Share News

Big Breaking: మద్యం వ్యవహారంపై సీఐడీ దర్యాప్తులో కొత్త కోణాలు

ABN , Publish Date - Aug 27 , 2024 | 06:02 PM

మద్యం వ్యవహారంపై సీఐడీ దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగుచూశాయి. ఏపీ బేవరెజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ, వైసీపీ పెద్దలు, వారి బినామీల ఆస్తులపై సీఐడీ ఫోకస్ చేసింది. ఈ క్రమంలో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు ఉన్నట్టు సీఐడీ అధికారులు గుర్తించారు.

Big Breaking: మద్యం వ్యవహారంపై సీఐడీ దర్యాప్తులో కొత్త కోణాలు
AP CID

అమరావతి: మద్యం వ్యవహారంపై సీఐడీ దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగుచూశాయి. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ, వైసీపీ పెద్దలు, వారి బినామీల ఆస్తులపై సీఐడీ ఫోకస్ చేసింది. ఈ క్రమంలో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు ఉన్నట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. విలువైన భూములు ఉన్నట్టుగా సమాచారం సేకరించారు. దీంతో కమీషన్లు అందుకున్న వైసీపీ పెద్దలు, బినామీల పేరిట ఉన్న ఆస్తుల గుర్తింపులో పురోగతి లభించినట్టయింది.


మద్యం కమీషన్లు అందుకున్న వైసీపీ పెద్దలు, లేదా వారి బినామీలతో పాటు పెట్టుబడులు, ఆస్తుల క్రయ విక్రయాలు, కంపెనీల ఏర్పాటుపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలను సీఐడీ అధికారులు ఇప్పటికే సేకరించారు. పూర్తి వివరాలను సేకరించిన తర్వాత సాక్ష్యాలను పరిశీలించాలని నిర్ణయించింది. పూర్తి వివరాలు అందిన తర్వాత మాత్రమే కేసులో అరెస్టులు ప్రారంభించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.


వాసుదేవ రెడ్డిపై ఫిర్యాదు

కాగా ఎన్నికల సమయంలో మద్యం సరఫరాలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఏపీ బేవరేజెస్‌ ఎండీ వాసుదేవరెడ్డిని ఈసీ పక్కకు తప్పించింది. అయితే... వైసీపీ ఓటమి తర్వాత ఆయన తన వెంట కొన్ని కీలక ఫైళ్లు తీసుకెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయం నుంచి అనుమానాస్పద రీతిలో ఫైళ్లు తీసుకెళుతుండగా చూశానంటూ.. గద్దె శివకృష్ణ అనే వ్యక్తి విజయవాడలోని నున్న పోలీసులకు సమాచారం అందించారు. వారు స్పందించకపోవడంతో సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.


కాగా గద్దె శివకృష్ణ ఫిర్యాదు మేరకు ప్రసాదంపాడు ప్రాంతంలో ఉన్న ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ముందు నుంచి శివకృష్ణ స్నేహితుడితో కలిసి వాహనంలో వెళ్లారని, అక్కడ ఆగిఉన్న ఏపీ 39 ఎన్‌క్యూ 6666 నంబరు గల కారులో కొన్ని ఫైళ్లు, కంప్యూటర్‌ పరికరాలు, ఇతర పత్రాలను ఎక్కిస్తుండటం గమనించానని పేర్కొన్నారు. తన స్నేహితుడితో కలిసి కొంత దూరం వాహనాన్ని వెంబడించానని, ఫైళ్లు తీసుకెళ్లిన వ్యక్తి వాసుదేవ రెడ్డి అని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చానని పేర్కొన్నారు. శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా డీఎస్పీ శ్రీనివాసరావు ఎఫ్‌ఐఆర్‌(17/2024) నమోదు చేశారు. ఐపీసీ 427, 397, రెడ్‌ విత్‌ 120(బి) కింద కేసు పెట్టారు. దర్యాప్తునకు ముగ్గురు సీఐల నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దించిన విషయం తెలిసిందే.

Updated Date - Aug 27 , 2024 | 06:09 PM