అమరావతికి రైల్వే లైన్!
ABN , Publish Date - Oct 25 , 2024 | 03:26 AM
అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివా్‌సతో కలిసి తెలుగు మీడియాతో మాట్లాడారు.
రూ.2,245 కోట్లతో నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఓకే
అమరావతి 2.0కు అన్నీ శుభాలే
నిన్న రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.15 వేల కోట్లు
ఎర్రుపాలెం-నంబూరు మధ్య 57 కి.మీ. రైలు మార్గం
కృష్ణా నదిపై కొత్తగా 3.2 కి.మీ. పొడవైన వంతెన
పరిటాల వద్ద మల్టీమోడల్ కార్గో టెర్మినల్
బందరు, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులతో కనెక్టివిటీ
దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో అనుసంధానం
దక్షిణ, ఉత్తర భారతాలను కలుపుతూ నిర్మాణం
దేశమంతా సంధానానికి మార్గం సుగమం
నాలుగేళ్లలోపే పూర్తి చేస్తాం
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి
మూడేళ్లలో పూర్తయ్యేలా చూడండి
భూసేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్
కాబట్టి పనులు త్వరగా పూర్తిచేయండి
వీడియో కాన్ఫరెన్స్‌లో బాబు సూచన
శ్రీకాకుళంలో 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్
రణస్థలం వద్ద 252.42 కోట్లతో ఏర్పాటు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
న్యూఢిల్లీ, గుంటూరు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివా్‌సతో కలిసి తెలుగు మీడియాతో మాట్లాడారు. రైల్వే లైన్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయాన్ని ప్రకటించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, లావు శ్రీకృష్ణదేవరాయలతో ఆయన మాట్లాడారు. రాబోయే నాలుగేళ్లలో అమరావతి రైలు మార్గాన్ని పూర్తి చేస్తామని తేలియజేశారు. ‘‘అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఏపీ ప్రజల కలల ప్రాజెక్టు. అందుకే.. ఈ నగరాన్ని రైల్వేతో అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకున్నాం.
నవ్యాంధ్ర తొలి సీఎంగా అప్పట్లోనే చంద్రబాబు.. అమరావతికి కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. అది ఇప్పుడు, కూటమి ప్రభుత్వంలో సాకారం అవుతోంది’’ అని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ రైలుమార్గం నిర్మాణంతో అమరావతికి దేశంలోని అన్ని రాష్ట్రాలతో కనెక్టివిటి వస్తుందని పేర్కొన్నారు. వాస్తవానికి, రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులను పురోగతిలోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు సమీక్షలు నిర్వహించారు. రైల్వే మంత్రితో అనేక దఫాలు చర్చించారు. వీటన్నింటి ఫలితంగా అమరావతి మీదుగా ఎర్రుపాలెం - నంబూరు మధ్య నూతన రైలుమార్గాన్ని కేంద్ర కేబినెట్ ఎకనామిక్ ఎఫైర్స్ కమిటీ ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల పొడవున ఈ రైలుమార్గం నిర్మాణం జరగనుంది. దీని వలన 19 లక్షల మానవ పనిదినాలు జనరేట్ అవుతాయని, ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి తెలిపారు.
కొండపల్లికి మినహాయింపు
ఖమ్మం జిల్లా మధిరలోని ఎర్రుపాలెం - నంబూరు (అమరావతి) రైలుమార్గంలో కొండపల్లి రిజర్వు అటవీ ప్రాంతం కలవకుండా జాగ్రత్తలు తీసుకొన్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పరిటాల వద్ద మల్టీమోడల్ కార్గో టెర్మినల్ నిర్మిస్తామని, దీని వల్ల సరుకు రవాణాకు అదొక హబ్‌గా మారుతుందన్నారు. పర్యావరణహితంగా ఈ రైలుమార్గం నిర్మాణం చేస్తారు. దీని వలన ఆరు కోట్ల కేజీల మేర కార్బన్ ఉద్గారాల నియంత్రణ జరుగుతుందని, ఇది 25 లక్షల మొక్కలతో సమానమని ఆయన పేర్కొన్నారు. రైలుమార్గం పొడవునా పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకొంటామన్నారు.
కృష్ణానదిపై వంతెన నిర్మాణం
అమరావతి రైలుమార్గంలో 3.2 కిలోమీటర్ల పొడవున కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారు. కొత్తపల్లి - వడ్డమాను గ్రామాల మధ్య దీనిని ఏర్పాటు చేస్తారు. హౌరా - చెన్నై మార్గంలో ఇప్పటికే ఉన్న బ్రిడ్జికి సమాంతరంగా మరొక బ్రిడ్జి అందుబాటులోకి వస్తుంది. ఇది ఎంతో క్లిష్టమైన పని అయినప్పటికీ రైలుమార్గంతో పాటే బ్రిడ్జీ నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి పేర్కొన్నారు.
