Share News

వైసీపీ వేధింపులు.. భూకబ్జాలపై ఫిర్యాదులు

ABN , Publish Date - Aug 20 , 2024 | 06:26 AM

వైసీపీ నేతల వేధింపులు, భూకబ్జాలపై సోమవారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్సుకు వినతులు వెల్లువెత్తాయి.

వైసీపీ వేధింపులు.. భూకబ్జాలపై ఫిర్యాదులు

  • వినతులపై తక్షణమే స్పందించిన మంత్రి అచ్చెన్న

  • పరిష్కరించాలంటూ డీజీపీ, కలెక్టర్లకు ఫోన్లు

అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతల వేధింపులు, భూకబ్జాలపై సోమవారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్సుకు వినతులు వెల్లువెత్తాయి. వీటిని స్వీకరించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పరిష్కరించాలంటూ అప్పటికప్పుడు డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి చెప్పారు. పార్టీ నేతలు కంభంపాటి రామ్మోహనరావు, వైద్యుల విభాగం నేత డాక్టర్‌ శివప్రసాద్‌తో కలిసి ఆయన ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు.

తమను గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్రంగా కొట్టి హింసించిన పోలీస్‌ అధికారులు ఇప్పుడు టీడీపీ ముసుగు వేసుకొని మంచి పోస్టింగులు పొందారని కడప జిల్లా మైదుకూరు నుంచి వచ్చిన టీడీపీ కౌన్సిలర్లు, ఇతర నేతలు ఫిర్యాదు చేశారు. తమను అప్పట్లో పోలీసులు కొట్టిన దెబ్బల ఫొటోలు కూడా చూపించారు.

దీనితో మంత్రి అప్పటికప్పుడు డీజీపీకి ఫోన్‌ చేసి ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి, వాస్తవమైతే తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన రవికిరణ్‌రెడ్డి, అప్పిరెడ్డి, సుమంత్‌రెడ్డి మంత్రికి ఇచ్చిన ఫిర్యాదులో హైదరాబాద్‌లో ఉంటున్న ఒక వ్యక్తిపై అక్రమ కేసు పెట్టి గత ప్రభుత్వంలో వైసీపీకి కొమ్ముకాసిన ఒక పోలీస్‌ అధికారి రూ.60 లక్షలు వసూలు చేశాడని, అతనిపై చర్య తీసుకోవాలని కోరారు.


నర్సరీల కోసం రైతుల దగ్గర భూమి తీసుకోవడానికి గత ప్రభుత్వం తెచ్చిన రిజిస్ట్రేషన్‌ విధానాన్ని రద్దు చేసి గత టీడీపీ హయాంలో ఉన్న అగ్రిమెంట్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. జగనన్న భూ సర్వేలో తన సొంత భూమిని ప్రభుత్వ భూమిగా చూపిస్తూ రికార్డు మార్చేశారని, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఉపయోగం లేకుండా పోయిందని నంద్యాల జిల్లా కొండాపురానికి చెందిన సంజీవ వరప్రసాద్‌ ఫిర్యాదు చేశారు.

బాపట్ల జిల్లా మార్టూరులో నేతాజినగర్‌ కాలనీలోని అంబేడ్కర్‌ భవన నిర్మాణ స్థలాన్ని వైసీపీ నేతల అండతో కొందరు ఆక్రమించుకొని కట్టడాలు నిర్మించారని, వాటిని తొలగించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని అక్కడి నుంచి వచ్చినవారు కోరారు.

వైసీపీ నాయకులను తనకు రావాల్సిన డబ్బులు అడిగినందుకు గ్రామం నుంచి వెలివస్తే ఆరు నెలల నుంచి తెలంగాణలో తలదాచుకొంటున్నామని, దళితులం కావడంతో వైసీపీ నేతలపై పోరాడడానికి శక్తి సరిపోవడం లేదని నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం పెద్దాపురానికి చెందిన నిప్పులపల్లి కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు.


తమకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని వైసీపీ నేతలు ఆన్‌లైన్‌లో తమ పేరుపై మార్పించుకొని పట్టా కూడా తీసుకొన్నారని, ఆ భూమిని తమకు తిరిగి ఇప్పించాలని ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలెంకు చెందిన జెల్లి మస్తాన్‌ కోరారు.

వైసీపీ నేతల దగ్గర అప్పు తీసుకొంటే తీసుకొన్న మొత్తానికి ఐదు నుంచి పది రెట్ల డబ్బు కట్టాలని వేధిస్తున్నారని మంత్రాలయానికి చెందిన జమ్మన్న, మరికొందరు ఫిర్యాదు చేశారు. టీడీపీలో చురుగ్గా పనిచేస్తున్న తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, వాటిని తొలగించాలని అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తోటాడ పంచాయతీ గవర్ల అనకాపల్లికి చెందిన పొలమరశెట్టి మురళీకృష్ణ కోరారు.

వైద్య ఆరోగ్య శాఖలో ఎంతోకాలంగా పనిచేస్తున్న రెగ్యులర్‌ ఏఎన్‌ఎంలను ఎక్కడో దూరంగా విసిరివేసి కొత్తగా నియమితులైన వారిని పట్టణ సచివాలయాల్లో నియమించారని, దీనిని సరిదిద్దాలని కొందరు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Aug 20 , 2024 | 06:27 AM