూ.4,261 కోట్లు మొత్తం రూ.7,703 కోట్లు రావాలి. అసలు బిల్లును వాయిదాల రూపంలోనైనా తక్షణమే చెల్లింపులు చేయాలని ఏపీ కోరుకుంటోంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న 1888 ఉద్యోగులను తెలంగాణ కు, తెలంగాణలో ఉన్న 1447 మంది ఉద్యోగులను ఏపీకి బదిలీ చేసే అంశం కూడా పెండింగ్‌లో ఉంది. తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాడుకున్న క్యాష్‌క్రెడిట్‌పై 2024 జూన్ 30 నాటికి జమ అయిన వడ్డీ రూ.138 కోట్లు చెల్లించాలి. 2014-15లో క్లెయిమ్ చేసిన ఆహార సబ్సిడీ రూ.842 కోట్లలో తెలంగాణ వాటా 276 కోట్లు. వ్యాట్, ఆర్‌డీ సెస్, లోనుపై వడ్డీని ఏపీకి తెలంగాణ చెల్లించాలి. 15 ఈఏపీ ప్రాజెక్టులకు సంబంధించిన అప్పులను రెండు రాష్ట్రాల మధ్య పంచాలి. షెడ్యూల్ 9లో ఉన్న సంస్థలకు సంబంధిం చి షీలా భిడే నిపుణుల కమిటీ ఇచ్చిన 89 సంస్థల విభజన పూర్తిచేయాల్సి ఉంది. కృష్ణా జలాల విషయం లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ హయాం లో ఏరోజూ ఏకాభిప్రాయం కుదరలేదు. గతంలో కేం ద్ర జలశక్తి మంత్రిగా ఉమాభారతి అధ్యక్షతన అపెక్స్ కమిటీ సమావేశం 2016 సెప్టెంబరు 21న జరిగింది. బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపుల మేరకు 811 టీఎంసీలలో 512 టీఎంసీలను ఏపీ, 299 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకోవాలని ఉమాభారతి సూచించారు. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో పెద్దన్న పాత్రను పోషిస్తారని ఉమాభారతి తెలిపారు. 2020 అక్టోబరు 5న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కమిటీ సమావేశానికి అప్పటి ఏపీ సీఎం జగ న్, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీ డిమాండ్లను జగన్ లేవనెత్తకపోవడంతో.. సమావేశమంతా తెలంగాణ వైపు ఏకపక్షంగా సాగింది. అసలు పేచీ విషయానికి వస్తే.. 512 టీఎంసీలను ఏపీకి.. 299 టీఎంసీలు తెలంగాణకు బచావత్ ట్రైబ్యునల్ కేటాయించింది. కానీ, తెలంగాణ నదీ పరీవాహక ప్రాంత విస్తీర్ణం.. కరువు, జనాభా ప్రాతిపదికన 70.80ు జలాలను తమకు కేటాయించాలని తెలంగాణ కోరుతోంది. కాగా, పెండింగ్‌లోని విభజన అంశాలపై చర్చకు సీఎం చంద్రబాబు టీసీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. బాబు లేఖకు స్పందించిన రేవంత్.. ఆహ్వానిస్తూ లేఖ రాశారు.
ఇవే తెలంగాణ డిమాండ్లు?
హైదరాబాద్, జూలై 5(ఆంధ్రజ్యోతి): ప్రజా భవన్‌లో శనివారం రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య చర్చలు సాగనున్నాయి. ఈ చర్చల్లో ప్రధానంగా ఆరు అంశాలు చర్చకు రానున్నట్లు టీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అవి...
1. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కలుపబడ్డ 7 మండలాలు తిరిగీ తెలంగాణలో చేర్చాలి.
2. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి 1000కి.మీ మేర విస్తారమైన తీరప్రాంతం (కోస్టల్ కారిడార్)ఉంది. తెలంగాణకు ఈ తీరప్రాంతంలో భాగం కావాలి.
3. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వేంకటేశ్వరస్వామి. తెలంగాణకు కూడా టీటీడీలో భాగం కావాలి.
4. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్ మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలి. అదేవిధంగా తెలంగాణకు 558 టీఎంసీ నీటిని కేటాయింపు చేయాలి.
5. తెలంగాణ విద్యుత్ సంస్థలకు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు రూ.24,000 కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలి. దానిలో భాగంగా ఆంధ్రాకు ఏమైనా చెల్లించాల్సి ఉంటే, వాటిని చెల్లించడం జరుగుతుంది.
6. తెలంగాణకు ఓడరేవులు లేవు. అందువల్ల విభజనలో భాగంగా ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం కావాలి