సమగ్ర సమాచార వేదికగా ఆర్టీజీఎస్
ABN , Publish Date - Dec 12 , 2024 | 04:02 AM
సమగ్ర సమాచార వేదికగా ఆర్టీజీఎస్ పనిచేస్తుందని ఆ విభాగం సీఈవో దినేశ్ కుమార్ అన్నారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది.
పౌర సేవల కోసం సమగ్ర డేటా సేకరణ.. రియల్ టైమ్‌లో పథకాల పర్యవేక్షణ
త్వరలోనే ప్రతి గ్రామానికీ ప్రొఫైల్.. వాట్సాప్ ద్వారా ఫిర్యాదు సదుపాయం
ఆర్టీజీఎ్‌సలో డేటా లేక్ ఏర్పాటు.. దేశంలోనే తొలిసారి: సీఈవో దినేశ్
అమరావతి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): సమగ్ర సమాచార వేదికగా ఆర్టీజీఎస్ పనిచేస్తుందని ఆ విభాగం సీఈవో దినేశ్ కుమార్ అన్నారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. భవిష్యత్ లక్ష్యాలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఒకే రాష్ట్రం.. ఒకే సుపరిపాలన నినాదంతో ప్రభుత్వ శాఖలన్నింటినీ కేంద్రీకృత పర్యవేక్షణతో పౌర సేవలను విస్తరించాలని సూచించారు. ఈ సదస్సులో ఆర్టీజీఎస్, వినతుల పరిష్కారం, వాట్సాప్ గవర్నెన్స్.. వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎ్‌స)పై సీఈవో దినేశ్ కుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులందరికీ సంతృప్త స్థాయిలో అందేలా కార్యచరణను అమలు చేస్తున్నామని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్ టెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్ వంటి అధునాతన సాంకేతికతో ఆర్టీజీఎస్ పనిచేస్తుందని తెలిపారు. పథకాల అమలులో ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నామని వెల్లడించారు. పౌరుల డేటా అనుసంధానంతో సరళతర దరఖాస్తు విధానాలను అమలుచేస్తూ భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సులభంగా పరిష్కరించేలా కార్యచరణను సిద్ధం చేశామని చెప్పారు. ఆర్టీజీఎస్ 4.ఓ కింద సుపరిపాలన అందించేలా చర్యలు చేపడతామన్నారు. ఒక రాష్ట్రం.. ఒక పరిపాలన.. ఒక పౌరుడు.. ఒక టేటా.. విధానంలో రాష్ట్రంలోని పౌరులందరికీ సకాలంలో సేవలందించేలా ప్రభుత్వ శాఖలన్నింటినీ సమన్వయం చేస్తామన్నారు.
శాఖల మధ్య డేటా అనుసంధానం..
త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ ఒక ప్రత్యేక ప్రొఫైల్‌ను సిద్ధం చేస్తున్నామని దినేశ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వంలో మొత్తం 40 శాఖల్లో 4,338 డేటా ఫీల్డులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు వాటి మధ్య డేటా లింకేజీ ఉండేది కాదన్నారు. దీనికోసం ప్రభుత్వంలోని వివిధ శాఖల డేటాను మొత్తం అనుసంధానించేలా ప్రత్యేక డేటా లేక్‌ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రత్యేకంగా ఒక డేటా లేక్‌ను ఏర్పాటు చేసుకోవడం దేశంలోనే ఇదే తొలిసారని చెప్పారు. ఆర్టీజీఎస్ ద్వారా ఈ డేటాను నిరంతరం విశ్లేషించి యంత్రాంగానికి పాలన సులభతరమయ్యేలా చేస్తామని చెప్పారు. పాలనలో ఎదురయ్యే వినూత్న సమస్యలకు పరిష్కార మార్గాలను ఈ టెక్నాలజీ ద్వారా విశ్లేషించి రియల్ టైమ్‌లో పరిష్కారాలు సూచించేలా చేస్తామన్నారు.
స్మార్ట్ గవర్నెన్స్ అన్నది సీఎం చంద్రబాబు విధానమని, దానికి అనుగుణంగా ఆర్టీజీఎస్ అన్ని శాఖలతో అనుసంధానమై పనిచేస్తుందని చెప్పారు. డేటా లేక్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ప్రొఫైల్ తయారు చేస్తామని, అందులో ఆ గ్రామ సమగ్ర స్వరూపం ఉంటుందన్నారు. అక్కడ సమస్యలతో సహా అన్ని వివరాలూ జిల్లా కలెక్టర్లకు, అధికారులకు సులభంగా తెలిసేలా రూపొందిస్తామన్నారు. పౌరుల అర్హత ఆధారంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు దక్కేలా చర్యలు తీసుకుంటామని దినేశ్‌కుమార్ వెల్లడించారు. ఆధార్ నంబరు వచ్చాక జాతీయ స్థాయిలో పౌర సేవలు సులువయ్యాయని ఆయన చెప్పారు. జియో ట్యాగింగ్‌లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ మ్యాపింగ్ చేస్తామని, ప్రతి ఇంటి సమాచారాన్నీ సేకరిస్తున్నామని తెలిపారు.
వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు..
పౌరులు తమ సమస్యలకు సంబంధించి ప్రభుత్వాధికారులకు, ప్రభుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు చేసుకునే సరికొత్త సదుపాయాన్ని త్వరలో తీసుకురానున్నామని దినేశ్ కుమార్ చెప్పారు. వాట్సా్‌పలో ఫిర్యాదును టైపు చేయలేని వారు.. వాయిస్ మెసేజ్ పంపితే దాన్నే ఫిర్యాదుగా స్వీకరించే విధానం అమలు చేయడానికి కృషి చేస్తామన్నారు. త్వరలోనే ఈ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆర్టీజీఎ్‌సతో ఇటీవలే గూగుల్ ఎంవోయూ కుదుర్చుకుందని, ఆ సంస్థ సహకారంతో పాలనలో మరింత సాంకేతిక సౌలభ్యాలు తీసుకొస్తామని చెప్పారు. ఏఐ ద్వారా సర్వైలెన్సు కెమెరాలు ఉపయోగించి ఆస్పత్రుల్లో శానిటేషన్ పనులను పర్యవేక్షిస్తామని చెప్పారు. మార్చి నెలాఖరుకల్లా జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలను పూర్తి చేస్తామన్నారు.