Share News

Amarvati : ఏం మాట్లాడుతున్నారు.. జగన్‌!

ABN , Publish Date - Jul 05 , 2024 | 02:24 AM

‘నా క్టైంట్‌ దొంగతనాలు చేశాడు. అయితే ఉరి శిక్ష వేస్తారా? దోపిడీలు చేశాడు... అయితే ఉరి శిక్ష వేస్తారా? బాంబులు కూడా వేశాడు. అయితే, ఉరి శిక్ష వేసేస్తారా?’... అదేదో సినిమాలో కమెడియన్‌ లాయర్‌ తన క్లైంటునే ఇలా కోర్టులో ఇరికించేస్తాడు.

Amarvati : ఏం మాట్లాడుతున్నారు.. జగన్‌!

  • పరిస్థితి బాగలేక ఈవీఎంను పిన్నెల్లే బద్దలుకొట్టారట!

  • ఇన్నాళ్లూ అది మార్ఫింగ్‌ అంటూ వైసీపీ నేతల వాదన

  • నెల్లూరు జైలు ముందు నిజం ‘బద్దలు’ కొట్టిన జగన్‌

  • ఐదేళ్లు అరాచకాల్లో మునిగి...‘మాజీ’ కాగానే నీతులు

  • పాపాలు పండుతాయని చంద్రబాబుకు హెచ్చరికలు

  • జైలులో పిన్నెల్లికి వైసీపీ అధినేత పరామర్శ

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘నా క్టైంట్‌ దొంగతనాలు చేశాడు. అయితే ఉరి శిక్ష వేస్తారా? దోపిడీలు చేశాడు... అయితే ఉరి శిక్ష వేస్తారా? బాంబులు కూడా వేశాడు. అయితే, ఉరి శిక్ష వేసేస్తారా?’... అదేదో సినిమాలో కమెడియన్‌ లాయర్‌ తన క్లైంటునే ఇలా కోర్టులో ఇరికించేస్తాడు. ఇప్పుడు తమ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి విషయంలో జగన్‌ కూడా అదే చేశారు. ‘పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టలేదు. ఆ వీడియోలో ఉన్నది ఆయన కాదు. అయినా... లోకేశ్‌ పోస్టు చేసిన వీడియోపై ఎలా చర్యలు తీసుకుంటారు’... అని వైసీపీ నేతలు, లాయర్లు వాదిస్తుండగా జగన్‌ మాత్రం, ‘అవును. ఈవీఎంను పిన్నెల్లే పగలగొట్టారు’ అని ధ్రువీకరించారు. ‘‘అన్యాయం జరుగుతాఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతున్న వారి పక్షాన నిలబడి ఉన్నానని చెప్పడం కోసం లోపలికిపోయి ఈవీఎం పగలగొట్టే కార్యక్రమం జరిగింది. అక్కడ ఎమ్మెల్యే పరిస్థితి బాగుంటే ఎందుకు పగలగొడతాడు.

అక్కడ పరిస్థితి బాగలేదనే కదా... అన్యాయం జరుగుతోందని తెలిసే కదా ఈవీఎం పగలగొట్టాడు’’ అని పిన్నెల్లిని ఫిక్స్‌ చేశారు. నెల్లూరు కారాగారం ముందు జగన్‌ నీతులు, సూక్తులూ వల్లెవేశారు. ‘ముఖ్యమంత్రిగా నేను ఏమైనా చేయొచ్చు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలకైనా పాల్పడవచ్చు. మీరు మాత్రం పద్ధతిగా ఉండాల్సిందే’’ అన్నట్లుగా చంద్రబాబుకు హితోక్తులు చెప్పారు.

‘‘అధికారం శాశ్వతం కాదు. పాపాలు పండుతాయి. చెడు సంప్రదాయాలు నెలకొల్పవద్దు!’ అని జగన్‌ సూక్తిముక్తావళి వినిపించారు. ఇదే విషయాన్ని తాను అధికారంలో ఉండగా జగన్‌ గుర్తుపెట్టుకుని ఉంటే... ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ‘ప్రజావేదిక’ కూల్చివేతతో మొదలైన జగన్‌ కక్షసాధింపు పాలన చంద్రబాబును అరెస్టు చేయించే దాకా వెళ్లింది. క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలు ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నా జగన్‌ ఏ ఒక్కరోజూ స్పందించలేదు. ‘ఇది తగదు. అధికారం శాశ్వతం కాదు.


