Share News

YS Viveka Case: వైఎస్ వివేకా హత్యకేసులో ఊహించని ట్విస్ట్

ABN , Publish Date - Jul 25 , 2024 | 07:48 PM

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది..

YS Viveka Case: వైఎస్ వివేకా హత్యకేసులో ఊహించని ట్విస్ట్

కడప/అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య (YS Viveka Murder Case) కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల జాబితా నుంచి నాలుగో నిందితుడిగా ఉన్న దస్తగిరి పేరును సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) కోర్టు తొలగించింది. తనను నిందితుడిగా కాకుండా సాక్షిగా మాత్రమే పరిగణించాలని సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను గురువారం నాడు కోర్టు స్వీకరించింది. ఈ క్రమంలో సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు.. దస్తగిరి పేరును తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సీబీఐ అధికారులు దాఖలు చేసిన అభియోగపత్రంలోనూ తనను సాక్షిగా చేర్చిన విషయాన్ని కూడా దస్తగిరి పేర్కొన్నారు. దస్తగిరి వాదనలను పరిగణలోనికి తీసుకున్న సీబీఐ కోర్టు నిందితుల జాబితా నుంచి పేరు తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాగా.. 2019 మార్చి 14 అర్థరాత్రి పులివెందులలోని సొంత గృహంలో వైఎస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు.


Dastagiri-And-Viveka.jpg

ఎప్పుడు.. ఏం జరిగింది..?

ఈ కేసులో చోటు చేసుకొన్న పలు పరిణామాల నేపథ్యంలో వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత.. న్యాయస్థానాన్ని ఆశ్రయించి, సీబీఐతో విచారణ జరిపించాలని కోరడంతో న్యాయస్థానం అంగీకరించింది. ఈ క్రమంలోనే సీబీఐ రంగంలోకి దిగి ఇందులో సూత్రదారులు, పాత్రదారులు ఎవరు..? అని తేల్చి, వారిని వరుసగా అరెస్ట్ చేయడం కూడా చకచకా జరిగిపోయింది. ఇలా అరెస్ట్ అయిన వారిలో దస్తగిరి నాలుగవ నిందితుడు. అయితే.. సీబీఐ అధికారులు పలుమార్లు విచారించగా దస్తగిరి అప్రూవర్‌గా మారిపోయి.. ఈ హత్యలో ఎవరెవరు ఉన్నారు..? అని పూసగుచ్చినట్లుగా చెప్పేశారు. పాత్రదారులు, సూత్రదారుల పేర్లు బహిర్గతం చేయడమే కాకుండా.. ఈ హత్య కేసులో సీఎం జగన్ సోదరుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కరరెడ్డి సూత్రధారులుగా ఉన్నారని క్లియర్ కట్‌గా చెప్పేశారు. అంతేకాదు.. ఈ హత్య ద్వారా కోట్లాది రూపాయిల సూపారీ సైతం చేతులు మారిందన్న విషయాన్ని బయటపెట్టడంతో పెను సంచలనమే అయ్యింది. ఈ విచారణలో భాగంగా దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతో మరింత స్పీడ్ పెంచిన సీబీఐ పలువురు నిందితులను అరెస్ట్ చేయడంతో.. హైదరాబాద్ వేదికగా విచారణ కూడా చేపట్టింది.


ap-high-court-viveka.jpg

ఐదేళ్ల తర్వాత..!

వివేకా హత్య కేసులో నాలుగవ నిందితుడిగా ఐదేళ్లపాటు జైలులో దస్తగిరి ఉన్నారు. అప్రూవర్‌గా మారడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నాటి నుంచి బెయిల్‌పై బయటే ఉన్నారు దస్తగిరి. అయితే.. భాస్కర్ రెడ్డి అరెస్ట్, ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ విషయంలో ఎంత హైడ్రామా నడిచిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ వివేకా హత్య కేసులో అవినాష్ ఏ8గా ఉన్నారు. ఆ మధ్య వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుస ఢిల్లీ పర్యటనలతో కేసు దర్యాప్తు నెమ్మదించినదే ఆరోపణలు కోకొల్లలు. ఈ పరిస్థితుల్లోనే అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు.. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిలు పలుమార్లు పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే.. జైలు నుంచి బయటికొచ్చిన తర్వాత కూడా పలుమార్లు ఆయన్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ప్రేమికుల జంటను బెదిరించారని, ల్యాండ్ సెటిల్మెంట్స్‌, కిడ్నాప్ కేసు ఇలా చాలా కేసుల్లోనే దస్తగిరి ఇరుక్కున్నారు. అంతేకాదు.. ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు కూడా నమోదు అయ్యింది.

Updated Date - Jul 25 , 2024 | 09:02 PM