Share News

నీతి ఆయోగ్‌ భేటీకి చంద్రబాబు

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:13 AM

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ 9వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం శనివారం జరగనుంది.

నీతి ఆయోగ్‌  భేటీకి చంద్రబాబు

ఆరేళ్ల తర్వాత హాజరుకానున్న ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ, జూలై 26(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ 9వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం శనివారం జరగనుంది. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతున్నారు. ఇంతకుముందు ఆయన 2018 జూన్‌ 17న జరిగిన నీతి ఆయోగ్‌ 4వ పాలక మండలి సమావేశంలో పాల్గొన్నారు. వికసిత్‌ భారత్‌పై చంద్రబాబు ఈ సమావేశంలో తన అభిప్రాయాలను ప్రకటిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే గత ఐదేళ్లలో విధ్వంసమైన ఏపీ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా వివరించి, దాన్ని పట్టాలపైకి తెచ్చేందుకు తీసుకోవల్సిన చర్యలను ప్రతిపాదిస్తారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. వికసిత్‌ భారత్‌-2047 అనే పేరుతో నీతీఆయోగ్‌ ఇప్పటికే ఒక ఆధారపత్రాన్ని రూపొందించింది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం, ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా చేర్చడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రజల జీవన నాణ్యతను పెంచడం అవసరమని ఈ ఆధారపత్రంలో పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించడంలో రాష్ట్రాల పాత్రపై సుదీర్ఘంగా చర్చిస్తారని నీతీఆయోగ్‌ వర్గాలు తెలిపాయి.

ప్రతిపక్ష నేతల డుమ్మా

కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్న పలువురు ప్రతిపక్ష నాయకులు నీతీఆయోగ్‌ సమావేశానికి డుమ్మా కొట్టనున్నారు. ఈ భేటీకి హాజరు కావడం లేదని తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రకటించారు. ఆ తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా గైర్హాజరవుతారని కాంగ్రెస్‌ పేర్కొంది. పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌ సైతం సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ తాను ఈ భేటీకి హాజరు కాలేనని మోదీకి ముందుగానే లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, టీఎంసీ నేత డెరిక్‌ ఒబ్రెయిన్‌ మాత్రం ఈ సమావేశానికి హాజరు కానున్నారు.

ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు

గన్నవరం విమానాశ్రయం నుంచి శుక్రవారం సాయంత్రం బయలుదేరిన సీఎం చంద్రబాబు రాత్రి 8 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. ఎయిరుపోర్టులో టీడీపీ ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, దగ్గుమళ్ల ప్రసాదరావు, కృష్ణప్రసాద్‌, కేశినేని శివనాథ్‌ తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. సీఎం వారికి పుష్పగుచ్ఛాలు తీసుకురావద్దని సూచించారు. ఎయిరుపోర్టు నుంచి నేరుగా వన్‌ జన్‌పథ్‌లోని అధికారిక నివాసానికి చేరుకున్నారు. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించనున్న నీతీఆయోగ్‌ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.

Updated Date - Jul 27 , 2024 | 03:13 AM