CM Chandrababu Naidu: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 04 , 2024 | 12:43 PM
తిరుమల లడ్డూ కల్తీ ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. "తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేయడానికి ఆదేశించిన సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. సత్యమేవ జయతే, ఓం నమో వేంకటేశాయ" అని చంద్రబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
5 మంది సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐ నుంచి ఒక సీనియర్ అధికారి ఉండాలని పేర్కొంది. సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తీర్పు వెలువరించింది.
సిట్ సభ్యులపై సందేహాల్లేవు..
ధర్మాసనం తీర్పు వెలువడక ముందు.. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు ఎదుట కీలక అంశాలు ప్రస్తావించారు. ‘‘తిరుమల లడ్డూ వ్యవహారం మొత్తాన్ని పరిశీలించాను. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవు. సిట్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే ఆమోదయోగ్యం కాదు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారు. సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే.. రాజకీయ జోక్యం ఉండదు’’ అని తుషార్ మెహతా అన్నారు. ఈ మేరకు స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం తీర్పు వివరాలు తెలుసుకోవడానికి కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి
Tirumala: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. సుప్రీం సంచలన నిర్ణయం
Pawan Kalyan : సనాతన ధర్మంపై దాడిని సహించం!
For Latest news and National news click here