Share News

ప్రభుత్వాన్ని రోడ్డున పడేస్తే సహించను

ABN , Publish Date - Nov 30 , 2024 | 04:53 AM

కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వైఖరిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వాన్ని రోడ్డున పడేస్తే సహించను

ఆది, జేసీపై చంద్రబాబు ఆగ్రహం

అమరావతికి చేరిన ‘బూడిద’ పంచాయితీ

బీజేపీ ఎమ్మెల్యే ఆది, టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌ రాక

జ్వరం వచ్చిందని జేసీ, ఆయన కొడుకు గైర్హాజరు

ప్రజల్లో పలుచనయ్యే పనులెందుకు?

ఇంకోసారి రోడ్డెక్కితే తీవ్ర పరిణామాలు

నేను చర్యలు తీసుకునేదాకా తెచ్చుకోవద్దు

ఉభయులకూ ముఖ్యమంత్రి హెచ్చరిక

నేడు అనంత పర్యటనలో ఆయనతో జేసీ భేటీ?

అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వైఖరిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత వ్యవహారాలతో కూటమి ప్రభుత్వా న్ని రోడ్డున పడవేస్తే సహించేది లేదని స్పష్టంచేశారు. జమ్మలమడుగు పరిధిలోని ఎర్రగుంట్లలో ఉన్న రా యలసీమ థర్మల్‌ విద్యుత్కేంద్రం(ఆర్‌టీపీపీ) నుంచి వెలువడుతున్న ఫ్లైయాష్‌ రవాణాపై వీరి మధ్య వివా దం తలెత్తింది. ప్రభుత్వం మారిన తర్వాత జేసీకి చెందిన వాహనాలు ఈ బూడిదను తాడిపత్రి నియోజకవర్గంలోని ఎల్‌అండ్‌టీ సిమెంట్‌ కర్మాగారానికి రవాణా చేస్తున్నాయి. ఇటీవల ఆదినారాయణరెడ్డి వర్గీయులు జేసీ వాహనాలను అడ్డగించారు. తమ నియోజకవర్గంలోని ఫ్యాక్టరీ నుంచి వచ్చే బూడిదను తామే రవాణా చేసుకుంటామని, జేసీ వాహనాలను రానిచ్చేది లేదని ప్రకటించారు. దీంతో జేసీ కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అధికారులు జోక్యం చేసుకున్నా సమస్య పరిష్కారం కాలేదు.

కొన్ని రోజులుగా జేసీ వాహనాలను అడ్డగిస్తూనే ఉన్నారు. వీరిద్దరి వివాదంపై సీఎం సీరియస్‌ అయ్యారు. ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డిలను, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కొడుకు, తాడిపత్రి ఎమ్మె ల్యే అస్మిత్‌రెడ్డిని పిలిపించాలని ఆయన ఆదేశించారు. దీంతో ఆది, భూపేశ్‌రెడ్డి శుక్రవారం అమరావతి సచివాలయంలో సీఎంను కలిశారు. జ్వరం వచ్చిందంటూ జేసీ తండ్రీ తనయులు రాలేదు. ఈ సందర్భంగా ఆది, జేసీలపై చంద్రబాబు మండిపడినట్లు సమాచారం. ‘మీమీ వ్యక్తిగత వ్యవహారాల కోసం ప్రభుత్వా న్ని రోడ్డున పడవేస్తారా? ఒక స్థాయికి వచ్చిన తర్వా త బాధ్యతతో పనిచేయాలని తెలియదా? మీ ఇద్దరికీ సీనియారిటీ ఉంది. ప్రజల్లో పలుచనయ్యే పనులు ఎందుకు చేస్తున్నారు? ఇంకోసారి రోడ్డెక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నా నిర్ణయం నేను తీసుకుంటాను. తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. మీ వల్ల ప్రభుత్వ/పార్టీ ప్రతిష్ఠ దెబ్బ తింటూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేను’ అని అన్నారు.


స్థానికులకు ఇవ్వాలన్నదే: ఆదినారాయణరెడ్డి

ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ.. ‘ఇది సాధారణమైన చిన్న సమస్య. మా ఇద్దరి మధ్య వివాదం రావాల్సినంతది కాదు. ‘థర్మల్‌ కేంద్రం నుంచి తడి ఫ్లైయాష్‌ వస్తుంది. అది ఉచితం. దాని గురించే ఈ గొడవ. మేం సీఎంకు సవివరంగా చెప్పాం. నిర్ణయాన్ని ఆయనకు వదిలిపెట్టాం. దీనిపై జిల్లా అధికారులను ఆరా తీయొచ్చు’ అని ఆయన అన్నారు.

తగాదా తెచ్చింది ఆయనే.. జేసీ వివరణ

సీఎం సమక్షానికి రాకపోయినా టీడీపీ ముఖ్య నేతలకు జేసీ ఫోన్‌ చేసి వివరణ ఇచ్చినట్లు సమాచారం. ‘మేం ఎంతో కాలం నుంచి బూడిద రవాణా చేస్తు న్నాం. గతంలో ఎవరూ ఆపలేదు. వైసీపీ హయాంలో ఆపారు. టీడీపీ వచ్చాక మళ్లీ రవాణా చేస్తున్నాం. గతంలో ఆదినారాయణరెడ్డి కూడా దీనిని అడ్డుకోలేదు. ఇప్పుడు అడ్డుకుంటున్నారు. కొత్త తగాదా తెచ్చింది ఆయన తప్ప నేను కాదు’ అన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 04:53 AM