ప్రజలు అన్నీ లెక్క పెట్టుకుంటారు’ అని ఇప్పుడు చెప్పిన మాటలు గత ఐదేళ్లలో ఒక్కరోజూ చెప్పలేదు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసినా, చంద్రబాబు నివాసంపై దాడికి తెగబడినా, పట్టాభి నివాసంలోకి దూరి విధ్వంసం సృష్టించినా, పల్నాడులో బీసీ నేత చంద్రయ్యను నడిరోడ్డుపై గొంతు కోసి చంపినా.... జగన్‌ స్పందించలేదు. పైగా... దాడులు చేసిన వారికి ప్రోత్సాహకాలు, పదవులూ ఇచ్చారు. ఇక... టీడీపీ శ్రేణులపై దాడులు చేసి, వారిపైనే ఎదురు కేసులు పెట్టడం ఐదేళ్లలో నిత్యకృత్యంగా మారింది. ఇప్పుడేమో... ‘వాళ్లే దాడులు చేస్తున్నారు. వాళ్లే కేసులు పెడుతున్నారు’ అని జగన్‌ వింతగా వాపోతున్నారు.

మీరు ఇలా చేశారా?

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తమ నాయకుడి భవనం కూలగొట్టించారని జగన్‌ ఆక్రోశించారు. ఇదే ఘటనలో కొలికపూడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను చంద్రబాబు పిలిచి మందలించారు. ‘ఏదైనా చట్టప్రకారమే చేయాలి’ అని తెలిపారు. ఇక... ఒక మంత్రి భార్య ఎస్‌ఐపై దురుసుగా మాట్లాడిన ఘటనపై చంద్రబాబు అప్పటికప్పుడు స్పందించారు. మంత్రితో మాట్లాడి... ఇలాంటివి పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. ఐదేళ్లలో జగన్‌ ఇలా ఏ ఒక్క ఘటనపైనైనా స్పందించారా? అరాచకాలకు పాల్పడుతున్న తమ శ్రేణులను మందలించారా? ఐదేళ్లలో తాను చేసింది మరిచిపోయి... ఇప్పుడు వాపోతే జనం నమ్ముతారా? నవ్వుతారా?

పిన్నెల్లి పరామర్శకు రూ.25 లక్షలు: అనిత

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి జైలుకెళ్తే ఆయన్ను పరామర్శించేందుకు పులివెందుల ఎమ్మెల్యే జగన్‌ రూ.25 లక్షలు ఖర్చు పెట్టి హెలీకాప్టర్‌లో వెళ్లారని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. గురువారం సచివాలయంలో ఆమె మాట్లాడారు. పిన్నెల్లికి అన్ని ములాఖత్‌లు ముగిశాయని, ఆ విషయం తెలిసీ ఇవ్వకుంటే గొడవ చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు జగన్‌ ప్రయత్నించారని ఆరోపించారు.

సీఎం చంద్రబాబు కుటుంబానికి గతేడాది రాజమహేంద్రవరంలో ఎన్నో ఆంక్షలు పెట్టిన జగన్‌ను... మానవతా దృక్పథంతో అనుమతించామని చెప్పారు. జైలు బయటికి వచ్చాక ఏదేదో మాట్లాడుతున్న వైసీపీ అధ్యక్షుడికి జైళ్ల శాఖ అధికారుల నుంచి నివేదిక తెప్పించుకుని సమాధానం చెబుతామన్నారు. ఇదే అంశంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌ రెడ్డి మాట్లాడుతూ, పులివెందుల ఎమ్మెల్యే జగన్‌ రాబోయే రోజుల్లో పరామర్శలకే పరిమితం అవుతారంటూ ఎద్దేవా చేశారు. జగన్‌ మళ్లీ జైలుకు పోయే సమయం దగ్గరపడిందని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న ఎక్స్‌లో... పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్‌ వెనకేసుకు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 05 , 2024 | 02:35 AM