Amaravati: అమరావతికి మహా వరం
ABN , Publish Date - Nov 14 , 2024 | 05:34 AM
అమరావతి శీఘ్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఫలించింది.
ఔటర్, తూర్పు బైపాస్ భూసేకరణ ఖర్చు భరిస్తాం.. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం హామీ
చంద్రబాబు ప్రయత్నాలతో తప్పిన రూ.6 వేల కోట్లకుపైగా ఆర్థిక భారం
రాజధానిలో రోడ్ల పనులకూ ఊపు
కేంద్ర వార్షిక ప్రణాళికలో బైపాస్
త్వరలో ఔటర్‌పైనా నిర్ణయం
ప్రతిగా స్టేట్ జీఎస్టీ, పన్నుల నుంచి మినహాయింపును కోరిన కేంద్రం
అంగీకరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): అమరావతి శీఘ్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఫలించింది. రాజధాని అభివృద్ధిలో కీలక మైన రెండు ప్రాజెక్టుల భూ సేకరణ ఖర్చును కేంద్రమే భరించనుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (ఎంవోఆర్‌టీహెచ్) సానుకూలత వ్యక్తం చేసింది. ఆ ప్రాజెక్టుల్లో ఒకటి 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు. మరొకటి 59 కిలోమీటర్ల పొడవైన తూర్పు బైపాస్. ఈ రహదారుల నిర్మాణం చేయాలంటే వేల ఎకరాల భూమిని సేకరించాలి. ఇందుకు రూ.6 వేల కోట్లపైనే నిధులు అవసరం. ఏపీకి ఉన్న అప్పులు, ఆర్థిక కష్టాల నేపథ్యంలో భూ సేకరణ చేసే స్థోమత సర్కారుకు లేదు. ఆ ఖర్చును కేంద్రమే భరించాలని చంద్రబాబు ఇటీవల ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్ర రహదారుల మంత్రి నితిన్‌గడ్కరీని కలిసి విజ్ఞప్తిచేశారు. అప్పుడు పరిశీలన చేస్తామని మాత్రమే కేంద్రమంత్రి చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు సూచనల మేరకు ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, అధికారులు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి సీఎం విన్నపాల గురించి కేంద్రం వద్ద ప్రస్తావించారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఫలించాయి.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, తూర్పుబైపాస్‌ల కోసం భూ సేకరణకు అయ్యే ప్రతీ రూపాయి తామే భరిస్తామని ఎంవోఆర్‌టీహెచ్ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వక సమాచారం ఇచ్చింది. ప్రతిగా, పరోపకారం కింద తమకు స్టేట్ జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఇందుకు సర్కారు కూడా సరేనంది. స్టేట్ జీఎస్టీని మినహాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు ఆరువేల కోట్ల (ఔటర్ 4వేలు, తూర్పుబైపాస్ 2వేల కోట్ల)భారం తప్పింది. ఇదంతా సీఎం చంద్రబాబు చొరవతోనే జరిగిందని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రె డ్డి తెలిపారు.
అద్భుతమైన ముందడుగు...
తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 కాలంలోనే అమరావతి ఔటర్ రహదారి నిర్మాణం ప్రతిపాదించింది. దీన్ని భారత్‌మాల చాలెంజింగ్ కార్యక్రమం కింద చేర్చి అమలు చేసేందుకు కేంద్రం అప్పట్లో అంగీకరించింది. అయితే, భూ సేకరణ ఖర్చు సగం భరించాలని కేంద్రం షరతు విధించింది. దీనిపై చర్చోపచర్చలు సాగుతుండగానే ఎన్నికలు జరిగి జగన్ అధికారంలోకి వచ్చారు. అమరావతి రాజధానినే ధ్వంసం చేసిన జగన్, దానికోసం ఉద్దేశించిన ఔటర్ ప్రాజెక్టును కూడా పక్కనపెట్టించారు. కానీ, అప్పటికే అలైన్‌మెంట్, భూ సేకరణ డీపీఆర్‌లు రెడీ అయ్యాయి. ఈ ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం వ్యతిరేకించిందన్న కారణంతో కేంద్రం కూడా పక్కనపెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలివిడత ఢిల్లీకివెళ్లినప్పుడు కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి పెద్ద ప్రజంటేషన్ ఇచ్చారు. అమరావతి ఔటర్‌కు రూ.26 వేల కోట్ల నిర్మాణ వ్యయం కానుంది. ఇందులో భూసేకరణ వ్యయం 4వేల కోట్లపైనే. ఈ నేపధ్యంలో రహదారి నిర్మాణంతోపాటు, భూ సేకరణ కేంద్రమే చేయాలని చంద్రబాబు గట్టిగా కోరడం సత్ఫలితాన్నిచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణంలో ఇదో అద్భుతమైన ముందడుగు అని మంత్రి జనార్దన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాగా, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును ఏ స్కీమ్ కింద చేపట్టాల్నో కేంద్ర రోడ్డు రవాణా శాఖ పరిశీలన చేస్తోంది. ఈ ప్రాజెక్టుపై డీపీఆర్ తయారు చేయాల్సి ఉంది.