మత్తు వదిలిస్తాం
ABN , Publish Date - Nov 30 , 2024 | 05:00 AM
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగల్) చీఫ్ ఆకే రవికృష్ణ అన్నారు.
రాష్ట్రాన్ని గంజాయి రహితంగా చేయడమే లక్ష్యం
గంజాయి కేపిటల్‌గా దేశంలో ఏపీకి చెడ్డపేరు వచ్చింది
మన్యంలో ప్రతి గిరిజన బిడ్డనూ ఈగల్ బృందం కలుస్తుంది
గంజాయి సాగుతో సమాజానికి జరిగే నష్టమేంటో వివరిస్తాం
వారిని ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లిస్తాం
రైతు నుంచి వినియోగదారుడి వరకూ చైన్‌లింక్ తెగ్గొడతాం
ప్రతి ఒక్కరూ సహకరించాలి: ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ
మత్తు బారిన పడిన బిడ్డలను చూసి ఆవేదన చెందొద్దు
ప్రతి తల్లీ ‘ఈగల్’కు బ్రాండ్ అంబాసిడర్ కావాలని పిలుపు
అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగల్) చీఫ్ ఆకే రవికృష్ణ అన్నారు. ఈ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడారు. గంజాయి బారిన పడిన కొడుకు పరిస్థితి చూసి రాష్ట్రంలో ఏ తల్లీ ఆవేదన చెందకూడదని, మత్తు మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రతి తల్లీ ‘ఈగల్’కు బ్రాండ్ అంబాసిడర్ కావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా డ్రగ్స్ బారిన పడటానికి వీల్లేదు. భవిష్యత్తు నాశనం చేసుకోకూడదు. మన్యంలో ప్రతి గిరిజన బిడ్డను ఈగల్ బృందం కలుస్తుంది. గంజాయి సాగు వల్ల సమాజానికి జరిగే నష్టమేంటో వివరిస్తుంది. గంజాయిని సాగు చేస్తే ప్రభుత్వం సంక్షేమ పథకాలు దక్కవనే విషయాన్ని తెలియజేస్తాం. జైలుకు వెళితే జీవితాలు నాశనమవుతాయని నచ్చజెప్పి వారిని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లిస్తాం. ఈగల్‌కు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సహాయ, సహకారాలు అందించాలి. ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఇందులో సభ్యులే.. మత్తు సమాచారాన్ని టోల్ ఫ్రీ నం. 1972కు అందించాలి’ అని ఆయన కోరారు.
పిల్లల్లో మార్పు కనిపిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని, మత్తుకు బానిసలైతే డీఅడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స చేయిస్తామని, అంతకుమించి తప్పుచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్రం తెచ్చిన నార్కోటిక్ చట్టం ప్రకారం గంజాయి సాగు, రవాణా, విక్రయంతో పాటు వినియోగం కూడా నేరమేనని రవికృష్ణ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై సీరియ్‌సగా ఉందని.. ఎస్టీడీడీ (సోర్స్, ట్రాన్స్పోర్ట్, డెస్టినేషన్, డిమాండ్)పై దృష్టి సారించి మన్యంలో సాగుచేసే రైతు నుంచి వినియోగదారుడి వరకూ మొత్తం చైన్లింక్ను ఎక్కడికక్కడ తెగ్గొట్టడమే ఈగల్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మహమ్మారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందని, అందుకు అనుగుణంగా ప్రివెన్షన్, డిటెక్షన్‌తో పాటు కన్విక్షన్పైనా ప్రత్యేక శ్రద్ధ పెడతామన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, వారందరి భవిష్యత్తు బాగుండాలంటే గంజాయి మెక్క పెరగడానికి, మత్తు పదార్థాలు ఏపీలోకి రావడానికి వీల్లేదని రవికృష్ణ పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం ఢిల్లీలో కొందరు అధికారులు మాట్లాడుతూ ఏపీ గంజాయి కేపిటల్ ఆఫ్ ఇండియాగా మారుతోంది అనడంతో ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా అవేదన చెందానని తెలిపారు. ఇటీవల దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలో.. దేశంలో ఎక్కువ గంజాయి లభించే రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రస్థానంలో ఉన్న స్లైడ్ చూపించడం అవమానంగా అనిపించిందన్నారు. అల్లూరి జిల్లాలో 9 మండలాల పరిధిలో సాగయ్యే మత్తు మహమ్మారి వల్ల రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఇలా చెడ్డ పేరు రావడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి జిల్లాలో ఈగల్ సెల్
ఐబీలో సమర్థంగా పనిచేసిన ఐజీ ర్యాంకు అధికారి ఆకే రవికృష్ణను యాంటీ నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్ అధిపతిగా ప్రభుత్వం నియమించింది. అమరావతిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఒక సెల్ ఏర్పాటు చేయనుంది. ఇద్దరు ఎస్పీలు, నలుగురు అడిషనల్ ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు కీలకంగా వ్యవహరిస్తారు. ప్రతి జిల్లాలోనూ ఏఎన్టీఎఫ్ సెల్ ఏర్పాటు చేసి 26మంది ఎస్ఐల నేతృత్వంలో సిబ్బంది గంజాయి, డ్రగ్స్ కట్టడికి కృషి చేస్తారు. అయితే గంజాయి సాగు, సరఫరా మొదలు విక్రయాల వరకూ ఎవరు పట్టుబడినా వారిపై అమరావతిలోని ఏఎన్టీఎఫ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేస్తారు. ఒడిశా నుంచి అక్రమ మార్గంలో ఏపీలోకి వస్తున్న గంజాయిని కట్టడి చేసేందుకు సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి ఫేషియల్ రికగ్నైజేషన్, ఆటోమెటిక్ నంబర్ డిటెక్షన్ వ్యవస్థలతో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు.
మూడేళ్ల క్రితం ఢిల్లీలో కొందరు అధికారులు మాట్లాడుతూ ఏపీ గంజాయి కేపిటల్ ఆఫ్ ఇండియాగా మారుతోంది అనడంతో ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా అవేదన చెందా. ఇటీవల దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశం చెన్నైలో జరిగినప్పుడు దేశంలో ఎక్కువ గంజాయి లభించే రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రస్థానంలో ఉన్న స్లైడ్ చూపించడం అవమానంగా అనిపించింది.