సింగిల్ లైన్...160 కిలోమీటర్ల వేగం..
నూతన రైలుమార్గం ప్రస్తుతానికి సింగిల్ లైన్‌గా నిర్మిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘‘ట్రాఫిక్‌ను బట్టి డబ్లింగ్ చేస్తాం. సింగిల్ లైన్ అయినప్పటికీ 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిచేలా ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా ఉండే సికింద్రాబాద్ - కాజీపేట, విజయవాడ - చెన్నై, బలార్ష - కాజీపేట మార్గాలను కూడా 160 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకొనేలా వాటి సామర్థ్యం అప్‌గ్రేడ్ చేస్తాం’’ అని ఆయన తెలిపారు.
ఇతర రైలుమార్గాలతో సంధానం..
హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా వంటి పెద్ద నగరాలతో అనుసంధానిస్తూ అమరావతి రైల్వే ప్రాజెక్టును చేపట్టనున్నారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను కలుపుతూ రైల్వే లైను నిర్మాణం చేయనున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత ప్రయాణ సౌకర్యం కలగడంతోపాటు పారిశ్రామికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. నంబూరు రైల్వేస్టేషన్ విజయవాడ - గుంటూరు/న్యూగుంటూరు సెక్షన్‌లో ఉన్నది. అలానే ఎర్రుపాలెం రైల్వేస్టేషన్ విజయవాడ - ఖమ్మం సెక్షన్‌లో ఉంది. విజయవాడ - ఖమ్మం సెక్షన్ నుంచి బలార్ష, ఇటార్సీ, నాగ్‌పూర్, భోపాల్, ఢిల్లీకి కొత్త రైల్వే లైన్ అనుసంఽధానం అయి ఉంటుంది. అంతేకాకుండా అటు గుజరాత్ వైపునకు, ఇటు ఉత్తర్‌ప్రదేశ్‌కు కూడా ఈ మార్గంతో కనెక్టివిటీ ఉంది. నంబూరు రైల్వేస్టేషన్ నుంచి గుంటూరు మీదగా సికింద్రాబాద్, బెంగళూరుకు కనెక్టివిటీ ఉంది. న్యూగుంటూరు మీదగా తెనాలి నుంచి చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం, కన్యాకుమారికి కూడా కనెక్టివిటీ ఉంది. దక్షిణ, మధ్య, ఉత్తర భారత్‌తో అనుసంధానం మరింత సులువు కానుంది.
బిహార్‌కూ భారీగానే..
బిహార్‌లో భారీఎత్తున ట్రాక్ డబ్లింగ్ పనులు చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. బిహార్‌లో రూ. 4,553 కోట్లతో రైల్వే ప్రాజెక్టులను పెద్దఎత్తున నిర్మించనున్నారు. ఉత్తర బిహార్‌కు, ఈశాన్య రాష్ట్రాలకు ప్రయోజనకారిగా ఉండేలా 256 కిలోమీటర్ల పొడవున డబ్లింగ్ పనులు చేపడతారు. నర్కటియాగంజ్-రక్సాల్-సీతామఢీ-దర్భాంగ;సీతామఢీ- ముజఫర్‌పూర్ మధ్య ఈ పనులు చేపడతారు. ఈ పనులు పూర్తయితే పవిత్ర అయోధ్యను సీతామఢీతో అనుసంధానించడం తేలిక అవుతుంది. దాదాపు 40 వంతెనలను కలుపుతుంది.
బాబు అనుకుంటే సాధించేవరకు ఊరుకోరు
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వ్యాఖ్య
అమరావతికి చల్లని కబురు చెప్పడానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ చివరిలో నేతల మధ్య సరదా సంభాషణ సాగింది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. అశ్వినీ వైష్ణవ్ రైల్వేమంత్రిగానే కాకుండా.. ఐటీ మంత్రిగా కూడా తనను తాను నిరూపించుకున్నారని, అందుకే వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారని చమత్కరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ... ఒరిజినల్ ఐటీ మ్యాన్ చంద్రబాబు నాయుడని కొనియాడారు. విజనరీ ఉన్న వ్యక్తిగా బాబును అభివర్ణించారు. ‘‘రైల్వే ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని చంద్రబాబు అన్నారు కదా? సాధ్యమేనా’’ అని అశ్వినీ వైష్ణవ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. చంద్రబాబు అనుకుంటే సాధించే వరకు ఊరుకోరని నవ్వుతూ సమాధానమిచ్చారు.